యాదవ సామ్రాజ్యంలోకి కమ్మలెలా చొరబడ్డారు?
x
ఎంవీవీ సత్యనారాయణ, వెగలపూడి రామకృష్ణ బాబు

యాదవ సామ్రాజ్యంలోకి కమ్మలెలా చొరబడ్డారు?

యాదవులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గంలో కమ్మ నేత ఎందుకు గెలుస్తున్నారు? ఆ ఎమ్మెల్యే జైత్రయాత్రకు ఈసారైనా బ్రేక్ పడుతుందా?


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: విశాఖ తూర్పు నియోజకవర్గం ఓటర్ల తీర్పు ఈసారి ఏ పార్టీకి అనుకూలిస్తుంది. ఖాతా తెరవాలని అధికార వైసీపీ... ఆధిపత్యం కొనసాగించాలని ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన పార్టీలకు ఈ నియోజకవర్గ ఫలితం ప్రతిష్టాత్మకంగా మారింది. తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తిరిగి పోటీ చేస్తుండగా... అధికార వైసీపీ నుంచి విశాఖ ఎంపీ ఎం వీవీ సత్యనారాయణ ఎన్నికల బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ హవా నడిచినా విశాఖ నగరంలో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో నగరంలోని కీలక నియోజకవర్గమైన విశాఖ తూర్పుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను రంగంలోకి దింపి ఈ ఎన్నికల్లో తూర్పు తీరాన వైసీపీ జెండా ఎగరేయాలని ప్లాన్ చేస్తోంది.

ఈసారైనా వైసీపీకి అనుకూలిస్తుందా...

విశాఖ తూర్పు నియోజకవర్గం ఓటర్ల తీర్పును ఈసారి తనకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ భావిస్తోంది. గత మూడు ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండాయే ఎగురుతోంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అడ్డాగా మారిపోయింది. టీడీపీ కార్పొరేటర్‌గా రాజకీయాలు ప్రారంభించిన వెలగపూడి... క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తల్లో పాతుకుపోయారు. ఎమ్మెల్యేకు సరైన ప్రత్యర్థిని దింపడంలో గత రెండుసార్లు వైసీపీ అంచనాలు తప్పాయి. అంగ, అర్ధబలాల్లో తిరుగులేని వెలగపూడిని ఈసారి ఇంటికి పంపడంపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది వైసీపీ. తూర్పు తలరాత మార్చేలా వెలగపూడికి మించిన స్థాయిలో అంగ, అర్ధబలాలు ఉన్న ధీటైన నేత, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను విశాఖ తూర్పు నుంచి బరిలోకి దించింది.

వెలగపూడి ఓ ప్రధాన సామాజిక వర్గం నేత.. ఆయనకు దీటైన నేతగా విశాఖలో ఎంపీ సత్యానారాయణను వైసీపీ ఎంచుకోవడానికి కూడా అదే సామాజికవర్గం కారణం కావడం విశేషం. ఇక ఆర్థికంగా తిరుగులేని ఎంపీ ఎంవీవీ అయితేనే టీడీపీ హవాకు బ్రేక్‌లు వేయగలమని భావించింది వైసీపీ. అంతేకాదు ఎంపీ ఎంవీవీకి కూడా ఎమ్మెల్యేగా పని చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. విశాఖలో నెంబర్ వన్ బిల్డర్ అయిన ఎంవీవీ గత ఎన్నికల్లో అనూహ్యంగా ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఛాన్స్ కోరుకున్న ఆయనకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తూర్పు స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆదేశించింది.

తూర్పు నియోజకవర్గం హిస్టరీ...

విశాఖ తూర్పు నియోజకవర్గం.. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఏర్పడింది. 2009లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన వెలగపూడి రామకృష్ణబాబు తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 2014, 19 లో కూడా వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ఓసారి ప్రజారాజ్యం పార్టీ, మిగిలిన రెండు సార్లు వైసీపీ నేతలు ఆయన చేతిలో ఓడిపోయారు. నియోజకవర్గంలో మొత్తం 2,71,215 ఓటర్లు ఉండగా... మెజారిటీ ఓటర్లు యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. నియోజకవర్గంలో 78 వేల వరకు యాదవ ఓటర్లుండగా... మత్స్యకారులు 35వేల మంది, ఓసి కాపు, బీసీ కాపు కలిపి 25 వేల మంది, బ్రాహ్మణులు 20వేల మంది, రెడ్డి 15 వేల మంది, ఎస్సీ 25 వేల మంది, చాకలి, కమ్మ చెరో 12 వేల మంది ఓటర్లు ఉన్నారు. అత్యధిక ఓటర్లు అయిన యాదవులు, మత్స్యకారులు ఎవరికి మద్దతు ప్రకటిస్తే వారికి ఇక్కడ విజయం సాధ్యమవుతుంది.

ముమ్మరంగా ప్రచారం....

తూర్పు నియోజకవర్గంలో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగుతుంది. అధికార వైసీపీ అభ్యర్థి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సభలో సమావేశాలతో పాటు ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్నారు. సామాజిక వర్గాల సమీకరణలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బలమైన సామాజిక వర్గాలైన యాదవ, మత్స్యకారులను తన వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించిన వెలగపూడి నాలుగోసారి జెండా పాతెందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తూర్పు నియోజకవర్గ ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిందే.



Read More
Next Story