నిమ్మల రామానాయుడు రూటే వేరు.. ప్రత్యర్థి ఎవరైనా పైచేయి ఆయనదేనా
x
నిమ్మల రామానాయుడు

నిమ్మల రామానాయుడు రూటే వేరు.. ప్రత్యర్థి ఎవరైనా పైచేయి ఆయనదేనా

పాలకొల్లులో ముచ్చటగా మూడోసారి విజయం సాధించడానికి నిమ్మల రామానాయుడు సిద్దమవుతున్నారు. మరి మూడోసారి ప్రత్యర్థిని చిత్తు చేయడంలో నిమ్మల నెగ్గుతారా..


నిమ్మల రామానాయుడు.. ఆంధ్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నాయకుడు. ప్రత్యర్థి ఎవరైనా పైచేయి ఆయనదే. తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ ప్రజలకు చేరవయ్యారు. 2000వ సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన నిమ్మల రామానాయుడు ఎదురులేని నేతగా నిలిచారు. 2005లో పాలకొల్లు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2006లో మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2014లో తొలిసారి పాలకొల్లు ఎమ్మెల్యే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో కూడా ప్రత్యర్థులను చిత్తు చేసి రెండోసారి గెలిచారు. ఇప్పుడు 2024లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాలు సాధించాలని ప్లాన్ చేస్తున్నారు. విజయాలు సాధించడంలోనే కాదు ప్రజల సమస్యలపై పోరాటం చేయడంలో కూడా ఆయన రూటే సపరేటు. ఆయన రొడ్డెక్కారంటే హాట్ టాపిక్‌గా మారుతుంది. అందుకు పాలకొల్లు నుంచి అమరావతికి చేసిన సైకిల్ యాత్ర, అక్రమ మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా దళితుల భూముల్లో రాత్రుళ్లు చేసిన బస నిదర్శనాలు.

ప్రత్యర్థి ఎవరైనా తనదే పైచేయి
2014 ఎన్నికల్లో పాలకొల్లు నియోజవర్గం ఎమ్మెల్యే పదవి కోసం టీడీపీ తరపున నిమ్మల రామానాయుడు బరిలోకి దిగారు. వైసీపీ తరఫున మేక శేషుబాబు పోటీకి సిద్దమయ్యారు. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు ప్రచారాలు చేశారు. కానీ చివరకు మాత్రం 6,196 ఓట్ల మెజార్టీతో నిమ్మల రామానాయుడు గెలిచారు. అదే విధంగా 2019 ఎన్నికల్లో కూడా సీహెచ్ సత్యనారాయణ మూర్తి(బాబ్జి)ని చిత్తు చేశారు. 2024 ఎన్నికల్లో రామానాయుడితో పోటీకి గూడాల శ్రీహరి గోపాలరావు సిద్ధమవుతున్నారు. ఈసారి కూడా ఎలాగైనా గెలవాలని రామానాయుడు వ్యూహాలు రచిస్తున్నారు. అంతేకాకుండా పాలకొల్లులో తానే గెలుస్తానని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

స్మశానంలో నిద్ర
అంతేకాకుండా ప్రజల, సమాజ సమస్యలకు పెద్దపీట వేస్తూ వాటి పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్లే నాయకుడిగా కూడా నిమ్మల రామానాయుడికి పేరుంది. అందుకు 2018లో ఆయన స్మశాన వాటికలో నిద్రించిన ఘటన నిదర్శనం. హిందూ స్మశాన వాటిక ఆధునీకరణలో జరుగుతున్న జాప్యానికి వ్యతిరేకంగానే ఆయన ఈ చర్యలకు పూనుకున్నారు. స్మశానంలో పనిచేయడానికి కార్మికులు భయపడుతున్న కారణంగా వారికి భరోసా కల్పించాలనే అలా చేసినట్లు ఆయన అప్పట్లో చెప్పారు. ‘‘స్మశాన వాటికలో సరైన వసతులు లేకపోవడంతో ఆదునీకరణ కోసం రూ.3 కోట్లు మంజూరు చేశాం. కానీ స్మశానంలో పని అనడంతో కాంట్రాక్టర్లు ఎవరూ ముందడుగు వేయట్లేదు. కార్మికులు కూడా అక్కడ పని చేయడానికి భయపడుతున్నారు. దీంతో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చినా పని మాత్రం ముందుకు సాగడం లేదు. దానికి తోడు ఇదే సమయంలో ఇక్కడ సగం కాలిన మృతదేహం లభ్యం కావడంతో అది దెయ్యాలు చేసిన పనే అని పుకార్లు పుట్టుకొచ్చాయి. దీంతో వర్కర్లు, ప్రజల్లో భయం మరింత పెరిగింది. వారికి భరోసా కల్పించడానికి స్వయంగా తానే ముందుకు వస్తున్నట్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రకటించారు. చెప్పినట్లుగానే వచ్చి రాత్రి వేళ అదే స్మశానంలో భోజనం చేసి నిద్రించారు. ఇలా ఒక రోజు కాదు వరుసగా నాలుగు రోజులు చేశారు. దీంతో అక్కడ పని చేయడానికి వర్కర్లు ముందుకొచ్చారు. మరుసటి రోజు నుంచి సుమారు 50 మంది కార్మికులు స్మశాన ఆధునీకరణ పనిలో పాల్గొన్నారు. ఇప్పటికీ అప్పట్లో రామానాయుడు చేసిన పని గురించి కథలు కథలుగా చెప్పకుంటారు’’ అని అక్కడి స్థానికులు చెబుతున్నారు.

అమరావతికి సైకిల్ యాత్ర
2019లో పాలకొల్లు టీడీపీ అభ్యర్థిగా నిమ్మల రామానాయుడు విజయం సాధించినా రాష్ట్రంలో మాత్రం వైసీపీ ప్రభంజనం సృష్టించింది. రికార్డు స్థాయిలో 151 స్థానాల్లో గెలుపొంది ప్రతిపక్షం లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సీఎం జగన్‌మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే మార్చ్ 2022న టీడీపీ నిర్మించిన టిడ్కో ఇళ్లను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే సర్కార్‌పై ఒత్తిడి తీసుకురావడానికి ఆయన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం నుంచి అమరావతిలోని అసెంబ్లీకి సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఆయన చర్యలను అప్పటి టీడీపీ నేతలు కూడా స్వాగతించారు. తమ పూర్తి మద్దతును ప్రకటించారు. ‘‘ప్రతి లబ్దిదారునికి టీడీపీ అండగా ఉంటుంది. మొద్దు నిద్రలో ఉన్న జగన్ సర్కార్‌ను నిద్రలేపడానికే టీడీపీ ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల ముందు ఉచితం అని ప్రకటించి ఇప్పుడు బ్యాంకు రుణాలతో లబ్ధిదారుల నడ్డి విరిచేందుకు వైసీపీ ప్రభుత్వం చూస్తోంది. వారి వైఖరిని ఎండగట్టడానికే సైకిల్ యాత్ర చేస్తున్నా. ప్రజల కష్టాలు, ఇష్టాలు తెలుసుకోకుండానే జగన్ పరిపాలన చేస్తున్నారు. పేదల సొంతింటి కల నెరవేరే వరకు ప్రభుత్వంతో పోరాడతాం’’ అని అప్పట్లో ఆయన ప్రకటించారు. ఇదే అంశంపై కొన్ని నెలల క్రితం కూడా నిమ్మల రామానాయుడు.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

దళితుల భూముల్లో బస
దళితుల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని 2023 జూన్‌లో ఎమ్మెల్యే రామానాయుడు ఆరోపించారు. ఇందులో భాగంగానే వీటిని వెంటనే అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గోదావరి గట్టుపై నిరసనకు దిగారు. ఆ రోజు రాత్రికి అక్కడే ప్రజలతో పాటు కలిసి దళితుల భూముల్లోనే బస చేశారు. అందరితో కలిసి భోజనం చేసి, పెరుగులంక సమీపంలో గోదావరి ఒడ్డున ఆరుబయటే స్నానం చేసి అక్కడే నిద్రించారు. ‘‘దళితులకు ఎన్ని రోజులైనా అండగా ఉంటా. వారికి న్యాయం జరగడమే నాకు కావాలి’’అని ఆయన వెల్లడించారు. ఇలా ఆయన రాజకీయ ప్రస్థానంలో మరెన్నో సంఘటనలు ఉన్నాయి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం లెక్కలేనన్ని సార్లు రోడ్డెక్కారు, జైలుకు వెళ్లారు. కానీ తన అంతిమ లక్ష్యం మాత్రం ప్రజల సంక్షేమమే అని అందుకోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని, ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటానని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు.
నిమ్మల రామానాయుడు నేపథ్యం
6 మే 1969న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని అగర్తిపాలెంలో జన్మించారు నిమ్మల రామానాయుడు. ఆయన 1992లో ఎంఏ పూర్తి చేశారు. 1995లో ఎంఫిల్ ఉత్తీర్ణులయ్యారు. 2000 సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేసి పలు పదవులను నిర్వర్తించారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా టీడీపీ తరపున ఎన్నికల బరిలో నిలబడి విజయం సాధించారు. 2019లో కూడా గెలిచి ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా ఎమ్మెల్యే పదవిని అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరి ఆయన గెలుపుల హ్యాట్రిక్ చేస్తారో చేయరో చూడాలి.


Read More
Next Story