బీజేపీ మెప్పు కోసమేనా?
ఇదంతా కేంద్రంలోని బీజేపీ కూటమి మెప్పు పొందేందుకేనని, పైగా ప్రధాన మంత్రి మనసులో చోటు సంపాదించడమే కాకుండా నిత్యం వార్తల్లో ఉండేందుకు చేసిన పనేననే చర్చ కూడా రాష్ట్రంలో సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ పోకడలపై కూడా చర్చకు తెరలేచింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ప్రధాన మంత్రి ఆహ్వానించారా? లేదా అమిత్ షా, నడ్డా లాంటి వారు పిలిచారా అనేది బయటకు రాలేదు. తాను మహా రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళుతున్నానని షెడ్యూల్ ప్రకటించారు. అలాగే ప్రచారానికి వెళ్లి వచ్చారు. ఆ సమయంలో ప్రచారానికి వెళ్లాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సోదరుని మృతితో ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకోవాల్సి వచ్చింది.
రెండోసారి ఢిల్లీ పెద్దల వద్దకు..
ఢిల్లీ బీజేపీ పెద్దలను కలిసేందుకు ఈనెల 6న ఒకసారి వెళ్లారు. ఆ తరువాత తిరిగి నేడు ఢిల్లీ పెద్దలను కలిసారు. పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌లను మంగళవారం కలిసారు. ఇంకా పలువురు నేతలను కలిసే అవకాశం ఉంది. ఈ ముగ్గురు మంత్రుల వద్ద వారి శాఖల నుంచి నిధులు రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా కోరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్లే అవకాశం ఉందని జనసేన పార్టీ వారు తెలిపారు.
వెళ్లిన ప్రతిసారీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షా, నడ్డాలను కలిసి మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బిజేపీకి పెద్దదిక్కుగా పవన్ కళ్యాణ్ మారారని చెప్పొచ్చు. ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ పార్టీకి, బిజేపీకి ఏపీలో సీట్లు సంపాదించారు. బిజేపీ వారు కూడా పట్టించుకోని సనాతన ధర్మాన్ని పూర్తి స్థాయిలో భుజానికెత్తుకున్నారు. ఏపీలో హిందూత్వ వాది ఎవరని మాట్లాడాల్సి వస్తే పవన్ కళ్యాణ్ మాత్రమేనని చెప్పాల్సి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు.
కేంద్రంలోని బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉండటం వల్ల రాష్ట్రంలో పవన్ కళ్యాణ్‌పై ఈగ కూడా వాలే పరిస్థితులు ఉండవనే ఆలోచనకు పవన్ కళ్యాణ్ వచ్చిఉంటారనే చర్చ కూడా పలువురు రాజకీయ ఆయకుల్లో ఉంది. ప్రస్తుతం కేంద్రంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కంటే పవన్ కళ్యాణ్‌కే పలుకుబడి ఎక్కువగా ఉందనే చర్చ కూడా సాగుతోంది. చంద్రబాబు నాయుడు లౌకిక వాదిగా ఉన్నారు. ఏనాడూ ఒక మతాన్ని నెత్తిపైకి ఎత్తుకోలేదు. అలాగని ఏ మతాన్ని చిన్న బుచ్చలేదు. అన్ని మతాలను గౌరవంగా చూస్తున్నారు. అన్ని వర్గాల వారితోనూ సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు.
పవన్ కళ్యాణ్‌లో రకరకాల వర్ణాలు కనిపిస్తున్నాయి. సాధారణ వ్యక్తులు పార్టీలు మారినట్లుగా మాటలు మారుస్తున్నారు. విప్లవ వాదం నుంచి సనాతన వాదిగా మారటం అనేది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేననే చర్చ సాగుతోంది. ఈ చర్చకు ఇప్పట్లో తెరపడే అవకాశాలు కూడా కనిపించడం లేదు.
స్పష్టత లేని వ్యక్తి పవన్ కళ్యాణ్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలపై స్పష్టమైన వైఖరి లేదని ప్రొఫెసర్ డాక్టర్ వి అంజిరెడ్డి అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ కేంద్ర బిజేపీ పెద్దల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని ఫెడరల్ పాఠకులతో పంచుకోవాలని కోరగా పై విధంగా వ్యాఖ్యానించారు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యక్తం చేసిన భావాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. సామాజిక, వామపక్ష, లౌకిక వాదినని మొదట అన్న పవన్ కళ్యాణ్ నేడు సనాతన వాదినని, హిందూ మతం అంటే అభిమానమని అంటున్నారు. దీనిని బట్టి ఈయనకు ఒక దృక్పదం లేదని నేను భావిస్తున్నాను. బిజేపీకి దగ్గర కావడానికి, అధికారం కోసం చెబుతున్న మాటలుగానే ఉంటున్నాయి తప్ప మరొక విధంగా కనిపించడం లేదు. స్వతంత్రమైన రాజకీయ దృక్పదం లేనందునే ఇవన్నీ వస్తున్నాయనే భావన కలుగుతోంది.
మౌలిక రాజకీయ అంశాలపై ఆయనకు స్పష్టత లేదు. స్వతంత్ర అభిప్రాయాలపై నిలబడలేదు. స్పష్టమైన రాజకీయ స్థిరత్వం లేని వ్యక్తి. మతంపైన, జాతీయ వాద దృక్పదంపైనా స్పష్టత లేని వ్యక్తిగా పవన్ కళ్యాణ్‌ను చెప్పాల్సి ఉంటుంది. ఎవరితోనైనా సన్నిహితునిగా ఉండొచ్చు. అది వేరు. పౌరులంగా మనం అంచనా వేస్తాం. ఒక స్థాయికి వచ్చారు. అధికారంలో ఉన్నారు. దేనిపైనైనా స్పష్టత ఉండాలి. రాజకీయాలంటే ఏమిటి? సమస్యల పట్ల ఉండే వైఖరి. అది పవన్ కళ్యాణ్‌లో కనిపించడం లేదు. ఏదైనా ఒక దాని గురించి స్పష్టత ఉండాలంటే గతంలో నేను కొన్ని అభిప్రాయాలు చెప్పాను. అవి నాకు నచ్చలేదు. అందుకే వదిలేస్తున్నాను, వాటిని ఇప్పుడు నమ్మడం లేదు అని అనాలి. అప్పుడు రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తిగా భావించొచ్చని అంజిరెడ్డి అభిప్రాయ పడ్డారు. బిజేపీతో సంబంధం అనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. పార్టీ అభిప్రాయం కూడా అదే అయినప్పుడు స్పష్టత ఉంటే బాగుంటుందని ఆయన అన్నారు.