YSR With Sureedu

వైఎస్సార్‌కు నీడగా ఉన్న సూరీడు షర్మిలకు నీడగా మారతాడా? కాంగ్రెస్‌ ప్రముఖులతో పరిచయాలు ఉన్న సూరీడు షర్మిలమ్మను వెన్నంటి ఉండే అవకాశం ఉందనే చర్చ సాగుతున్నది.


దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు సూరీడు వైఎస్సార్‌ వెనకే ఉండేవాడు. ఆయనకు ఏమి కావాలో అన్నీ తానై చూసుకునేవాడు. ఇప్పుడు వైఎస్సార్‌ కుటుంబానికి దూరంగా ఎందుక వెళ్లిపోయాడు. ఎందుకు కనిపించడం లేదనేది ఆసక్తికర చర్చకు దారి తీసింది. వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌గా రావడంతో ఏపీలో మళ్లీ సూరీడు పేరు తెరపైకి వచ్చింది. షర్మిల తండ్రి వద్ద నీడలా ఉన్న సురీడు ఇప్పుడు షర్మిల వద్దకు వచ్చే అవకాశం లేకపోలేదని పలువురు చర్చించుకుంటున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాల్లో వైఎస్సార్‌ ఆత్మగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు షర్మిలతో ముందుకు సాగుతున్నారు. ఇక ఎన్‌ రఘువీరారెడ్డి, డాక్టర్‌ ఎన్‌ తులసిరెడ్డి లాంటి సీనియర్‌ నాయకులు షర్మిల వెన్నంటి ఉన్నారు. ఈ నేపథ్యంలో సూరీడు పేరు తెరపైకి వచ్చింది. షర్మిల ఇక రాజీలేని పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. రేయింబవళ్లు రాష్ట్ర పర్యటనలు చేయాల్సి ఉంటుంది. సూరీడుకు ఎంతో మంది నాయకులతో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు కూడా ఉపయోగించుకోవాలని షర్మిల భావిస్తే తప్పకుండా అక్కున చేర్చుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే సూరీడును చూడగానే వైఎస్సార్‌ పేరు స్మరించని వారు ఉండరంటే ఆశ్చర్యంగానే ఉండవచ్చు కానీ ఇది నిజమేనని పలువురు కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. సూరీడు తనంతట తాను వచ్చిన షర్మిల వెంట కార్యక్రమాల్లో తిరుగుతాడా.. లేక షర్మిల సూరీడును పిలిపించే అవకాశం ఏమైనా ఉందా? అనే చర్చ కూడా సాగుతున్నది.
వైఎస్సార్‌ మరణం తరువాత సూరీడు వైఎస్సార్‌ కుటుంబం నుంచి కనిపించకుండా పోయారు. ఎందుకు ఇలా జరిగిందో ఇప్పటికీ ఎవ్వరికీ అంతుపట్టని విషయం. వైఎస్సార్‌ జీవితంలో సగానికి పైగా సరీడు నీడలా వెన్నంటి ఉండేవాడు. ఎంత మంది ప్రభుత్వ అధికారులు ఉన్నా, అటెండర్లు ఉన్నా, ఏ వేదికపైనైనా సూరీడు వైఎస్సార్‌ వెనక కనిపించేవాడు. వైఎస్సార్‌ మరణంతో ఒక్కసారిగా కనుమరుగయ్యాడు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నా ఎక్కడా కనిపించడం లేదు. తండ్రిని మించిన తనయగా రాజకీయాల్లో ప్రవేశించిన షర్మిల సూరీడును తిరిగి ఆహ్వానిస్తారా? లేదా? అనేది చూడాల్సిందే.
Next Story