దశాబ్దాలు కాదు శతాబ్దాల చరిత్ర కలిగిన వృక్షాలను పునరుజ్జీవింప చేసేందుకు అడుగులు ముందుకేస్తున్నారు. అందులో భాగంగా సినిమా చెట్టును కూడా కాపాడేందుకు నడుం బిగించారు.


గోదావరి ఒడ్డున నేల కొరిగిన సినిమా చెట్టు చిగురిస్తుందా.. చిగులురు వేసి ప్రాణం పోసుకొని, పూర్వపు అందాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తుందా అనేది ఇప్పుడు ప్రకృతి ప్రేమికుల మదిలో మెదులుతున్న అనుమానాలు, ప్రశ్నలు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సినిమా చెట్టును వృధాగా పోనియ్యమని, తిరిగి పునర్జీవంప చేసుకుంటామని, పచ్చని చిగురులతో ప్రాణం పోసుకునే విధంగా రక్షింప చేసుకుంటామని ఆ పనికి పూనుకున్న పెద్దలు చెబుతున్నారు.

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో గోదావరి ఒడ్డున ఉన్న చెట్టు ఇటీవల నేలకొరిగింది. ఇది సినిమా చెట్టుగా ప్రఖ్యాతి గాంచింది. ఇది 150 ఏళ్ల వయసు కలిగిన చెట్టు. దీనికి ఉభయ గోదావరి ప్రజలకు ఎంతో అనుబంధం ఉంది. సినిమా పెద్దలకు కూడా ఈ చెట్టుతో విడదీయలేని అనుబంధం ఉంది.
గోదావరి ఒడ్డున ఉన్న ఈ చెట్టు చూడ్డానికి ఎంతో అందంగా ఉండేది. గొడుకు ఆకారంలో ఉన్న ఈ చెట్టు, దీని చుట్టు పరిసర ప్రాంతాల్లో కొన్ని వందల సినిమాల తీసారు. దీంతో ఆ చెట్టు సినిమా చెట్టుగా ఫేమస్‌ అయ్యింది. దీనిని వాన చెట్టు, నిద్ర గన్నేరు చెట్టు అంటారు. గులాబి శిరీశ అని కూడా అంటారు. ఇంగ్లీషులో రెయిన్‌ ట్రీ(Rain Tree) పిలుస్తారు. ఫాటేసి కుటుంబానికి చెందింది. సమన్నే సమన్‌((Sammanea Saman) దీని శాస్రీయ నామం. తక్కువ కాలంలో ఏపుగా పెరుగుతుంది. పచ్చగా ఉంటూ గొడుగు ఆకారంలో విస్తరిస్తుంది. పురాతన చెట్టు కావడంతో దీనిని పునరుజ్జీవింప చేసుకోవాలని నడుం బిగించారు రాజమండ్రి రోటరీ క్లబ్‌ వాళ్లు.
రోడ్లు వెడల్పు నేపథ్యంలో దశాబ్దాల చరిత్ర కలిగిన పెద్ద పెద్ద వృక్షాలను నరికేస్తున్నారు. అలాంటి చెట్లను గుర్తించి, వారానికి ఒక వైపున వ్వుకుంటూ, తల్లి వేరు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చెట్టును బయటకు తీస్తారు. ఆ చెట్టు వేర్లు పాడు కాకుండా సేంద్రీయ పద్దతుల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. అలా వేర్లు చిగురింప చేసేలా చర్యలు తీసుకుంటారు. వాటిని ప్రత్యేకంగా ప్యాక్‌ చేస్తారు. అలా చెట్టు నాలుగు వైపుల పూర్తి అయిన తర్వాత అక్కడ నుంచి తొలగించి, ఎక్కడైతే ఆ చెట్టును పెట్టాలనుకుంటారో అక్కడకు తీసుకెళ్లి నాటుతారు. దీని కోసం ముందుగానే చెట్టు సైజును బట్టి గుంతలను తవ్వుతారు. ఆవు పేడ వంటి సేంద్రీయ పదార్థాలను, మంచి మట్టిని ఆ గుంతలో వేస్తారు. తర్వాత చెట్టును తీసుకెళ్లి ఆ గుంతలో నాటుతారు. నాటిన తర్వాత చిగుళ్ళు వచ్చి, చెట్టుపైన పచ్చదనం కనిపించేంత వరకు నీళ్లు పోయడం, సేంద్రీయ ఎరువులు వేయడం వంటి ప్రత్యేక శ్రద్దలు తీసుకుంటామని, ఈ ప్రోసెస్‌ దాదాపు 3 నెలల నుంచి 4 నెలల వరకు పడుతుందని రాజమండ్రి రోటరీ క్లబ్‌ ఆఫ్‌ రాజమండ్రి ఐకాన్స్‌ చార్టర్‌ ప్రెసిడెంట్‌ తీగల రాజా ది ఫెడరల్‌కు వివరించారు. ఇదే పద్దతిలో సినిమా చెట్టును కూడా బతికించేందుకు పూనుకున్నట్లు తెలిపారు.
సినిమా చెట్టు ఎందుకు పడి పోయింది..
ఈ చెట్టు ఎప్పటి నుంచో గోదావరి తీరంలో ఉంది. పెద్దగా పెరిగి పోయిన ఈ చెట్టుకు మధ్యలో తొర ఏర్పడింది. గోదావరి వరదల సమయంలో ఒడ్డున ఉన్న మట్టి కొట్టుకొని పోయి, ఎండి పోవడం, ఆరిపోవడం వల్ల కుళ్లి పోయింది. ఈ సమస్య వల్ల చెట్టు మధ్యలో ఉన్న తొర రాను రాను పెద్దదై పోయింది. ముందుగానే ఈ చెట్టు పెళుసుగా ఉంటుంది. దీనికి తోడు కొమ్మలు పెద్దవిగా పెరిగి పోతాయి. గొడుగులాగా పెరిగి పోవడంతో కొమ్మల బరువు ఎక్కువ అయిపోతుంది. చెట్టు మధ్యలో ఉన్న తొర్ర, బరువు పెరిగిన కొమ్మలు, వరదల వల్ల చెట్టు మెత్తబడి రెండు ముక్కల కింద చెట్టు నేలకొరిగి పోయింది. ఆ చెట్టును కాపాడుకోవాలనే ప్రయత్నంలో చాలా జాగ్రత్తగా కొమ్మలను తొలగించే పనులు చేపట్టారు. గత నాలుగు రోజుల నుంచి 20 మంది టీమ్‌లుగా ఏర్పడి ఇదే పనిలో నిమగ్నమయ్యాయి. జేసీబీలు వంటి యంత్రాల సహాయంతో ఈ పనులు చేస్తున్నారు. నీరు అందుబాటులో ఉండటం వల్ల చెట్టు బాగా కండబట్టింది. దీంతో స్ట్రాంగ్‌గా తయారైంది. రంపాలకు కూడా తెగడం లేదు.
సేంద్రీయ పద్దతుల ద్వారా రెండు భాగాలుగా విడిపోయి వరిగి పోయిన చెట్టును తిరిగి జాయింట్‌ చేసి సేంద్రీయ పద్దతిలో చిగురింప చేయాలని ప్రయత్నాలు రాజమండ్రి రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో ముమ్మరంగా జరుగుతున్నట్లు తీగల రాజా తెలిపారు. అయితే రెండు కొమ్మలను వేర్వేరుగా చేయాలా లేక రెండింటిని జాయింట్‌ చేసి ఒకే చెట్టులా చేయాలనే అనేది మరి కొన్ని రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు.
అయితే ఇంత కష్టపడి చేసినా అది చిగురిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆ చెట్టు వయసు కూడా ఎక్కువ అయిపోయిందని, కుళ్లి పోవడంతో ఈ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు ఎట్టి పరిస్థితుల్లో చిగురిస్తుందని రాజా చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు చిగురించి, కొన్ని రెబ్బలైనా వస్తాయనే ఆశతో ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
దశాబ్దాల చరిత్ర కలిగిన చెట్లను ఇదే విధానంలో చిగురింప చేశారు. రోడ్ల వైడనింగ్‌లో ఈ చెట్లను కొట్లేస్తుంటే.. ఆ వృక్ష సంపదను వృధా కానీకుండా రాజమండ్రి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆ చెట్లను నెలకొల్పారు. దాదాపు పది చెట్లను ఇలా చిగురింప చేసినట్లు రాజా తెలిపారు. మర్రి, రావి, జమ్మి, మద్ది జాతికి చెందిన పది చెట్లను ఇదే విధానం ద్వారా పునరుజ్జీవంప చేసేందుకు చర్యలు తీసుకున్నామని, మరో నాలుగు చెట్లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజా తెలిపారు. మర్రి చెట్టును ఇంగ్లీషులో బన్యాన్‌(Banyan) అంటారు. ఫైకస్‌ బంగాలెన్సిస్ (Ficus bhangalensis) దీని శాస్రీయ నామం. రావి చెట్టు మోరేసీ ఫ్యామిలీకి చెందింది. దీనిని ఇంగ్లీషులో సేక్రెడ్‌ ఫిగ్‌(Sacred Figఅంటారు. ఫైకస్‌ రెలిజియోసా(Ficus Religiosa) దీని సైంటిఫిక్‌ నేమ్‌. జమ్మి చెట్టు ఫాటేసి ఫ్యామిలీకి చెందింది. ప్రోసోపిస్‌ సినెరారియా( Prosopis Cineraria ) దీని శాస్రీయం నామం. మద్దె చెట్టు శాస్త్రీయ నామం టెర్మినేలియా అర్జున(Terminalia Arjuna).ఆక్సిజన్‌కు ఆయుపట్టు అయిన పెద్ద పెద్ద వృక్షాలను కాపాడుకోవడం మన బాధ్యత. అన్నం లేక పోయినా బతకొచ్చు కాని, ఆక్సిజన్‌ లేక పోతే బతకలేమని రాజా చెప్పారు. ఇదే ప్రామాణికంగా తీసుకొని పెద్ద పెద్ద వృక్షాలను రంక్షించుకోవాలనే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఒక్కో వృక్షానికి ఒక్కో డోనర్‌ ద్వారా సహాయం తీసుకొంటూ వృక్షాలను పునరుజ్జీవింప చేసేందుకు పని చేస్తున్నామని, ఓఎన్‌జీసీ సినిమా చెట్టు పునరజ్జీవంకు ముందుకొచ్చిందని ది ఫెడరల్‌కు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం కూడా ఇలాంటి వృక్షాలను కాపాడే దిశగా చర్యలు తీసుకోవాలని, దీని కోసం ఒక జీవోను విడుదల చేయాలని సూచించారు.
Next Story