
అసెంబ్లీకి ఎమ్మెల్యేల డుమ్మా, చంద్రబాబు ఆగ్రహం
కోరం లేకపోవడంతో అప్పటికప్పుడు 17మంది ఎమ్మెల్యేలను పిలిపించిన విప్పులు
"అసెంబ్లీకి నేనుంటేనా వస్తారా, ఇదేం తీరు.." ఈ పద్ధతి సరికాదంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలను హెచ్చరించారు. తానున్నా లేకపోయినా సభ జరుగుతున్నప్పుడు అందరూ సభలో ఉండాలని ఆదేశించారు.
కొందరు ఎమ్మెల్యేలు సభకు రావడం లేదంటూ టీడీపీ శాసనసభ విప్ లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఆలస్యంగా వచ్చి, అసెంబ్లీ సమావేశాలు పూర్తికాక ముందే వెళ్తున్న ఎమ్మెల్యేల జాబితా ఇవ్వండి" అని సీఎం చంద్రబాబు (Chandrababu) విజ్ఞప్తి చేశారు. కీలక చర్చల సమయంలో సభ్యుల గైర్హాజరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవాళ (సెప్టెంబర్ 25) అసెంబ్లీ సమావేశం ప్రారంభమయ్యే సమయానికి శాసనసభలో 30 మంది ఎమ్మెల్యేలున్నారు. సభలో కోరం కనిపించ లేదు. మొత్తం 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉంటే వారిలో మెజారిటీ సభ్యులు టీడీపీ వాళ్లు. వాళ్లే సభకు రాలేదంటే సభపై గౌరవం లేనట్టే కదా అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు వెంటనే అసెంబ్లీలో విప్‌లను చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అప్రమత్తం చేశారు. సీఎం ఆరా తీయడంతో సమావేశానికి డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలకు విప్‌లు ఫోన్లు చేశారు. అప్పటికప్పుడు 17 మంది ఎమ్మెల్యేలను పిలిపించారు. పూర్తి స్థాయిలో సభ్యులు హాజరయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
సభలో ఇవాళ కీలక బిల్లులు ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విప్ లు అప్రమత్తమై ఎమ్మెల్యేలను సభకు పిలిపించారు.
Next Story