చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి విడదల రజిని మధ్య రాజకీయ పోరు పల్నాడు జిల్లాలో కాక రేపుతోంది.


పల్నాడు జిల్లా చిలకలూరిపేట రాజకీయం వేసవి రాకముందే వేడెక్కింది. మాజీ మంత్రులు ఇరువురూ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. తెలుగుదేశం, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల మధ్య రాజకీయ రగడ కంటే వ్యక్తిగత కక్షలు కూడా పెరిగిపోతున్నాయి. పుల్లారావ్ నేను మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటా. నాపైన, నా కుటుంబం పైన కేసులు పెట్టిస్తావా. కాస్కో చెబుతున్నా అంటూ మాజీ మంత్రి రజిని ప్రత్తిపాటి పుల్లారావుకు వార్నింగ్ ఇచ్చారు. దీనికి కౌంటర్ గా పుల్లరావు మాట్లాడుతూ సిగ్గుండాలి. ఏడు నెలల తరువాత ఇప్పుడొచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అరాచకాలు, అవినీతి నాకు తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి రెండూ ఒక వరలో కత్తులే...

ఒకప్పుడు వీరిద్దరూ ఒక వరలోని కత్తులే. ఆ కత్తులు విడిపోయి బాకుల్లా మారాయి. విడదల రజిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి చిలకలూరిపేట నుంచి 2019లో పుల్లారావు పైనే పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి చెందిన వారిలో కొంత మందిపై మంత్రి కేసులు పెట్టించారని ఆరోపణలు వచ్చాయి. తరువాత జరిగిన పరిణామాల్లో 2024లో జరిగిన ఎన్నికల్లో చిలకలూరిపేట కాకుండా గుంటూరు వెస్ట్ సీటును విడదల రజినీ కి జగన్ కేటాయించారు. అక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ తరపున గెలిచారు. ఎన్నికలకు ముందే ఇద్దరూ రాజకీయంగా దూరంగా ఉంటూ ఒకరిపై ఒకరు పోటీ చేసి రాజకీయ శత్రువులుగా మారారు.

రజిని పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

మాజీ మంత్రి విడదల రజిని పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. చిలకలూరిపేట అర్బన్ పోలీసులు పుల్లరావు చెప్పినట్లు కేసు నమోదు చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో సోషల్ మీడియాలో టీడీపీకి చెందిన పిల్లి కోటేశ్వరరావు అనే వ్యక్తి రజిని పై అసహ్యంగా పోస్టు పెట్టినట్లు గుర్తించిన పోలీసులు స్టేషన్ కు పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. విచారణ పేరుతో స్టేషన్ లో ఐదు రోజుల పాటు ఉంచినట్లు కోటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. ఆ సంఘటనపై తాను కేసు పెడితే పోలీసులు పట్టించుకోలేదని, అప్పట్లో తనను కులం పేరుతో మంత్రి పిఏ లు జయ ఫణీంధ్ర, రామకృష్ణలు దూషించారని కోటేశ్వరరావు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేట అర్బన్ సీఐ వి సూర్యనారాయణ, విడదల రజిని, ఆమె పిఏలు ఫనీంధ్ర, రామకృష్ణలపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు పుల్లారావు ప్రోద్బలంతోనే కోటి చేశారని రజిని ఆరోపించారు. ఎప్పుడో జరిగిన దానికి, నాకు సంబంధం ఏమిటని ఆమె ప్రశ్నించారు.

రజిని కుటుంబ సభ్యులపై కేసులు

రజిని మామ (80 సంవత్సరాలు)పైన, రజిని మరిది పైన వేరు వేరుగా పోలీసులు కేసులు పెట్టారు. గతంలో రజిని మంత్రిగా ఉన్నప్పుడు పలువురిని బెదిరించారని, అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై కూడా రజిని స్పందించారు. 80 ఏళ్ల నా మామ గారు ఎవరిని బెదిరిస్తారని ప్రశ్నించారు. నా మరిది అమెరికా సిటిజన్ అని, అక్కడ వ్యపారాలు చేసుకుంటూ నా వద్దకు వస్తే ఆయనపై కూడా కేసులు పెట్టించారని రోజులన్నీ ఇలాగే ఉండవని అన్నారు.

కత్తులు దూస్తున్న ఇరు పార్టీల నాయకులు

ఒక వైపు ప్రత్తిపాటి పుల్లారావు తరపున తెలుగుదేశం పార్టీ నాయకులు, మరో వైపు వైఎస్సార్ సీపీ వైపున విడదల రజిని నాయకత్వంలోని వారు ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నారు. వీరిద్దరూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు కావడం, పుల్లారావు శిశ్యురాలుగా ఉన్న రజిని వైఎస్సార్ సీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మాపైనే పెత్తనం చేస్తుందనే భావన చాలా మంది తెలుగుదేశం పార్టీ వారిలో ఉంది. పుల్లారావు కూడా ఎలాగైనా రజిని యాక్టివిటీకి చెక్ పెట్టాలని పావులు కదుపుతున్నారు.

నలుగుతున్న పోలీసులు

పుల్లారావు, రజిని లు మాజీ మంత్రులు కావడం, పుల్లారావు అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఎవరికీ ఏమి చెప్పాలో తెలియక పోలీసులు మధ్యలో నలిగి పోతున్నారు. విడదల రజిని, ఆమె మామ, మరిది పై కేసులు నమోదు కావడంతో మీకూ కుటుంబం ఉందనే విషయం గుర్తుంచుకోవాలని పుల్లారావుకు రజిని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోననే ఆందోళలో పోలీసులు ఉన్నారు.

Next Story