కన్నా లక్ష్మినారాయణకు పెదకూరపాడు..గుంటూరు పశ్చిమ స్థానాలు కలిసొచ్చినట్లు సత్తెనపల్లి కలిసొస్తుందా?


జి విజయ కుమార్

కన్నా లక్ష్మినారాయణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో బలమైన నాయకుడు. నాలుగు సార్లు పెద్దకూరపాడు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజక వర్గానికి మకాం మార్చారు. ఇక్కడ నుంచి కూడా ఒక సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా 2024 ఎన్నికల బరిలోకి దిగిన కన్నాకు సత్తెనపల్లి కలిసి వస్తుందా లేదా అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. తొలుత కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ ప్రయాణం సాగించిన కన్నా రాష్ట్ర విభజన అనంతరం పార్టీ వీడారు. కాంగ్రెస్‌ నుంచి 2014లో బిజెపీలోకి వెళ్లారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షులుగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో నరసరావుపే పార్లమెంట్‌ నియోజక వర్గం నుంచి బిజెపీ అభ్యర్థిగా ఎంపీగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో నాలుగో స్థానంలో నెట్టబడ్డారు. కన్నా కంటే జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీలోకి దిగిన నాయుబ్‌ కమల్‌ షేక్‌కు 51వేలకుపైగా ఓట్లు లభించాయి. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో కన్న పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు. 2013లో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు సమయంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. 2024ఎన్నికల్లో సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు. ఇక్కడ నుంచి గతంలో టీడీపీ సీనియర్‌ కోడెల శివప్రసాద్‌ గెలుపొందారు. టీడీపీ కంచుకోటగా ఉన్న సత్తెనపల్లిలో 2019 ఎన్నికల్లో అంబటి రాంబాబు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2024 ఎన్నికల్లో కూడా అంబటికే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టికెట్‌ ఖరారు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి అంబటి రాంబాబు, టీడీపీ నుంచి కన్నా లక్ష్మినారాయణ బరిలోకి దిగారు.
ఇంట గెలిచి.. రచ్చ గెలవాలని
సత్తెనపల్లి టీడీపీ టికెట్‌ దక్కించుకున్న కన్నా ప్రధానంగా ఇంట గెలిచి.. రచ్చ గెలవాలనే సూత్రంపై దష్టి సారించారు. బిజెపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి సత్తెనపల్లి టీడీపీ టికెట్‌ దక్కించుకున్న కన్నాకు టీడీపీలో సమస్యలు ఎదురవుతాయని ముందుగానే అంచనా వేశారు. తనను స్వాగతించరని, సమస్యలు సష్టిసారని ముందుగానే గెస్‌ చేశారు. ఆ పార్టీలో నెలకొన్న సమస్యలు కొలిక్కి తేవడంపై దష్టి సారించారు. టీడీపీలో వర్గాలు, గ్రూపు రాజకీయాలు లేకుండా చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. వాటిని చక్కదిద్దుకొని ఒక తాటిపైకి తీసుకొస్తే సగం విజయం సాధించినట్టే. ప్రధానంగా కోడెల శివరామ్‌ నుంచే వ్యతిరేకత, సహాయ నిరాకరణ ఎదురు కావడంతో ఇద్దరి మధ్య గ్యాప్‌ పెరిగింది. దీంతో కోడెల శివరామ్‌ మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు పూనుకున్నారు. ఆ పార్టీ పెద్దలను రంగంలోకి దింపారు.
సీటు కోసం పోటీ పడిన కోడెల శివరామ్‌
సత్తెనపల్లి టీడీపీ టికెట్‌ కోసం మాజీ మంత్రి, అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివరామ్‌ పోటీ పడ్డారు. దాన్ని దక్కించుకునేందుకు ఆయనకున్న మార్గాల్లో గట్టిగానే ప్రయత్నాలు చేశారు. అయితే కన్నా లక్ష్మినారాయణను సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు. దీంతో కోడెల శివరామ్‌ తీవ్ర అసంతప్తిగి గురయ్యారు. తనను కాదని కన్నాకు కేటాయండంతో కన్నా లక్ష్మినారాయణ వర్గానికి, కోడెల శివరామ్‌ వర్గానికి మధ్య గ్యాప్‌ పెరిగింది.
ఇద్దరి మధ్య సయోధ్య
ఇరువురి మధ్య నెలకొన్న విభేదాల కారణంగా ఎన్నికల్లో టీడీపీ నష్టం చేకూరుతుందని, ఇది గెలుపుపై ప్రభావం చూపుతుందని భావించిన టీడీపీ పెద్దలు ఇద్దరి మ««ధ్య సయోధ్య కుదిర్చేందకు రంగంలోకి దిగారు. ఇటీవల టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కోడెల శివరామ్‌ను పిలిపించుకుని మాట్లాడారు. ఎలాంటి విభేదాలకు తావు లేకుండా ఎన్నికల్లో కలిసి కట్టుగా పని చేయాలని కోడెల శివరామ్‌ను లోకేష్‌ వారించినట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో పాటుగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు నివాసంలో టీడీపీ నేతలు వేపాడ చిరంజీవిరావు, రామరాజుల సమక్షంలో కోడెల శివరామ్‌తో భేటీ అయ్యారు. పార్టీ గెలుపు కోసం పని చేయాలని జరిగిన చర్చలు ఫలించాయి. దీంతో కన్నా ఊపిరి పీల్చుకున్నారు.
ఐదు సార్లు గెలిచిన కన్నా
కాంగ్రెస్‌తో రాజకీయ ప్రయాణం సాగించిన కన్నా లక్ష్మినారాయణ ఐదు సార్లు గెలుపొందారు. 1989 నుంచి 2004 వరకు పెదకూరపాడులో నాలుగు సార్లు, 2009లో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఒక సారి గెలుపొందారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కన్నా ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పని చేశారు. 1991 నుంచి 1994 వరకు నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నేదురమల్లి జనార్థన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రి వర్గాల్లో మంత్రిగా పని చేశారు. 2004లో తొలి సారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలోను, 2009లో రెండో సారి ముఖ్యమంత్రి అయిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లోను ఆ తర్వాత సీఎంలుగా వచ్చిన కే రోశయ్య, ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గాల్లోను కన్నా మంత్రిగా వివిధ శాఖలకు ప్రాతినిధ్యం వహించారు. మరి 2024 ఎన్నికల్లో సత్తెనపల్లి అసెంబ్లీ నియోజక వర్గం కలిసి వస్తుందో లేదో వేచి చూడాలి.
Next Story