ఒంగోలు మునిసిపల్‌ కార్పొరేషన్‌ను టీడీపీ కైవసం చేసుకునేందుకు పావులు కదిపింది. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. బాలినేని పట్టీపట్టనట్లు ఉన్నారనే విమర్శ వైఎస్సార్‌సీపీలో ఉంది.


వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంగోలు మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ఖాళీ కానుందా? గంగాడ సుజాత కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె మాట వినే కార్పొరేటర్లు ఒక్కరు కూడా లేరు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆమెను చైర్‌పర్సన్‌గా గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు బాలినేని ఒంగోలులో రాజులా ఉన్నారని చెప్పొచ్చు. ఎప్పుడైతే ప్రభుత్వం అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి బాలినేని హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఒంగోలు ముఖం కూడా చూడలేదు. పైగా ఒంగోలు పార్లమెంట్‌ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండటం, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌ పార్టీ పగ్గాలతో పాటు జిల్లాలో అన్నీతానై నడిపిస్తున్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంటే దామచర్ల జనార్థన్‌ అన్నట్లు నడుస్తోంది. దీంతో మునిసిపల్‌ కార్పొరేటర్లను ముందుగా లాక్కునేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పేర్నమిట్టకు చెందిన తేళ్ల చంద్రశేఖర్‌ అనే కార్పొరేటర్‌ శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు.

20 మంది కార్పొరేటర్లను లాగేందుకు సిద్ధం
ఇప్పటికే పది మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌తో టచ్‌లో ఉన్నారు. వీరు ఏ క్షణంలోనైనా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం. అయితే వీరితో పాటు మరో పది మందిని కలిపి మొత్తం 20 మంది కార్పొరేటర్లను లాక్కోవాలనే నిర్ణయంలో తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు. వీరి వ్యూహం ఫలించే దిశగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు రంగంలోకి దిగారు. డిప్యూటీ మేయర్లుగా ఇరువురు ఉన్నారు. వేమూరి సూర్య (బుజ్జి), వెలనాటి మాధవరావులను టీడీపీలోకి లాగేందుకు తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించనున్నాయని టీడీపీ వారు చెబుతున్నారు. వెలనాటి మాధవరావు కాస్త వెనుకంజ వేస్తున్నారని, వేమూరి బుజ్జి మాత్రం టీడీపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని సమాచారం.
13 మందిని లాగితే సరిపోతుంది..
మునిసిపల్‌ కార్పొరేషన్‌లో మొత్తం కార్పొరేటర్లు 50 మంది ఉన్నారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున 6గురు గెలిచారు. జనసేన తరపున ఒకరు గెలుపొందారు. 41 మంది కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీ తరపున గెలిచారు. ఇద్దరు ఇండిపెండెంట్లుగా గెలుపొందారు. అప్పట్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో స్వతంత్రంగా గెలిచిన ఇద్దరు కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీలో చేరారు. దీంతో మొత్తం 43 మంది వైఎస్సార్‌సీపీలో కార్పొరేటర్లుగా ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు 5గురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. శనివారం మరొకరు చేరారు. దీంతో మొత్తం తెలుగుదేశం పార్టీ మద్దతు దారుల సంఖ్య 13కు చేరింది. అంటే మరో 13 మందిని చేర్చుకుంటే కార్పొరేషన్‌ మేయర్‌ పదవి టీడీపీ వశం అవుతుంది. కానీ మొత్తంగా వైఎస్సార్‌సీపీని దెబ్బకొట్టాలంటే కనీసం 20 మందికి తగ్గకుండా లాక్కోవాలని టీడీపీ ఆలోచన చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
కౌంటింగ్‌ రోజు నుంచి ఒంగోలు ముఖం చూడని బాలినేని
ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కౌంటింగ్‌ పూర్తి కాగానే జూన్‌ 4న హైదరాబాద్‌ వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒంగోలు ముఖం చూడలేదు. ఒంగోలు నాయకులతో మాట్లాడ లేదు. అధికారం కోల్పోగానే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలుకు దూరంగా ఉండటం వల్ల స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుల్లో కూడా నిరాశ ఏర్పడింది. అసలు నాయకుడే కనిపించకుండా పోవడం వల్ల తెలుగుదేశం పార్టీలో చేరడమే మంచిదనే ఆలోచనకు కార్పొరేటర్లు వచ్చినట్లు సమాచారం. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రాజకీయ పరిణామాల మార్పుతో పెద్దగా కార్యకర్తలు, నాయకుల గురించి పట్టించుకోవడం లేదు. ఐదేళ్లు ప్రశాంతంగా డగపడమే మంచిదనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఎన్నికలకు ముందు తాను అడిగిన టీమును వైఎస్‌ జగన్‌ ఇవ్వకపోవడం వల్లనే ప్రకాశం జిల్లాలో ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చిందనే ఆలోచనలో ఉన్నారు.
చైర్‌పర్సన్‌ జంప్‌ అయ్యేందుకు రెడీగా ఉన్నా...
ఒంగోలు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గంగాడ సుజాత తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని సమాచారం. అయితే ఆమెను చైర్‌పర్సన్‌గా కొనసాగించేందుకు తెలుగుదేశం పార్టీ వారు సిద్దంగా లేరని, అందువల్ల ముందుగా వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను లాగి ఆమెను దించేస్తే తమ పార్టీకి చెందిన వారిని చైర్‌పర్సన్‌గా పెట్టుకునేందుకు వీలుంటుందనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు సమాచారం. అందుకే కార్పొరేటర్లను లాక్కునే పనిలో నిమగ్నమైంది. గంగాడ సుజాత పదవీ చ్యుతురాలు రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ వారు చెబుతున్నారు.
ఎన్నికలు పూర్తయి మూడేళ్లు దాటింది..
ఒంగోలు మునిసిపాలిటీ ఎన్నికలు పూర్తయి మూడేళ్లు దాటింది. 2021 మార్చి 10న ఎన్నికలు జరిగాయి. మార్చి 14న కౌంటింగ్‌ జరిగింది. 2024 మార్చి 14 నాటికి మూడు సంవత్సరాలు పూర్తయింది. మునిసిపాలిటీల్లో కానీ, కార్పొరేషన్స్‌లో కానీ ఎన్నికలు జరిగిన నాలుగు సంవత్సరాలకు మాత్రమే అవిశ్వాసం పెట్టాలంటూ గత ప్రభుత్వం చట్టం చేసింది. దీనిని మూడు సంవత్సరాలకు కుదిస్తూ చట్టం చేయాలనే ఆలోచనలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అలా జరిగితే రాష్ట్రంలోని చాలా మునిసిపాలిటీలు టీడీపీ వశం అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆ విధమైన చట్టం రూపొందించేందుకు టీడీపీ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
మూడేళ్లకే అవిశ్వాసం పెట్టేలా చట్టం..?
కార్పొరేషన్‌ మేయర్‌ను దించాలంటే అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే నాలుగు సంవత్సరాలు పూర్తి అయితే తప్ప అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం లేదు.అందుకనే ఏమి చేయాలో దిక్కుతోచని తెలుగుదేశం పెద్దలు మూడు సంవత్సరాలకే అవిశ్వాసం పెట్టే విధంగా వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అదే జరిగితే రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ తిష్టవేస్తుందనడంలో సందేహం లేదు.
Next Story