తిరుమలలో 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం రద్దు చేస్తారా?
వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం టికెట్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట అనూహ్య మలుపులు, మార్పులకు శ్రీకారం చుట్టే సూచనలు కనిపిస్తున్నాయి
వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం టికెట్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట అనూహ్య మలుపులు, మార్పులకు శ్రీకారం చుట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తొక్కిసలాటపై సీరియస్ గా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఐదుగురు అధికారులపై వేటు వేయగా తాజాగా మరికొందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలి శుక్రవారం అత్యవసరంగా భేటీ అవుతోంది. టీటీడీ ఇవో శ్యామలరావుకి, టీటీడీ ఛైర్మన్ బి.రాజగోపాల్ నాయుడు జనవరి 9న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తీవ్రవాగ్వాదానికి దిగి నువ్వెంతంటే నువ్వెంతనుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వారిద్దరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, పరస్పరం సహకరించుకుని ముందుకు సాగుతారా ? లేక ఎవరో ఒకరిపై చర్య తీసుకోమంటారా ? అని హెచ్చరిక చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జనవరి 10వ తేదీ తిరుమలలో జరుగనుంది. ఈ సమావేశం ఎజెండా ఏమిటనేది ఇంకా స్పష్టం కానప్పటికీ జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, పర్యావసానాలు, వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం జరుగుతున్న తీరు, మున్ముందు తీసుకోవాల్సిన చర్యలతో పాటు అసలు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాన్ని పది రోజుల పాటు కొనసాగించాలా లేక పూర్వం మాదిరే రెండు రోజులకు కుదించాలా అనే విషయాల్ని చర్చిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒకవేళ అదే జరిగితే ఈ పాలక మండలి తీసుకునే పెద్ద నిర్ణయమే అవుతుంది.
వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం విధానం గతంలో లేదు. ఎప్పుడు మొదలైందో కూడా తెలియదు. 1863 నుంచి ఒక్కరోజే అంటే వైకుంఠ ఏకాదశి రోజే ఈ దర్శనం ఉండేది. ఆ తర్వాత 1949 నుంచి ఏకాదశితో పాటు ద్వాదశి నాడు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉత్తరం వైపున ఉన్న తలుపులు తెరిచి భక్తుల్ని గుడిలోకి అనుమతించే వారు.
2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక టీటీడీ ఛైర్మన్ గా నియమితులైన వై.వీ.సుబ్బారెడ్డి సామాన్య భక్తులకు కూడా ఉత్తర ద్వార దర్శనం అందించాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. సుమారు రెండేళ్లు తర్జన భర్జన పడిన తర్వాత 2021లో ఓ నిర్ణయానికి వచ్చారు. 2022 నుంచి అమలు చేయాలని పాలకమండలి తీర్మానించింది. అయితే ఈ వ్యవహారమై కేఎస్ శ్రీనాథ్ శర్మ కోర్టుకు వెళ్లడం, ఆగమ శాస్త్రం ప్రకారం పది రోజుల ఉత్తర ద్వార దర్శనం లేనే లేదని వాదించారు. దానిపై వాదోపవాదాల అనంతరం హైకోర్టు మతపరమైన వ్యవహారాలలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
ఆవేళ పిటీషనర్ వాదన ప్రకారం... ఉత్తర ద్వారం లేని ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏమిటని కూడా ప్రశ్నించారు.
ఈ "వైకుంఠ ద్వారం - లేదా ఉత్తర ద్వారం" అన్నదానిపై పలు పురాణ కథలు ఉన్నాయి. చాలావరకూ వైష్ణవాలయాల్లో ఈ "ఉత్తరద్వారం/ఉత్తర గోపురం" అన్నది ఉత్తరం వైపుగా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వారం ద్వారా విష్ణుమూర్తిని దర్శించుకొంటే సకలపాపహరణం జరుగుతుందనీ, ఆ వైకుంఠాన్నే చుట్టేసినట్లనీ చెబుతుంటారు.
"కలియుగ వైకుంఠం" అయిన "తిరుమల క్షేత్రంలోని" ఆలయంలో ఈ "ఉత్తర ద్వారం" ద్వారమేదీ లేనే లేదు అనే వాదన కూడా ఉంది.
అసలు "ఉత్తర ద్వారమే లేని" తిరుమల ఆలయంలో, "ఉత్తరద్వార దర్శనం" పేరిట ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎందుకింత హడావిడి చేస్తున్నారు? అనే ప్రశ్న కూడా వినవస్తోంది. భక్తుల కోసం కాకుండా ఆదాయం కోసమే ఈ పది రోజుల దర్శనాన్ని తెర మీదికి తీసుకువచ్చారన్న విమర్శలూ లేకపోలేదు.
తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్నీ - తిరుమల ఆలయ విశేషాలనూ - తిరుమల చరిత్రనూ - తిరుమల ఆలయ నిర్మాణ పరిణామక్రమాన్నీ - తిరుమల ఆలయ సాంప్రదాయాలనూ - ఆలయంలో జరిగే కైంకర్యాలనూ - ఆలయ పాలనా వ్యవహారాలనూ - ఆర్జిత సేవల విశేషాలనూ - లెక్కకుమిక్కిలిగా ఉన్న దర్శనాల పేరిట ఆదాయ వనరుగా మార్చారని పలువురు విమర్శిస్తున్నారు.
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట తర్వాత ఈ పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం రద్దు చేసే ప్రతిపాదన తెర మీదికి వచ్చింది. ఈ పాలకమండలిలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని పలువురు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
Next Story