భుజంపై ఆ తువ్వాల ఉంచుతారా?

భుజంపై ఎప్పడూ తెలుగుదేశం పార్టీ కలర్స్‌ ఉన్న తువ్వాల ఉంచుకుంటారా? తీసేస్తారా? తీసేస్తే ఎలా ఉంటుంది?


భుజంపై ఆ తువ్వాల ఉంచుతారా?
x
చంద్రబాబుతో జవహర్

జి విజయ కుమార్

భుజం మీద ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ సింబల్‌గా కలిగిన పసుపు కండువా వేసుకొని ఆ పార్టీ స్వామి భక్తిని ప్రదర్శిస్తూ ఉండే మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్‌ జవహర్‌కు ఈ సారి చంద్రబాబు రిక్త హస్తం చూపించడం ఉమ్మడి పశ్చమ గోదావరి జిల్లాతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల్లో సీటు దక్కుతుందని గంపెడాశతో ఎదురు చూసిన శామ్యూల్‌ జవహర్‌కు చంద్రబాబు హ్యాండ్‌ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజక వర్గం సీటు కానీ, గోపాలపురం అసెంబ్లీ స్థానం కానీ తనకు కేటాయిస్తారని భావించిన జవహర్‌కు చంద్రబాబు అవకాశం కల్పించక పోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆ జిల్లాలో టీడీపీ సీనియర్‌ నేతల్లో ఒకరైన జవహర్‌కు టీకెట్‌ ఖరారు కాకపోవడంతో ఆయన అనుచరులు, కార్యకర్తలు ఆందోళనల్లో ఉన్నారు. దీంతో ఆయన పార్టీ మారుతారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. టీడీపీని వీడి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారనే ప్రచారం వినిపిస్తోంది. కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో జవహర్‌ పట్టున్న నేత. ఈ సారి స్థానం కేటాయించక పోవడంతో ఎన్నికల్లో సహకరిస్తారో లేదో అని ఆ పార్టీ నేతల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నట్లు స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు.
ఫోన్‌లో సంప్రదింపులకు కూడా నోచుకోని జవహర్‌
టీపీడీలో ఈ సారి టికెట్లు రాని వారిలో చాలా మంది నేతలతో ఆ పార్టీ కార్యాలయం నుంచి ఫోన్లు చేసి మాట్లాడారు. సర్వేలో వచ్చిన అభిప్రాయాలను ప్రయారిటీగా ఈ సారి ఎన్నికల్లో సీట్ల కేటాయింపులు జరుగుతున్నాయని చాలా మందికి సమాచారం అందించారు. ఆలపాటి రాజా వంటి నేతలనైతే ఇంటికి పిలిపించుకొని నేరుగా చంద్రబాబే మాట్లాడిన సందర్భాలున్నాయి. కానీ జవహర్‌ విషయంలో అలా జరగ లేదని, కనీసం ఒక ఫోన్‌ చేసి సముదాయించడమో, ఈ సారి అకామిడేట్‌ చేయలేక పోతున్నాము, దానికి ప్రత్యామ్నాయంగా సముచి స్థానం కల్పిస్తామనో కూడా చెప్ప లేదని జవహర్‌ తన సన్నిహితుల వద్ద చెప్పుకొని బాధను వెళ్ల గక్కినట్లు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుల్లో జవహర్‌ ఒకరు. చంద్రబాబు మాటను తూచా తప్పని నేతగా ఆయనకు ముద్ర ఉంది. కానీ ఈ సారి ఎన్నికల్లో బెర్తు దొరకని పరిస్థితి పరిస్థితి ఏర్పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పలువురు చర్చించుకోవడం విశేషం.
జవహర్‌ని కాదని
2024 ఎన్నికల్లో మాజీ మంత్రి జవహర్‌ను కాదని ముప్పిడి వెంకటేశ్వరరావుకు కొవ్వూరు టీడీపీ టికెట్‌ చంద్రబాబు ఖరారు చేశారు. గోపాలపురం స్థానానికి మద్దిపాటి వెంకటరాజును ఖరారు చేశారు. దీంతో రెండు స్థానాల్లో జవహర్‌కు స్థానం లేకుండా పోయింది. ఈ రెండూ ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గాలు.
జవహర్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇలా..
కొత్తపల్లి శామ్యూల్‌ ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. చంద్రబాబుతోనే ప్రయాణం ప్రారంభించారు. 2014లో ఎలక్షన్‌ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఈ ఎన్నికల్లో కొవ్వూరు స్థానం చంద్రబాబు ఆయనకు కేటాయించారు. బరీలోకి దిగిన జవహర్‌ గెలుపొందారు. సమీప ప్రత్యర్థి ప్రస్తుత హోమ్‌ శాఖ మంత్రి తానేటి వనితపై 12వేల మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. ఎక్సైజ్‌ శాఖను కేటాయించారు. తర్వాత ఎన్నికల్లో ఆయనను రాజకీయ బదలీ చేశారు. కొవ్వూరు నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు అసెంబ్లీ స్థానం కేటాయించి అక్కడ పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఓటమి పాలయ్యారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కొక్కిలిగడ్డ రక్షణ నిధి చేతిలో ఓడిపోయారు. ఈ సారి ఎన్నికల్లో కొవ్వూరు స్థానం కేటాయిస్తారని చంద్రబాబుపై ఆశలు పెట్టుకున్నారు. ఒక వేళ అది కాకపోతే గోపాలపురం స్థానమైన ఇస్తారని భావించారు. కానీ సీన్‌ కాస్తా రివర్స్‌ అయింది. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీని వీడుతారా లేక అదే పార్టీలో కొనసాగుతారా, చంద్రబాబు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తారా అనేది వేచి చూడాలి.
Next Story