టీడీపీ జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్‌ ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ పగ్గాలు లోకేష్‌కు ఇస్తారనే టాక్‌ తాజాగా హాట్‌ టాపిక్‌గా మారింది.


ఆంధ్రప్రదేశ్‌లో 2024ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండో దఫా ముఖ్యమంత్రి అవుతారా అనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో మరో అంశం తెరపైకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పగ్గాలు యువనేత నారా లోకేష్‌కు అప్పగిస్తారా అనేది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట టాపిక్‌గా మారింది. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, పార్టీ బాధ్యతలు ఆయనకు భారంగా మారే అవకాశం ఉందని, వయసు మీరుతున్న నేపథ్యంలో రెండు బాధ్యతలు చూడాలంటే కష్టతరంగా మారే అవకాశం ఉన్నందు వల్ల పార్టీ పగ్గాలు లోకేష్‌కు అప్పగిస్తే అన్ని విధాలుగా ఆ పార్టీని నడిపించడంతో పాటు భవిష్యత్‌ ఉన్న పార్టీగా తీర్చి దిద్దుతారనే టాక్‌ ఆ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది.

మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న శుక్రవారం విజయవాడలో మాట్లాడుతూ టీడీపీ అధ్యక్ష పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్‌కు ప్రమోషన్‌ ఇవ్వాలని, పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని, ఇది వినతి కాదని, తమ డిమాండ్‌ అని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ కోసం 3,132కిలోమీటర్లు పాదయాత్ర చేశారని, చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే పాదయాత్రకు విరామం ప్రకటించి ఢిల్లీ వెళ్లి అక్కడ లాయర్లతో సమావేశమై చంద్రబాబును కాపాడేందుకు కృషి చేశారని, తెలుగుదేశం పార్టీని ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కాపాడటంతో పాటు సక్రమంగా నడిపించే శక్తి తన పాదయాత్ర ద్వారా లోకేష్‌ కూటగట్టుకున్నారని వ్యాఖ్యానించారు. లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల వర్గాలు ఏమైనా అనుకుంటారేమో అని చంద్రబాబు భావిస్తున్నారని, కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల వర్గాలందరూ చంద్రబాబు వెనుకాలే ఉంటారని, ఎవరేమీ వ్యతిరేకించరని, ఏక గ్రీవంగా లోకేష్‌కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని కోరుకుంటున్నామని, కాబట్టి టీడీపీ పగ్గాలు లోకేష్‌కు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తాజాగా టీడీపీ శ్రేణుల్లో కలకలం సృష్టిస్తున్నాయి.
2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయాల్లోకి లోకేష్‌ ఎంట్రీ ఖాయమని, మంత్రిగా కూడా ఆయనకు అవకాశం కల్పించడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు భావించారు. అయితే లోకేష్‌ను నేరుగా మంత్రి వర్గంలో చేర్చుకోకుండా చాలా ప్లాన్డ్‌గానే చంద్రబాబు పెద్ద పీట వేస్తూ వచ్చారు. అటు పార్టీ నేతలు, కార్యకర్తల్లో వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగా తొలుత టీడీపీ పార్టీ క్యార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ నేతలకు దగ్గరయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తల బాగోగులు చూసుకోవడం, సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారిని ఆదుకుంటూ వచ్చారు. సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా లోకేష్‌ దిగ్విజయంగానే నిర్వహిస్తూ వచ్చారు. తర్వాత లోకుష్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెరపైకి తీసుకొచ్చారు. తర్వాత ఆయనను ఎమ్మెల్సీగా చేయడం, మంత్రి వర్గంలో కీలక బాధ్యతలు అప్పగించడం చేశారు. ఈ నేపధ్యంలో లోకేష్‌ అటు పార్టీలో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ అన్నీ తానై నడిపించారనే టాక్‌ కూడా అప్పట్లో వినిపించింది.
అయితే లోకేష్‌ ఎంట్రీపై ఎలాంటి వ్యతిరేకత రాకపోయినా సీనియర్లను పక్కన పెట్టి అప్పుడే వచ్చిన లోకేష్‌కు అటు పార్టీలోను, ఇటు ప్రభుత్వంలోను పెద్ద పీట వేయడాన్ని, సీనియర్లకు ప్రాధాన్యత తగ్గించడాన్ని కొంత మంది ఆ పార్టీ సీనియర్‌ నేతల సున్నితంగా వ్యతిరేకించారని, దీంతో వారు కొంత కాలం ముభావంగానే ఉన్నారనే చర్చ అప్పట్లో ఆ పార్టీ శ్రేణులో జరిగింది. దీంతో పాటుగా 2019ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన అనంతరం కొద్ది కాలం చంద్రబాబు సైలెంట్‌గా ఉండటం, పార్టీ బాధ్యతలన్నీ లోకేష్‌ చూస్తుండటంతో పార్టీ నష్ట పోతుందని, ఓడిపోయిన నేపధ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని, దీనిని అడ్డుకొని టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నింపాలంటే మీరే పార్టీ బాధ్యతలను తీసుకోవాలని కొంత మంది సీనియర్లు చంద్రబాబును కలిసి కోరడటంతో మళ్లీ చంద్రబాబు రంగంలోకి వచ్చినట్లు కూడా ఆ పార్టీలో చర్చ జరిగింది. అయితే ఇంకా 2024 ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయక ముందే లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే చర్చ తెరపైకి రావడంతో ఏమి జరుగుతుందో అనే ఆసక్తి వాతావరణం ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.
మరో వైపు 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందనే భావనలో ఆ పార్టీ నేతలు, కేడర్‌ ఉంది. దీంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రభుత్వ బాధ్యతలు చూసుకునేందుకే ఆయనకు సమయం సరిపోతుందని, పార్టీ మీద దృష్టి పెట్టడం కానీ అందరినీ సమన్వయం చేసుకోవడానికి కానీ సమయం సరిపోదని, ఈ సారి పార్టీలో యువ నాయకులు పెరిగారని, అటు సీనియర్లను, ఇటు యువ నేతలను సమన్వయం చేసుకోవాలంటే లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తేనే సాధ్యమవుతుందని కొంత మంది నేతల్లో అంతర్గత చర్చలు సాగుతుండగా, మరి కొంత మంది సీనియర్లలు మాత్రం ముభావంగానే ఉన్నట్లు చర్చ సాగుతోంది. నిప్పు లేనిదే పొగ రాదని, టీడీపీ పెద్దల డైరెక్షన్‌ మేరకే బుద్దా వెంకన్న ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారనే చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు.
Next Story