పొత్తులోనైనా ప్రత్యేక హోదాను అడుగుతారా?
ఇదే మోదీ ఆవేళ చెప్పిన మాట- ఐదు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని-. ఆర్టికల్ 370 రద్దుకు అడ్డం రాని సాకులు ఏపీ ప్రత్యేక హోదాకు వస్తాయా? ఇప్పుడైనా అడగండి..
ఉమ్మడి రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికలప్పుడు చర్చోపచర్చలు, వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు 2014 నుంచి 2024 వరకు పదేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎరిగిందే. రాష్ట్రాభివృద్ధి, ప్రజాకాంక్షను పరిగణలోకి తీసుకుని ఉద్యమించాల్సిన పార్టీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నాయనే అభిప్రాయం సర్వత్రా ఉంది. పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు మినహా మరెవ్వరూ నామమాత్రంగానే ప్రత్యేక హోదా ప్రస్తావన తీసుకురాలేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేక హోదాపై గళం విప్పడం, దానికి కమ్యూనిస్టు పార్టీలు గొంతు కలపడంతో ఈ అంశం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమైంది.
మూడు పార్టీలు... మూడు వాదనలు..
టీడీపీ యూ టర్న్...
“2014 ఎన్నికల్లో ఇప్పటి ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో కలిసే తిరుపతిలో మాట ఇచ్చారు. ఐదేళ్లకు బదులు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తాం” అని నమ్మబలికారు. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఆ తర్వాత ఆ అంశాన్ని అటకెక్కించింది. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని ఆ తర్వాత నాలుకరుచుకుని కేంద్రం తిరుగుబాటు చేసి మోదీకి ప్రత్యర్థి అయ్యారు.
వైసీపీ వాదన..
2014 నుంచి 2019 మధ్య ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నడిపారు. ప్రతి విద్యా సంస్థలో యువతీ యువకులతో సదస్సులు పెట్టారు. ప్రత్యేక హోదా అవసరాన్ని ఊరూవాడా నొక్కి చెప్పారు. ఆ సమయంలో అన్నతో పాటు వైఎస్ షర్మిల కూడా గళం విప్పారు. వైఎస్ జగన్ తన పాదయాత్రలోనూ ఈ అంశాన్ని బలంగానే వినిపించారు. 25కి 25 పార్లమెంటు సీట్లు గెలిపిస్తే కేంద్రం మెడలు వచ్చి తీసుకువస్తామన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైసీపీ ఆ అంశాన్ని మరచిపోయింది. ఇప్పుడేమో.. ‘కేంద్రానికి మన మద్దతు అవసరం లేకుండా పోయింది. మన డిమాండ్ ను ఖాతరు చేయడం లేదు’ అంటున్నారు.
పవన్.. పాచిపోయిన లడ్డూలు
“రాష్ట్రానికి ఏమిచ్చారు, రెండు పాచిపోయిన లడ్డూలు తప్ప” అని 2018లో బీజేపీ ప్రత్యేకించి మోదీపై నిప్పులు చెరిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ విషయమై నోరు విప్పక పోగా అదే పార్టీతో మళ్లీ పొత్తుకు సిద్ధమయ్యారు. తనతో పాటు టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలో చేర్చేందుకు ఢిల్లీలో మకాం వేసి మంతనాలు సాగిస్తున్నారు.
బీజేపీ వింత వాదన...
పార్లమెంటు తలుపులు మూసి ప్రత్యేక రాష్ట్ర బిల్లును ఆమోదింపజేసిన బీజేపీ... విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ పట్ల కనీస కనికరం కూడా చూపలేదని ఏ వామపక్ష పార్టీల నేతలో కాంగ్రెస్ పార్టీ పెద్దలో చెప్పాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభిప్రాయమదే అని ప్రత్యేక హోదా సాధన సమితీ కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు మొదలు రాష్ట్ర విభజనపై ఏకంగా పుస్తకమే రాసిన ఆనాటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వరకు అందరూ చెబుతారు. సాక్షాత్తు పార్లమెంటులో ప్రధాని హోదాలో ఉన్న మన్మోహన్ సింగ్ నోటి మాట ద్వారా చెప్పిన మాటల్ని బిల్లు రూపంలో తీసుకురావడంలో కాంగ్రెస్ విఫలమైందని, అందువల్లే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయామని చెప్పి తప్పించుకోజూసింది.
ఆర్టికల్ 370 రద్దు చేశారుగా మరి..
ప్రధాని పార్లమెంటులో చెప్పిన మాటల్ని భేఖాతరు చేసింది. మొత్తం తప్పంతా కాంగ్రెస్ దే అన్నట్టుగా మాట్లాడుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని పలు సందర్భాలలో పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. 15వ ఆర్ధిక సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ ఒప్పుకోవడం లేదని చెప్పి తన బాధ్యతేమీ లేదన్నట్టు తప్పించుకుంటోంది. కాంగ్రెస్ తెచ్చిన ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి మూడో కంటికి తెలియకుండా బిల్లు తెచ్చి పాస్ చేయించుకున్న బీజేపీకి ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదు. బీజేపీకి ఇష్టం లేదు గనుక చంద్రబాబును ప్రజల ముందు దోషిగా నిలబెట్టి తన పబ్బం గడుపుకుంది.
వెంకయ్య సన్మానాల మాటేమిటీ
ఐదేళ్లకు బదులు పదేళ్లు అని నమ్మబలికిన ఆనాటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఊరూరా సన్మానాలు చేయించుకున్నారు. తీరా విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ‘నేను రాజ్యాంగ పదవిలో ఉన్నాను గనుక ఏమీ మాట్లాడలేను’ అంటూ సరిపెట్టుకున్నారు. ఈవాదోపవాదనలు ఎలా ఉన్నా రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా రాలేదు. ఈ విషయంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు మినహా అందరూ నాలుక మడతేసిన వారేననేది సుస్పష్టం.
ఇప్పుడేం జరుగుతోంది...
ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ తన అస్థిత్వం కోసమే అయినా ఇప్పుడు మళ్లీ తెరపైకి తెచ్చింది. ఢిల్లీ సహా పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేసింది. గుంటూరులో డిక్లరేషన్ ప్రకటించింది. సరిగ్గా ఇదే సందర్భంలో ప్రధాన పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాటనే సాహసం చేయలేకపోతున్నాయి. పైగా అదే పార్టీతో పొత్తుకు టీడీపీ-జనసేన కూటమి వెంపర్లాడుతున్నాయి. కనీసం ఈ సందర్భంలోనైనా ‘ప్రత్యేక హోదాపై రాతపూర్వకంగా హామీ తీసుకుని పొత్తు కుదుర్చుకుంటే మంచిదని’ సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ చెప్పిన మాటను చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అయితే వీళ్లు ఆ సాహసం చేయలేరని వైఎస్ షర్మిల తెగేసిచెబుతున్నారు. కాంగ్రెస్ మాజీ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇంతకుముందే ఆ అంశాన్ని పక్కనబెట్టినందు వల్ల ఇప్పుడు ఆపార్టీ అడుగుతుందని భావించలేమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
అసలేమిటీ ప్రత్యేక హోదా...
1969లో ఆర్థికంగా అననుకూలతలున్న రాష్ట్రాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి కేంద్ర నిధుల కేటాయింపు, వివిధ రకాల పన్నులలో మినహాయింపు ద్వారా ఆ రాష్ట్రాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఐదవ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును ఆనాటి జాతీయ అభివృద్ధి మండలి అంగీకరించడంతో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా భావన అమలులోకి వచ్చింది. ప్రస్తుతం మొత్తం 11 రాష్ట్రాలు ఈ హోదాను కలిగి ఉన్నాయి.
ప్రత్యేక హోదా రావాలంటే ఏమి కావాలి
ఐదో ఆర్ధిక సిఫార్సులను అనుసరించి 1969లో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రస్తుత నియమాల ప్రకారం ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే, ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే జాతీయ అభివృద్ధి మండలి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా నీతి ఆయోగ్ వచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ప్రత్యేక హోదా అనేది నిధుల కేటాయింపులతో సంబంధం ఉండటం వల్ల కేంద్ర ఆర్థిక సంఘం నిర్ణయం కూడా ఇందులో కీలకంగా మారింది. కొండ ప్రాంతాలు, కఠిన భూభాగాలు, తక్కువ జనసాంద్రత లేదా అధిక గిరిజన జనాభా, పొరుగు దేశాల సరిహద్దు వెంబడి ఉన్న వ్యూహాత్మక ప్రాంతాలు, ఆర్థిక, మౌలిక సదుపాయాలలో వెనుకబాటుతనం, స్థిరంగా లేని రాష్ట్ర ఆర్థిక వనరులు. అంటే అతి తక్కువ వనరులు కలిగి వుండి, తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ తమ అభివృద్ధికి వనరులను సమీకరించుకోలేని స్థితిలో ఉన్న రాష్ట్రాలుగా ఈ రాష్ట్రాలను పేర్కొనవచ్చు. విభజనతో ఆర్థికంగా కుదేలయిన ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిచెందాలంటే అది ఒక్క ప్రత్యేకహోదాతోనే సాధ్యమవుతుంది. అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమై ఉండడం వల్ల ఏపీకి తీరని నష్టం చేకూరింది. కష్టాల కడలి నుంచి గట్టెక్కాలంటే రాష్ట్రానికి ప్రాణవాయువైన ప్రత్యేకహోదాను సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఉద్యోగాలైనా, పరిశ్రమలైనా, పన్నురాయితీలైనా ఇలా ఏదైనా ప్రత్యేకహోదాతోనే సాధించగలం. విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటు సాక్షిగా ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. దీన్ని సమర్థించిన నాటి ప్రతిపక్షమైన బీజేపీ హోదా ఐదేళ్ళు కాదు పదేళ్లు ఇవ్వాలని పట్టుబట్టింది. ఆ విధంగా కాంగ్రెస్, బీజేపీలు రెండూ కలిసి రాష్ట్రాన్ని విభజించాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న నిధుల్లో 30 శాతం నిధులను మొదట ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే పంచుతారు. ఆ తర్వాతే మిగిలిన 70 శాతం నిధులను ఇతర రాష్ట్రాలకు అందిస్తారు. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర నిధులు 90 శాంతం గ్రాంట్లు గాను, 10 శాతం అప్పుగాను వస్తాయి. గ్రాంట్ల ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి చెల్లించనక్కర్లేదు. లోన్ ద్వారా ఐతే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాల్లోని పరిశ్రమలకు భారీగా రాయితీలు ఇస్తారు.100 శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. ఇన్ కమ్ ట్యాక్స్ లో కూడా 100 శాతం రాయితీ ఉంటుంది. పన్ను మినహాయింపులు, ప్రైట్ రీయింబర్స్ మెంట్ లు దక్కితే... పారిశ్రామికవేత్తలు వస్తారు. ప్రత్యేక హోదాతో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వస్తాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగఅవకాశాలు సమకూరుతాయి.
ప్రత్యేకహోదా ఉండడం వల్లే ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో 2 వేల పరిశ్రమలు వచ్చాయి. తద్వారా ఉపాధి అవకాశాలు 490 శాతం పెరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ కంటే వెనకబడిన రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ కు ప్రత్యేకహోదా వల్ల 10 వేల పరిశ్రమలు వచ్చాయి. అలాంటిది 5 కోట్ల ప్రజానీకం గల 972 కి.మీ. సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లభిస్తే అది పెద్ద సంజీవనే అవుతుందన్నది ఏపీ యూత్ ఆలోచన.
ఎండమావిలో నీళ్లు ఉంటాయా!
చిత్రంగా అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం కూడా కేంద్రంలోని నరేంద్ర మోదీకే భేషరతుగా మద్దతు ఇస్తున్నందున ప్రత్యేక హోదా ఏపీకి వస్తుందనేది ఎండమావుల్లో నీటిని వెతికినట్టే అవుతుందని కాకినాడకు చెందిన నవీన్ కుమార్ అనే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ చెప్పిన మాట నిజమేనేమో అనిపిస్తుంది.