వంశీకి గన్నవరం సీటు గల్లంతేనా?

సంచలనాలకు మారు పేరైన వల్లభనేని వంశీకి ఈ దఫా గన్నవరం సీటు దక్కుతుందా లేదా అనేది ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


వంశీకి గన్నవరం సీటు గల్లంతేనా?
x
వల్లభనేని వంశిమోహన్, ఎమ్మెల్యే

జి. విజయ కుమార్

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఇతర టీడీపీ నేతలపై మాటల తూటలు పేల్చే వంశీకి సీటు ఎందుకు దక్కని పరిస్థితులు ఏర్పడ్డాయో వైఎస్‌ఆర్‌సీపీ నేతలకే తెలియాలి.
పొలిటికల్‌ కెరీర్‌ టీడీపీతోనే ప్రారంభం
వల్లభనేని వంశీ రాజకీయ ప్రయాణం తెలుగుదేశం పార్టీతోనే మొదలైంది. తొలుత ఆయన విజయవాడ ఎంపిగా టీడీపీ నుంచి బరీలోకి దిగారు. 2009లో జరిగిన ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రత్యర్థి లగడపాటి రాజగోపాల్‌ చేతిలో ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో వంశీ ఓడిపోయినా జిల్లా నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీలో కూడా కీలక నాయకుడుగా మారారు.
అనంతరం ఆయన విజయవాడ పార్లమెంట్‌ రాజకీయాలను వదిలేసి గన్నవరం కేంద్రంగా పాలిటిక్స్‌ ప్రారంభించారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా గన్నవరం నుంచి బరీలోకి దిగిన వంశీ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి దుట్టా రామచంద్రరావుపై గెలుపొందరు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు స్థానాల్లో టీడీపీ గెలిస్తే వాటిల్లో గన్నవరం కూడా ఒకటిగా నిలిపారు వంశీ. తర్వాత ఆ పార్టీలో కుదర లేదు. వైఎస్‌ఆర్‌సీపీ వైపు అడుగులు వేశారు. అధికారికంగా ఆ పార్టీలో చేరక పోయినా మద్ధతు ప్రకటించారు. అయితే వైఎస్‌ఆర్‌సీపీలోకి వంశీ ఎంట్రీని ఆ పార్టీ నేతలు దుట్టా, యార్లగడ్డ తీవ్రంగా వ్యతిరేకించారు. పలు మార్లు ఈ పంచాయతీ సిఎం వద్దకు కూడా వెళ్లింది.
ఇంత వరకు తేలని టికెట్‌
చంద్రబాబు, లోకేష్‌తో సహా ఆ పార్టీ నేతలను తనదైన శైలిలో విమర్శలు గుప్పించే వంశీకి ఈ దఫా కూడా టికెట్‌ ఖాయమని ఆ నియోజక వర్గం ప్రజలు, ఆయన అనుచరులతో పాటు ఆ పార్టీ నేతలు అందరూ భావించారు. టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం, సిఎంకు క్లోజ్‌గా ఉండటంతో వంశీకే వైఎస్‌ఆర్‌సీపీ టికెట్‌ వస్తుందని ఆశించారు. అయితే ఇంత వరకు అధికారికంగా ఖరారు చేయక పోవడంతో వంశీ అనుచరులతో పాటు గన్నవరం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
గన్నవరం సీటును బీసీలకు ఇవ్వాలని ఐప్యాక్‌ సిఫార్సు
2024 ఎన్నికల్లో గన్నవరంలో అభ్యర్థిని మార్చాలని, పాత వారికి కాకుండా బీసీలకు ఇవ్వాలని ఐప్యాక్‌ సంస్థ సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సిఫార్సు చేసినట్లు తెలిసింది. గన్నవరం నియోజక వర్గంలో ఐప్యాక్‌ చేపట్టిన సర్వే ద్వారా వచ్చిన నివేదిక ఆధారంగా సిఎంకు సిఫార్సు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గన్నవరం అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో మెజారిటీ ఓటర్లు బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. సుమారు 50వేల నుంచి 55వేల వరకు ఉంటారు. ఆ తర్వాత ఎస్సీ ఓటర్లు ఎక్కువ. వీరు కూడా సుమారు 25వేల నుంచి 30 వేల వరకు ఉంటారు. మరో 20 శాతం మిగిలిన వార్గాల ఓటర్లు ఉంటారు. బీసీ వర్గాలే ఇక్కడ కీలక వర్గం. వీరు ఎటువైపు మొగ్గితే వారు నెగ్గుతారు.
ఈ నేపథ్యంలో బీసీ అభ్యర్థికి గన్నవరం అసెంబ్లీ స్థానం కేటాయిస్తే వైఎస్‌సీపీకి లాభం చేకూరుతుందని, దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు ఎక్కువ ఇవ్వాలనే నేపథ్యంలో ఇది కూడా ఒకటి అవుతుందని సిఎంకు సిఫార్సు చేసినట్లు సమాచారం.
తెరపైకి ముద్రబోయిన వెంకటేశ్వరరావు
మాజీ ఎమ్మల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది. ఆయన బీసీ వర్గానికి చెందిన నేత. మొన్నటి వరకు నూజివీడు టీడీపీ ఇన్‌చార్జీగా ఉన్నా ఆ స్థానం వైఎస్‌ఆర్‌సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కొలుసు పార్థసారధికి ఇవ్వడంతో చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ముద్రబోయిన ఆ పార్టీని వీడారు.
ఆయనది గన్నవరం సొంత నియోజక వర్గం. గతంలో ఇక్కడ నుంచే పోటీ చేశారు. మూడు సార్లు పోటీ చేయగా ఒక పర్యాయం విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ముద్రబోయినకు వైఎస్‌ఆర్‌సీపీ ఈ సీటు కేటాయిస్తుందనే టాక్‌ ఇప్పటి నడుస్తోంది. అయితే వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వంశీ వైపు మొగ్గు చూపినట్లు ఆ పార్టీలో చర్చించుకుంటున్నారు.
సైలెంట్‌గా ఉన్న వంశీ
గన్నవరం అసెంబ్లీ నియోజక వర్గానికి వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జీగా ఉన్న వంశీకి ఆ పార్టీ పెద్దల నుంచి ఎలాంటి గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోవడంతో సందిగ్ధంలో ఉన్నారు. ఒక పక్క ఇన్‌చార్జీలకే టికెట్లు ఖరారు అవుతాయని చెప్పిన సిఎం సమన్వయ కర్తలను మారుస్తూ ఉండటంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అభ్యర్థిని ఇది వరకే ప్రకటించారు. గతంలో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీ చేసి ఓడి పోయిన యార్లగడ్డకు చంద్రబాబు టెకెట్‌ ఖరారు చేశారు. దీంతో ఆయన ప్రచారంలో దూసుకొని పోతున్నారు. ఊరు, వాడా తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. ఒక పక్క టీడీపీ అభ్యర్థి ప్రచారంలో దూసుకొని పోతుండటం, మరో వైపు వంశీ సైలెంట్‌గా ఉండటంతో ఆయన అనుచరులు, గన్నవరం వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.


Next Story