ఈసారన్నా గెలుస్తావా చంద్రన్న..?
x
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఈసారన్నా గెలుస్తావా చంద్రన్న..?

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని నాలుగు సార్లు ఓటమి వెంటాడింది. మళ్లీ ఆయనకే టీడీపీ అభ్యర్థిత్వం దక్కింది.


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: వాడిపోయిన వదనం. రెండో జాబితాలో పేరు లేదు. నిసత్తువ ఆవహించింది. మాటల్లో వైరాగ్యం తాండవించింది. టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రకటించిన మూడో జాబితాతో ఉత్కంఠకు తెరపడింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు ప్రకటించారు. దీంతో ఆయన ముఖంలో ఆనందం తాండవించింది. అభిమానులు సంబరాలతో ముంచెత్తారు. వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన చేదు జ్ఞాపకం వెంటాడుతున్నప్పటికీ సర్వేపల్లి నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు ఎట్టకేలకు ఖరారైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరు సార్లు పోటీ చేశారు. రెండు సార్లు గెలిచారు. గడిచిన నాలుగు ఎన్నికల్లో రెండు సార్లు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేతిలో, అంతకుముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో రెండు సార్లు ఓడిపోయారు.

సోమిరెడ్డిని వెంటాడిన ఓటములు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులుగా 1985లో ఎదురు రామకృష్ణారెడ్డి, 1989 లో చిత్తూరు వెంకట కృష్ణారెడ్డి విజయం సాధించారు. 1994లో సోమిరెడ్డి చంద్రమోహన్ ప్రత్యర్థిపై 35,080 ఓట్లతో, 1999లో 45,486 ఓటుతో రెండు సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో 2004లో 60,476 ఓట్ల తేడాతో, 2009లో 63,476 ఓట్ల తేడాతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోయారు. 2014లో 80,299 ఓట్లు, 2019లో 83,299 ఓట్ల భారీ తేడాతో వరుసగా రెండు సార్లు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.


పదవి ఉష్

ఎమ్మెల్సీ హోదాలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని 2019 ఎన్నికల్లో పోటీ చేయించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు.. పదవికి రాజీనామా చేయించారు. ఆ ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోయారు. అంతకుముందే మంత్రి పదవి కూడా పోయింది.

ఈసారి అదృష్టం ఎలా ఉందో..!?

సర్వేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి 2024 ఎన్నికలకు టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఆ పార్టీ చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రకటించారు. దీంతో వరుసగా మూడోసారి ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. నాలుగు సార్లు ఓటమితో చెలిమి చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఓటర్ల రూపంలో అదృష్ట దేవత వరిస్తుందో లేదో వేచి చూడాలి.


సంక్షేమమే గట్టెక్కిస్తుంది..

సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మూడోసారి వరుసగా పోటీ చేయబోతున్నారు. తమ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని గోవర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు గ్రామానికి చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డి 2006 లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జడ్పీ చైర్మన్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2011 లో వైఎస్ఆర్‌సీపీలో చేరారు. 2015 నుంచి వైఎస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన సర్వేపల్లి నుంచి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019 నుంచి అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. 2022 ఏప్రిల్ 11 నుంచి సీఎం వైఎస. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు.

పేలుతున్న మాటల తూటాలు

అభ్యర్థిత్వాలు ప్రకటించక ముందు నుంచే నెల రోజులుగా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పరం వారిద్దరూ బయటపెట్టిన అవినీతి అక్రమాలు హాట్ టాపిక్‌గా మారాయి. వారిద్దరు ఎవరికి ఎవరు తీసిపోని రీతిలో పర్యటిస్తున్నారు. ఎన్నికల నగారా మోగక ముందు నుంచే గ్రామాలను చుట్టుముట్టారు. నామినేషన్ల గడువు సమీపించక ముందే వీరిద్దరి ఆరోపణలు ప్రచారాలతో నియోజకవర్గం హోరెత్తుతోంది. ఈ ఎన్నికల్లో ఓటర్ దేవుళ్ళు ఎవరిని గట్టెక్కిస్తారో వేచి చూడాలి.



Read More
Next Story