రేవంత్ పర్యటన కాంగ్రెస్ కు కలిసొచ్చేనా...
x
Source: Twitter

రేవంత్ పర్యటన కాంగ్రెస్ కు కలిసొచ్చేనా...

ఆంధ్ర ఎన్నికల ప్రచార బరిలోకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని దించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. రేవంత్ రెడ్డి పర్యటన కాంగ్రెస్‌కు కలిసొస్తుందా..


తంగేటి నానాజీ



విశాఖపట్నం: రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితి ఏర్పడింది. పదేళ్లపాటు అధికారానికి, ప్రజలకు దూరమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంచెం పుంజుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తిరిగి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పీసీసీ చీఫ్ షర్మిల కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.


కంచుకోటకు బీటలు.....


ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్న పేరు ఉండేది.కాంగ్రెస్‌ను అమితంగా ఆదరించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర విభజన తర్వాత దూరం పెట్టారు.నవ్యాంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఇప్పుడు ఉనికిని కాపాడుకోవడమే కష్టంగా మారింది. రాష్ట్ర విభజన అంశం సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దెబ్బ కొట్టింది. మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఘోరమైన పరాభవాన్ని 2014 ఎన్నికల్లో ఆ పార్టీ చవిచూసింది. నవ్యాంధ్ర రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా సాధించకపోగా, 150 పైగా అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. దీంతో పార్టీలోని ముఖ్య నేతలు అందరూ ఇతర పార్టీలకు ఒక్కరు ఒకరుగా వలస పోయారు. దీంతో కాంగ్రెస్ ఖాళీ అయింది.




ఈసారైనా ఖాతా తెరిచేనా...?


పదేళ్లపాటు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో నైనా పుంజుకుంటుందా... ఒక్క సీట్ అయినా దక్కించుకొని ఖాతా తెరవనుందా... అంటే ఈసారి తమ ఉనికి తో పాటు అసెంబ్లీలో చెప్పుకోదగ్గ స్థానాలను కైవసం చేసుకుంటాం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. '2014తో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో తమ పార్టీ మంచి పురోగతి సాధించింది. అభ్యర్థులు దొరకని పరిస్థితి నుంచి ఒక్కో స్థానానికి నలుగురైదుగురు అభ్యర్థులు పోటీ పడే స్థాయికి వచ్చాం. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను 13 వందల దరఖాస్తులు అందాయి. అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నాం. తప్పక మంచి ఫలితాలు సాధిస్తాం.' అన్నారాయన.


రేవంత్ పర్యటన ఖరారు...


రాష్ట్ర విభజన తర్వాత ప్రజల నిరాదరణకు గురై ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్‌కు తిరిగి పూర్వ వైభవం దక్కుతుందా... రేవంత్, షర్మిల చరిష్మా ఎంతవరకు పనిచేస్తుంది... ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విశాఖ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 16న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో జరిగే మహాసభలో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఈ వేదిక. సాక్షిగా అధికార ప్రతిపక్ష పార్టీలను ఎండగట్టనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, వాల్తేరు రైల్వే జోన్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాలను ఎన్నికల ప్రచారాస్త్రాలుగా కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ షర్మిల విమర్శనాస్రాలతో ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎంత మేరకు ప్రజలను ఆకట్టుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.



Read More
Next Story