వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టించేందుకు ఆంధ్రప్రదేశ్ బిజెపి ఒక ప్లాన్ తయారు చేసింది. కేంద్ర మంత్రికి బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వివరించింది.


ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని, దీనిని ప్రైవేటీకరించడం మంచిదనే అభిప్రాయంలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ విషయం ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేసింది. పైగా కేంద్రంలో తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో తప్పనిసరిగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వంలో బుధవారం ఢిల్లీలో భారీ పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి హెచ్ డి కుమారస్వామి గౌడతో బిజెపి ఎంపీలు కలిసారు. ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బిజెపి ఎంపీలు పురందేశ్వరితో పాటు సీఎం రమేశ్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాధ రాజు, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరిలు మంత్రికి రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమలకు ఉన్న ప్రాధాన్యత వివరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించిందని, దీనిని ఆంధ్ర ప్రజలు వదులుకునేందుకు సిద్ధంగా లేరనే విషయం మంత్రికి వివరించారు.

ఎలా నష్టాల నుంచి ఉక్కు పరిశ్రమను బయట పడేయవచ్చుననే విషయం మాత్రం వెల్లడించలేదు. బిజెపి రాష్ట్ర నేతలు ఇచ్చిన ప్లాన్ ప్రకారం తప్పకుండా లాభాల్లోకి విశాఖ ఉక్కు రావడం ఖాయమని పలువురు బిజెపి వారు చెబుతున్నారు. ప్లాన్ ఏమిటి? ఎలా అమలు చేస్తారనే విషయాలు త్వరలోనే వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూపతి రాజు శ్రీనివాస శర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడు కావడం వల్ల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మంచి రోజులు వచ్చాయని పలువురు భావిస్తున్నారు. పురందేశ్వరి నుంచి అర్జీ అందుకున్న కుమారస్వామి అధికారులతో మాట్లాడారు. గతంలో తలెత్తిన పరిస్థితులు, ఎంత మొత్తం నష్టాల్లో ఉందనే విషయం అధికారులు గౌడకు వివరించారు. మరో రెండు సార్లు ఈ పరిశ్రమపై ప్రత్యేకంగా మాట్లాడదామని చెప్పారు. అందుకు అంగీకరించిన ఏపీ బీజేపీ నేతలు మంత్రి సానుకూలంగా స్పందించడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Next Story