జనవరి 8న జనసేన నేత కె నాగబాబును రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గంలో మార్పులపై చర్చ మొదలైంది. నూతన సంవత్సరంలో మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాగబాబును జనసేన పార్టీ నుంచి మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించిన నెల రోజులు దాటింది. అయినా ఈ అంశం ప్రజల్లో చర్చకు రావడం తప్ప కూటమి ప్రభుత్వంలో మాత్రం చర్చకు రాలేదు. క్యాబిటెన్ లో మార్పులు, చేర్పులు చేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం. అందువల్లనే నాగబాబును ప్రమాణ స్వీకారం చేయించడంలోనూ ఆలస్యమైందని అంటున్నారు.
కొందరు మంత్రులు ప్రభుత్వ అంచనాలకు తగిన విధంగా పనిచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. అందులోనూ తెలుగుదేశం పార్టీలోని వారే కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తూ పార్టీకి ప్రాణంగా ఉన్న వారిని కాదని అప్పటికప్పుడు పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకోవడం వెనుక జరిగిన రాజకీయాలను సీనియర్లు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రభుత్వంలో అన్నీ తానై నడుపుతూ నవతరం వారికి అవకాశం పేరుతో నారా లోకేష్ కొత్తవారికి అవకాశం ఇప్పించారని, కోతికి కొబ్బరికాయ ఇస్తే ఎలా ఉంటుందో కొత్త వారి పరిస్థితి అలా ఉందనే విమర్శలు వస్తున్నాయి. మంత్రి వర్గంలో మార్పులు చేయాలంటే కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే దానిపైనే ప్రత్యేకమైన చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే మంత్రి వర్గ మార్పులు ఆలస్య మవుతున్నాయనే ప్రచారం సాగుతోంది. టీడీపీ వారు కూడా ఇదే మాటను చెబుతున్నారు.
వేటు పడే మంత్రుల జాబితాలో రాంప్రసాద్ రెడ్డి, సత్య సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, కొలుసు పార్ధసారధి వంటి వారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ పేర్లే ఎందుకు ప్రచారంలో ఉన్నాయనే విషయం పరిశీలిస్తే ఈ ఆరు నెలల కాలంలో మంత్రులుగా వారు చేసిన పనులను బట్టి ముఖ్యమంత్రి అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ జాబితాలో ఉన్న వారిలో కొందరిని తప్పించడం సామాజిక సమీకరణల ప్రకారం చూస్తుంటే కష్టమనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. కార్మిక శాఖ మంత్రి సత్య సుభాష్. సామాజిక సమీకరణలను బట్ట చూస్తే సుభాష్ ను మంత్రి వర్గం నుంచి తప్పించే అవకాశాలు తక్కువేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి సుభాష్ కెబినెట్లోకి వచ్చారు. ఇదే సామాజిక వర్గం నుంచి పితాని సత్యనారాయణ సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా.. జూనియర్లను.. యువతను ప్రొత్సహించాలనే ఉద్దేశ్యంతో సత్య సుభాష్ కే అవకాశం ఇచ్చింది పార్టీ అధిష్టానం. అయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చాలా మంది సీనియర్ నేతలు ఉండడం.. వారికి కాకుండా సుభాష్ కు మంత్రి పదవి ఇవ్వడం ఆ జిల్లాలో ఎవ్వరికీ నచ్చలేదు. దీంతో కెబినెట్ షఫిలింగ్ జరిగితే సత్య సుభాష్ ను తప్పిస్తారనే ప్రచారం ఆ పెద్దల నుంచే జరుగుతోందనేది టాక్ జోరందుకుంది. సుభాష్ ను తప్పించమంటూ జరిగితే.. పితానికి ఛాన్స్ ఖాయమని పలువురు భావిస్తున్నారు. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జూనియర్లకు అవకాశం ఇచ్చి చూడాలన్న ఆలోచన ప్రకారం సుభాష్ ను తప్పించే అవకాశాలు దాదాపు లేవనే చర్చ జరుగుతోంది.
సుభాష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం అనేది నారా లోకేష్ ద్వారా జరిగిందని, సుభాష్ ను తప్పించేందుకు ముఖ్యమంత్రి కూడా సాహసం చేసే అవకాశం లేదనే చర్చ కూడా ఉంది. వందల కోట్లు పార్టీ తరపున ఎన్నికల్లో సుభాష్ ఖర్చు పెట్టారని, అందువల్లనే లోకేష్ సుభాష్ కు మంత్రి పదవి ఇప్పించారనే ప్రచారం కూడా ఉంది. అయితే ఇటీవల ముఖ్యమంత్రి పార్టీ సభత్వం విషయంలో సుభాష్ కు వార్నింగ్ ఇచ్చారు. టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ అందరూ పార్టీ సభ్యత్వంపై దృష్టి పెడితే కనీసం టార్గెట్ ను కూడా రీచ్ కాలేకపోతే ఎలాగంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా పనిచేస్తే మంత్రి పదవిపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఆయన మంత్రి పదవి పోయే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
మంత్రి రాంప్రసాద్ రెడ్డి గురించి కూడా చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాం ప్రసాద్ రెడ్డిని తప్పించినా ఆశ్చర్య పోవాల్సిందేమీ లేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మంత్రి వర్గంలో అతి తక్కువ కాలంలో ఎక్కువగా బద్నాం అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? అంటే అది రవాణ శాఖకు చెందిన రాం ప్రసాద్ రెడ్డే. ఆయన పేషీలో జరిగే వ్యవహరాలపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ కన్నేసిందని.. ఏసీబీ కూడా రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదనే చర్చ గత కొంత కాలంగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రాం ప్రసాద్ రెడ్డిని తప్పిస్తే.. ఆ స్థానాన్ని మరో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతతో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇదే సామాజిక వర్గానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి వచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది. వాస్తవానికి కెబినెట్టులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేరు కచ్చితంగా ఉంటుందని అందరూ మొదట భావించారు. కానీ కిషోర్ కుమార్ రెడ్డి ఆశల మీద నీళ్లు చల్లింది అధిష్టానం. అలాగే కడప జిల్లా నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన మాధవి రెడ్డి పేరును పరిశీలించే ఛాన్స్ ఉంటుందనే ప్రచారం కూడా ఉంది.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణకు అత్యంత సన్నితంగా ఉంటున్నారనే అనుమానం అధిష్టానంలో ఉంది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావును పక్కన పెట్టి.. అదే సామాజిక వర్గానికి చెందిన కొండపల్లికి మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే.. పార్టీపై పెద్దగా దృష్టి పెట్టకుండా తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ప్రచారం తెలుగుదేశం పార్టీలో ఉంది. బొత్సపై అంత అభిమానం ఎందుకనే ప్రశ్న కూడా టీడీపీ వారిలో ఉంది. అయితే ఈ కారణంగా మంత్రి పదవి నుంచి తప్పిస్తారా? లేదా? అనేది చూడాలి. ఒకవేళ కొండపల్లిని తప్పిస్తే.. కళా వెంకట్రావుకే మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
మంత్రి పార్ధసారధి వ్యవహరం గురించి కీలకమైన చర్చే జరుగుతోంది. పార్టీలోకి కొత్తగా వచ్చినా.. చాలా మంది సీనియర్ నేతలను పక్కన పెట్టి పార్దసారధికి మంత్రి పదవి ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఈ పరిస్థితుల్లో ఇటీవల జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఎపిసోడులో పార్ధసారధి పార్టీలో బాగా డామేజ్ అయ్యారు. దీంతో పార్దసారధిని తప్పించి.. పల్లా శ్రీనివాసును కెబినెట్ లోకి చేర్చుకుంటారా..? అనే చర్చ జోరుగా సాగుతోంది. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఎపిసోడుపై చంద్రబాబు, లోకేష్ స్పందచిన తీరు చూస్తుంటే.. పార్దసారధి వికెట్ పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాతావరణం ప్రస్తుతం పార్టీలో ఉంది. నిజానికి గౌతు లచ్చన్న బీసీ నేత అయినందున స్థానిక గౌడ సంఘానికి చెందిన వారు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన మనుమరాలు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు పార్థసారథిని పిలిచారు. పార్థ సారధి నూజివీడు నియోజకవర్గానికి చెందిన వారు కావడం వల్ల ప్రోటోకాల్ ప్రకారమైనా ఆయనను పిలవాల్సి ఉంది. వైఎస్సార్సీపీ నాయకుడు జోగి రమేశ్ మాజీ మంత్రి కావడం, గౌడ సంఘ నాయకుడు కావడం వల్ల ఆయన్ను కూడా పిలిచారు. జోగి వస్తున్న విషయం పార్థ సారధికి వారు చెప్పలేదు. అయినా కుల సంఘం తరపున కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి వెళ్లడం తప్పని పార్టీలోని వారే చెలువలు పలువలు చేసి ప్రచారం చేశారనే చర్చ కూడా ఉంది.
అయితే ఆరు నెలల కాలంలోనే మంత్రుల పనితీరును ఎలా అంచనా వేస్తారనే చర్చ కూడా సాగుతోంది. పైగా కుమారుడి మాటలు విని మంత్రివర్గంలోకి తీసుకున్న చంద్రబాబు లోకేష్ ను పక్కన బెట్టి వీరిని తొలగిస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఈనెల 8న నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. అదే రోజు ఉంటే మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని, లేదంటే మార్పుల మాట ప్రస్తుతానికి మరిచి పోవాల్సిందేననే చర్చ కూడా ప్రజల్లోనూ, తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనూ ఉంది.