అందరి చూపులు పవన్‌ కల్యాణ్‌పైనే ఉన్నాయి. రాష్ట్రం నలుమూలల పవన్‌ కల్యాణ్‌ గురించే చర్చ సాగుతోంది. ఏమిటా చర్చ.. ఏమిటా చూపులు


టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, నారా లోకేష్, ఇతర ప్రముఖల గెలుపు ఓటముల కంటే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గెలుస్తారా, ఓడి పోతారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వామా? కూటమి ప్రభుత్వమా? అనే చర్చకు మించిన స్థాయిలో పవన్‌ గెలుపోటములపై నరాలు తెగే ఉత్కంఠత రేగుతోంది. ఎందుకంటే జనసేన పార్టీ పెట్టి పదేళ్లు గడిచినా పవన్‌ ఇంత వరకు అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్షా అని పిలవకపోవడమే ఇందుకు కారణం.

ఎన్నికల్లో పడని తొలి అడుగు..
రాష్ట్ర విభజన అనంతరం 2014 మార్చి 14న హైదరాబాద్‌ వేదికగా పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించినట్టు ప్రకటించారు. భారీగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో జెండా, ఎజెండాను కూడా ప్రకటించారు. దీంతో తొలి ఎన్నికల్లో భారీ సంఖ్యలో అభ్యర్థులను పోటీకి నిలిపి పవన్‌ సత్తా చాటుకుంటారని ఆయన అభిమానులు, ఆశావాహులు ఎదురు చూశారు. వారి అంచనాలు తల్లకిందులు చేస్తూ పవన్‌ 2014 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి మద్దతు పలికారు. నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయోన్స్‌(ఎన్డీఏ) కూటమిలో బీజేపీ, టీడీపీకి పవన్‌ బయట నుంచి మద్దతు పలికారు. ఒక్క సీటు ఆశించకుండా బేషరతుగా ఆ ఎన్నికల్లో చంద్రబాబును భుజానికెత్తుకున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు వంటి సీనియర్‌ నేత అవసరమనే వాయిస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లెడంలో పవన్‌ తన వంతు పాత్ర పోషించారు. ఏమైతేనేం ఎన్డీఏ కూటమి అత్యధిక సీట్లు సాధించడంతో చంద్రబాబు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. చంద్రబాబు మంత్రివర్గంలో బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు సైతం చోటు దక్కింది. కూటిమి గెలుపులో కీలకపాత్ర పోషించిన పవన్‌కు మాత్రం ఐదేళ్లపాటు పదవులతోపాటు ఏ ఒక్క అవకాశం దక్కలేదు. దీంతో పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లోనే ప్రత్యక్ష రాజకీయాల్లో వపన్‌ అడుగు ముందుకు పడకపోగా ఐదేళ్లపాటు అధికారభాగస్వామ్యం దక్కకపోవడం గమనార్హం.
మలి ఎన్నికల్లో లెఫ్ట్‌ రైట్‌ అని నినదించిన పవన్‌
రాజకీయ పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లో చంద్రబాబుకు జై కొట్టిన వపన్‌ 2019లో జరిగిన మలి ఎన్నికల్లో లెఫ్ట్‌ రైట్‌ అంటూ నినదించారు. అధికారం కోసం వాడుకుని వదిలేసిన చంద్రబాబు తనను తీవ్రంగా అవమానించారంటూ ఘాటుగా విమర్శలు చేశారు. తనపై వ్యక్తిగతంగా విమర్శించారని, తన తల్లిని అవమానించారని అంటూ చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణలపై ఎన్నికల సభల్లో పవన్‌ నిప్పులు చెరిగారు. సీపీఎం, సీపీఐ, బీఎస్పీ నేతలతో ఉమ్మడిగా ఎన్నికల సభలు నిర్వహించడంతోపాటు చెగువేరా తనకు ఆదర్శమని, కమ్యూనిస్టు సాహిత్యాన్ని లక్షలాది పుస్తకాలు చదివానని గంభీరమైన ఉపన్యాసాలు చేశారు. అప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత(ఓట్ల)ను చీల్చి పరోక్షంగా ఆయనకు మేలు చేసే ఉద్దేశ్యంతోనే వేరు కుంపటి పెట్టుకుని పవన్‌ పోటీ చేశారనే విమర్శలు కూడా అప్పట్లో విన్పించాయి. ఏది ఏమైనప్పటికీ ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగిన చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబకడంతో 2019 ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పలేదు.
రెండు చోట్ల పోటీ చేసినా.. ఒక్క చోటైనా పరువు దక్కలేదు
‘వ్రతం చెడ్డా ఫలితం దక్కలేద’నే మాదిరిగా పవన్‌కు 2019 ఎన్నికల ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. కూటమి నుంచి బయటకు వచ్చి వామపక్షాలు, బీఎస్పీలతో పొత్తు పెట్టుకున్న పవన్‌ ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి 5.6 శాతం ఓట్లు తెచ్చుకోగలిగారు. రాష్ట్రంలో 137 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను పోటీకి నిలిపితే కేవలం తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి రాపాక వరప్రసాదరావు గెలుపొందారు. జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక సైతం ఐదేళ్లపాటు సీఎం వైఎస్‌ జగన్‌కు జైకొట్టడం పవన్‌ తీవ్ర అవమానంగా భావించారు. జనసేన అధినేత పవన్‌ ఎందుకైనా మంచిది అనుకుని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక నుంచి బరిలోకి దిగారు. రెండు చోట్ల పోటీ చేసినా ఒక్క చోటైనా పరువు దక్కలేదు.
అధ్యక్షా.. అనాలనే పట్టుదల ఫలిస్తుందా?
జనసేన పార్టీ పెట్టిన తర్వాత చంద్రబాబుకు అనుకూలంగా ఒకసారి, వ్యతిరేకంగా మరోసారి ఎన్నికల గోదాలోకి దిగిన పవన్‌ పదేళ్లపాటు ఎటువంటి అధికార హోదా లేకుండానే గడిపేశారు. జనసేనకు ఈసారి ముచ్చటగా మూడవ ఎన్నికలు కావడంతో బీజేపీ, టీడీపీ కూటమితో మరోసారి జట్టు కట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చేసి సీఎం వైఎస్‌ జగన్‌ను ఏమైనాసరే ఓడించి, కూటమి అధికారం చేపట్టాలనే పట్టుదలతో వపన్‌ పనిచేశారు. ఈ నేపథ్యంలోనే సీట్ల పంపకం నుంచి ఓట్లు బదలాయింపు వరకు పవన్‌ రాజీపడుతూ అడుగులు వేశారు. అధ్యక్షా.. అనాలనే పట్టుదలతో పవన్‌ పీఠాపురం నుంచి పోటీకి దిగారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో కాపుల ఓట్లు గణనీయంగా ఉండటంతో పవన్‌ ధీమాగా ఉన్నారు. ఆయన్ను ఓడించాలనే పట్టుదలతో ౖవైఎస్సార్‌సీపీ సైతం వ్యూహాలను అమలు చేసింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మిథున్‌రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వంటి ఉద్దండులకు పీఠంపురం బాధ్యతలు అప్పగించారు. వారితోపాటు కీలక నేతలు రంగంలోకి దిగి పవన్‌పై అస్త్రశస్త్రాలు సంధించారు. పవన్‌ మాత్రం కాపులు, మత్స్యకార, ఎస్సీ యువతపై ఆశలు పెట్టుకుని గెలుపు ధీమాతో ఉన్నారు. దీంతో ఈ సారైనా పవన్‌ అసెంబ్లీలో అధ్యక్షా అని గళం వినిపిస్తారనే భావనలో ఆయన అభిమానులు, ఆ పార్టీ శ్రేణులు ఉన్నారు.
Next Story