ఏజెన్సీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన గిరిజన హిళలు. గిరిజనులు తిరస్కరించడంతో రాజకీయంగా కనుమరుగు కానున్నారు. ఎవరా మహిళలు. ఏమిటా కథ.


ఈ ఇద్దరు మహిళలు రాజకీయాల్లో కనుమరుగైనట్లేనా? ఇద్దరు ఎస్టీ మహిళలు కావడం విశేషం. వీరికి ఒక అవకాశం పార్టీలు, ఓటర్లు కల్పించారు. కానీ వారే నిలుపుకోలేకపోయారు. ఎవరా ఇద్దరు. ఎందుకు వీరు రాజకీయాల్లో నిలబడలేక పోయారు. పవర్ పాలిటిక్స్ ఇలాగే ఉంటాయా? అయితే అన్నింటినీ తట్టుకుని నిలబడగలిగిన వారు ఉంటున్నారు. ఇద్దరు గిరిజన మహిళల్లో ఒకరు ఉన్నత విద్యావంతురాలు కాగా మరొకరు హైస్కూలు స్థాయిలోనే చదువు మానుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇద్దరిని వైఎస్సార్సీపీ ఆదరించింది. వీరిద్దరికీ ఒక సారూప్యత ఉంది. 2014లో వీరు ఎమ్మెల్యేలు అయ్యారు. మధ్యలో పార్టీ మారారు. ఆ తరువాత గత ఎన్నికల్లో ఏ పార్టీలోనైతే చేరారో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీ కూడా వీరిని ఆదరించలేదు. గెలుపు గుర్రాలను చూసుకుంటారు కానీ, గెలవని వారిని ఎవరు పోటీ చేయిస్తారనే టాక్ కూడా ఇప్పుడు నడుస్తోంది. ఇంతకీ ఎవరా ఇద్దరు. ఎక్కడి వారు.

మాటమీద ఉండేవారిపై గౌరవం..

ఏజెన్సీ గిరిజనులు మాటమీద నిలబడే వారే ఎక్కువ ఉంటారు. చెప్పేదొకటి, చేసేదొకటి వీరి మనస్సుల్లో ఉండదు. వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు ఆదరించి ఓటు వేశారు. పార్టీ మారగానే ఓడించారు. పార్టీ మారిన తరువాత తాము గెలిపించినా అదే పార్టీలో ఉంటారనే నమ్మకాన్ని వారు గిరిజనులకు కలిగించలేకపోయారు. దీంతో రాజకీయాలకు వీరు పనికి రారని గిరిజనులు గీత గీశారు. అంతే ఇంకేముంది, ఓటమి చవిచూశారు.

ఈశ్వరికి దక్కని పార్టీ టిక్కెట్...

ఏజెన్సీ ఏరియాలో ప్రధానమైన అసెంబ్లీ నియోజకవర్గం పాడేరు. ఇక్కడి నుంచి కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, జనతా పార్టీలు గెలిచాయి. రెండో స్థానంలో సీపీఐ ఉంది. గిరిజనులు నమ్మిన వారిని ఎంతగానో ప్రేమిస్తారు. వారి ప్రేమకు హద్దులు ఉండవు. ద్వేషించడం కూడా అలాగే ఉంటుంది. రెండు ఎన్నికలను తీసుకుని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. 2014లో గిడ్డి ఈశ్వరి వైఎస్సార్సీపీ నుంచి గెలిచింది. ఆ తరువాత 2016లో ఆమెను వైఎస్సార్సీపీ వారు అరకు పార్లమెంట్ పరిశీలకురాలుగా నియమించారు. కానీ 2017లో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ వారు 2019లో పాడేరు నుంచి టీడీపీ టిక్కెట్ ఇచ్చి పోటీ చేయించారు. టీడీపీని తిరస్కరించడంతో పాటు గిడ్డి ఈశ్వరిని కూడా గిరిజనులు తిరస్కరించారు. ఇక్కడి నుంచి కొత్తగుళ్లి భాగ్యలక్ష్మి వైఎస్సార్సీపీ తరపున గెలిచారు. గత ఎన్నికల్లో ఓటమి చెందారని భావించిన తెలుగుదేశం పార్టీ ఈ సారి గిడ్డి ఈశ్వరికి సీటు ఇవ్వలేదు. ఈమె ఆంధ్ర యూనివర్శిటీ నుంచి ఎంఏ పూర్తి చేశారు. టీచర్ గా పనిచేస్తూ రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. పాడేరులోనే జన్మించిన గిరిజన మహిళ.

మారని రాజేశ్వరి రాత..

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నుంచి 2014లో గెలిచిన వంతల రాజేశ్వరి. ఈమె మొదటి సారి 2014లో ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీ నుంచి గెలిచారు. ఈమె రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఈమె తండ్రి కొండబాబు అడ్డతీగల మండల ఉపాధ్యక్షుడిగా, ఆ తరువాత ఎంపీపీగా చేశారు. రాజేశ్వరి కూడా 2006లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి అడ్డతీగల ఎంపీపీగా గెలిచారు. అప్పటి నుంచి రాజకీయాల్లో ఉంటూ వస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించటంతో తొలిసారి 2014లో అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే 2017లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019లో టీడీపీ వారు సీటు ఇచ్చినా వైఎస్సార్సీపీ అభ్యర్థిపై ఓటమి చవిచూశారు. అదికూడా 39,106 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఈమెకు కూడా తెలుగుదేశం పార్టీ ఈ సారి సీటు ఇవ్వలేదు. ఈమె 7వ తరగతి మాత్రమే చదువుకుంది.

Next Story