‘సీజ్ ద షిప్’ ఇటీవల బాగా పాపులర్ అయిన డైలాగ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో ఈ మాట అన్నారు.
‘సీజ్ ద షిప్’ అని ఇటీవల కాకినాడ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్‌గా చెప్పిన డైలాగ్. ఎట్టి పరిస్థితుల్లో ఆ షిప్‌ను సీజ్ చేయాలనే ఆవేశంతో అధికారులను ఆదేశిస్తూ ఆ మాట అన్నారు. దానిని నిజం చేసేందుకు ప్రభుత్వం ఇప్పుడు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. అయితే పవన్ కళ్యాణ్ ఈజీగా డైలాగ్ చెప్పేసినా.. ఇప్పుడు ఆ షిప్‌ను ఎలా సీజ్ చేయాలనేదానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలుత మల్లగుల్లాలు పడింది. బియ్యం రవాణా అనేది అంతర్జాతీయ అంశం కావడంతో తొందరపడి ఏదైనా చర్యలు తీసుకుంటే ఏమవుతుందో అనే ఆలోచనల్లో పడింది. అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ కటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందేమో అని మధన పడ్డారు. కానీ చివరికి ఓ నిర్ణయానికి వచ్చారు. ఏది ఏమైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ డైలాగ్‌ను ఎలాగైనా కార్యరూపంలోకి తెచ్చేందుకు పట్టుదలతో ఏపీ ప్రభుత్వం ముందుకు అడుగులు వేసింది. దీని కోసం ప్రత్యేక అధికారుల బృందాన్ని రంగంలోకి దింపింది. కాకినాడ పోర్టు నుంచి పశ్చిమాఫ్రికాకు బియ్యం ట్రాన్స్‌పోర్టు చేస్తున్న స్టెల్లా నౌకను తనిఖీలు చేపట్టేందు రంగం సిద్ధం చేశారు. దీని కోసం మల్టీ డిసిప్లీనరీ కమిటీ టీమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాకినాడ పోర్టులోని రేషన్ బియ్యం శాంపిల్స్‌ను సేకరించి నిజాలను నిగ్గు తేల్చనున్నారు. అందులో భాగంగా బుధవారం అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. పోర్టు, కస్టమ్స్, పౌరసరఫరాలు, పోలీసు, రెవెన్యూ అధికారులు బృందంగా సముద్రంలోకి వెళ్లి ఆ నౌకలో తనిఖీలు చేపట్టారు.