గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఆస్తులపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఆస్తులను కాపాడుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చారా... ప్రజాసేవకోసమా..


ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో5,705 కోట్లు ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి చంద్రశేఖర్. ఇప్పుడు ఆయన ఆస్తులపైనే నియోజకవర్గంలో చర్చ మొదలైంది. ఇంత పెద్దమొత్తంలో ఆస్తులు ఉన్న వ్యక్తి ఎలాగైనా బతకొచ్చు. ఎంతో మందికి సేవలు చేయొచ్చు. అయినా రొచ్చును తలపిస్తున్న నేటి రాజకీయాల్లోకి కావాలని వచ్చారు. ఆస్తులు కాపాడుకోడానికా.. నిజమైన ప్రజాసేవకా.. అనేది నియోజకవర్గంలో పెద్ద చర్చగా మారింది.

తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులున్న అభ్యర్థిగా, దేశంలోనే అత్యంత ధనిక పార్లమెంటు అభ్యర్థిగా పోటీలో ఉన్నారని సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతుంది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, ఒక్కోమెట్టు ఎదిగిన ఆంధ్రుడు. ముఖ్యంగా గుంటూరు జిల్లా వాసి. అమెరికా వెళ్లి ఈ స్థాయికి చేరుకోవటం గుంటూరు జిల్లా వాసులకు సంతోషకరమైన విషమనే చెప్పాలి.

ప్రవాస భారతీయుడైన ఈ అభ్యర్థి వద్ద ఇంత పెద్ద మొత్తములో డబ్బు సంపాదించినప్పటికీ గతంలో గుంటూరు జిల్లాలో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు ఎక్కడా చూడలేదని ప్రజలు అంటున్నారు. ఆయన కుటుంబ సభ్యుల కోసం సంపాదించారు అంటున్నారు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు. ముందు ఎవరైనా బతకడం కోసం సంపాదిస్తారు. ఆ తరువాత వ్యాపార రంగంలోకి దిగుతారు. ఇది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.

అంచలంచెలుగా ఆర్థికంగా ఎదిగిన ఈ అభ్యర్థి ఎదుగుతున్న కొద్ది తాను సామాన్య కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి సామాన్య ప్రజలకు ఎన్ని కష్టాలు వుంటాయో తెలుసునని చెబుతున్నారు. తన వద్ద ఉన్నడబ్బుతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం ఎందుకు చుట్టలేదనే వాదన కూడా ఉంది. సేవ కార్యక్రమములు నిర్వహించి ఉంటే వాటిని ప్రచారం చేస్తే ఆర్థిక బలంతో పాటు సేవాగుణం కూడ ప్రజలకు ఈ పాటికే తెలిసేది.

గతంలో కూడ పోటీచేసి రెండుసార్లు గెలిచిన ఎంపీ గల్లా జయదేవ్ మొదట పోటీ చేసే ముందు తాను పారిశ్రామిక వేత్తనని తనను గెలిపిస్తే పరిశ్రమలు ఏర్పరచి తన నియోజకవర్గంలోని యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. గెలిచి పదేళ్లు పనిచేసినా ఎక్కడా ఒక్క పరిశ్రమ కూడా వచ్చిన దాఖలాలు లేవు. పైగా పదేళ్లలో కనీసం పది సార్లు కూడా నియోజకవర్గంలో జయదేవ్ పర్యటించలేదని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం టిడిపి నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి కూడ తన సొంత డబ్బుతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గుంటూరు పార్లమెంట్ నియోజవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేలా చేస్తానని హామీలు గుప్పిస్తున్నారు. ఇవన్నీ జరిగేవేనా అనేది పలువురిలో ఉన్న అనుమానం.

గత అనుభవాలను పరిగనలోకి తీసుకున్న గుంటూరు పార్లమెంట్ ప్రజలు వీరి హామీల పట్ల అంతగా స్పందించడం లేదు, పలువురు పలు విధాలుగా వారి వారి అనుభవాలను గుర్తు చేసుకుంటూ గతంలో రెండుసార్లు గెలిచిన ఎంపీ ఏం చేశారు, ఇతను గెలిచినా చేసేది అదే అని నిట్టూర్పునిస్తున్నారు. ఒకవేళ ఓడిపోతే వచ్చిన చోటుకే తిరిగి వెళ్ళిపోతారు మా బతుకులు ఇంతేననే మాట నియోజకవర్గంలోని ఓటర్ల నుంచి వస్తోంది.

ఆస్తుల వివరాలు వెల్లడించిన తర్వాత చంద్రశేఖర్ రాజకీయాల్లోకి తన ఆస్తులను కాపాడుకోవడానికి వచ్చారా? ప్రజలకు సేవ చేయడానికి వచ్చారా అనే సందిగ్ధంలో నియోజకవర్గ ప్రజలు ఉన్నారనడంలో సందేహం లేదు. నియోజకవర్గంలో పలువురు మేధావులను విశ్లేషణ కోరగా.. ప్రజల్లో ఉన్న అభిప్రాయం లో ఎటువంటి అవాస్తవం లేదని, గత అనుభవాల దృష్ట్యా వారి ఆలోచన సరైందేనని, ప్రజల్లో తమపై నమ్మకం కలిగేలా చేసుకునే బాధ్యత అభ్యర్థి పై ఉంటుందని, వీరిపై నమ్మకం కలగాలంటే తాను గెలిచినా ఓడిన నియోజకవర్గంలోనే ఉంటానని ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా పనులు చేయాల్సి ఉంటుందని అంటున్నారు.

ఈ విషయమై ముస్లిం యునైటెడ్ ఫ్రంట్, ముస్లిం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ కలీం మాట్లాడుతూ ఆర్థికంగా బలవంతుడైన అభ్యర్థి తన 5,705కోట్లలో కనీసం 700 కోట్లు ఎన్నికలకు ముందు పార్లమెంటు నియోజకవర్గం లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 100 కోట్ల చొప్పున 700 కోట్లు ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసి, తాను గెలిచినా, ఓడినా పార్లమెంటు నియోజకవర్గంలో ఖర్చుపెట్టేలా ప్రతిపాదనలు పెట్టి అప్పుడు ప్రజలకు ప్రభుత్వ నిధులతో పని లేకుండా తన సొంత డబ్బుతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపితే ప్రజలు కూడ సంతోషిస్తారన్నారు. శ్రీమంతుడైన అభ్యర్థి మాటల ద్వారా కాకుండ చేతల ద్వారా నిరూపించాలని, అప్పుడు ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడుతుందని కలీం అన్నారు.

Next Story