మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పోలీసు కేసుల్లో ఊరట లభిస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.


ఆంధ్రప్రదేశ్‌లో 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజక వర్గంలో నమోదైన కేసుల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు కాకుండా పడుతున్న తంటాళ్లు అన్నీ ఇన్నీ కావు. ఎన్నికల రోజు, మరుసటి రోజు జరిగిన దాడుల్లో ఎమ్మెల్యేపై హత్యాయత్నం, ఈవీఎంల ధ్వంసం, మహిళపై దురుసుగా ప్రవర్తించడం వంటి కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం వాదోప వాదాలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది. మంగళవారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది.

ఇప్పటికే ఈవీఎంల ధ్వంసం కేసులో వచ్చే నెల 6వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్టు చేయొద్దంటూ కోర్టు ఆదేశించింది. మాచర్ల అసెంబ్లీ నియోజక వర్గంలో గతంలో లేని విధంగా ఈ ఎన్నికల్లో హింస చెలరేగడానికి పోలీసుల నిర్లక్షమే కారణమని భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా పోలీసు శాఖపై తీవ్రమైన చర్యలు తీసుకుంది. కొందరు ఐపీఎస్‌లను కూడా సస్పెండ్‌ చేసింది. దీంతో పోలీసు శాఖ కూడా జరిగిన నేరాలపై పూర్తి స్థాయి దృష్టి పెట్టింది. సంఘటన జరిగిన రోజు ఫిర్యాదులు రాకపోయినా, బాధితులు ముందుకొచ్చి విషయం చెప్పేందుకు భయపడుతున్నారనే విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వారి వద్దకే వెళ్లి పోలీసు శాఖ అండగా ఉంటుందంటూ వారి ద్వారా ఫిర్యాదులు తీసుకొని కేసులు నమోదు చేశారు.
అలాంటి వాటిల్లో ప్రధానమైనవి
1. రెంటచింతల మండలం పాల్వాయి రైల్వే గేటు వద్ద పోలింగ్‌ స్టేషన్‌లో ఈవీఎంలను ఎమ్మెల్యే పిన్నెల్లి ధ్వసం చేయడం.
2. అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ ఏజెంటు నంబూరి శేషగిరిరావుపై కొందరు పిన్నెల్లి అనుచరులు దాడి చేసి తల పగుల గొట్టారు. ఐపీసీ 307 సెక్షన్‌ కింద కేసు నమోదైంది.
3. పోలింగ్‌ మరుసటి రోజు కారంపూడిలో ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అరాచకం సృష్టించి పలు వాహనాలు దగ్దం కావడానికి కారణమయ్యారు. అడ్డుకోబోయిన సీఐ టీపీ నారాయణస్వామిపై దాడి చేసి గాయపరిచారు. ఇందులోను ఐపీసీ 307 సెక్షన్‌ కింద కేసు నమోదైంది.
4. ఈవీఎంలను ధ్వంసం చేసి బయటకు వచ్చిన ఎమ్మెల్యే పిన్నెల్లిని చెరుకూరి నాగ శిరోమణి ఎందుకు ఈవీఎంలను పగులగొట్టావయ్య అని ప్రశ్నించినందుకు ఆమెను తీవ్రంగా దుర్బాషలాడారని చేసిన ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీసులు పిన్నెల్లిపై ఐపీసీ 506, 509 సెక్షన్‌లు 131 ఆర్పీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసులు నుంచి పిన్నెల్లి బయట పడేందుకు ముందస్తు బెయిల్‌కు పిటీషన్‌లు దాఖలు చేసుకోగా మంగళవారానికి తీర్పును కోర్టు వాయిదా వేసింది.
Next Story