Ysr| వైఎస్సార్ బ్రాండ్ ఇమేజ్ కోసమేనా.. జనంలోకి జగన్
కొత్త ఏడాదిలో జగన్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. వైఎస్ఆర్ తరహాలనే తాడేపల్లి నివాసంలో నేరుగా కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
అధికారంలో ఉండగా, తన తండ్రి దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి పేరును వైఎస్. జగన్ మెల్లగా పక్కకు జరిపారు. మళ్లీ ఆయన బ్రాండ్ ఇమేజ్ తెరపైకి తీసుకుని రావడం ద్వారా జనవరి నుంచి జనంలోకి రావడానికి జగన్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పార్టీవర్గాల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా, నివాసం, పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ సాధారణ ప్రజలను కలవడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈ పద్ధతిలో సాగడానికి జగన్ కూడా సమాయత్తం అవుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దీనికి ప్రధానంగా,
వైఎస్. కుటుంబంలో కలహాలు, ఆస్తుల వ్యవహార గొడవ వైఎస్ఆర్ కుటుంబ వ్యవహారాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. దశాబ్దకాలంగా అక్రమాస్తుల కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. దీనికి తోడు చెల్లెలు వైఎస్. షర్మిల రాజకీయంగా బద్దశత్రవుగా మారారు. అధికారం కోల్పోయిన తరువాత వైసీపీలో అంతర్గతంగా అసంతృప్తి బట్టబయలైంది. వెన్నంటి ఉంటూ, పదవులు అనుభవించిన వారిలో కీలకపాత్ర పోషించిన వారు దూరమయ్యారు. కొందరు పదవులు కూడా వదులుకుని వెళ్లారు. దీనికి తోడు అధికార టీడీపీ కూటమి నుంచి పార్టీ శ్రేణులు కేసులతో సతమతం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ తండ్రి, దివంగత సీఎం వైఎస్ఆర్ చరిష్మా తెరపైకి తీసుకుని రావడం ద్వారా ఉన్న వారిని కాపాడుకోవడంతో పాటు జగన్ పాత నేస్తాలను కూడా సమీకరించే కార్యాచరణలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం..
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్.జగన్ జనంలోకి రావాలని కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. నూతన సంవత్సరం-2025 జనవరి మూడో వారం నుంచి నియోజకవర్గాల పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులపాటు మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ కీలక నాయకులతో భేటీ అవుతారని చెబుతున్నారు. ఈ విధంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పర్యటించే కార్యాచరణకు సంసిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత జిల్లాల ఓటమి చెందిన ప్రజాప్రతినిధులతో జగన్ సమీక్షించారు. పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా నాయకులకు కీలక బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే,
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైసిపి నేతలుప్రధానంగా సోషల్ మీడియా కార్యకర్తలపై వరుస కేసులు నమోదు చేస్తున్నారు. అధికారంలో ఉండగా, టీడీపీ, జనసేన నేతలతో పాటు వారి కుటుంబంలోని మహిళలపై కూడా అసభ్యకరంగా వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ కూటమి ప్రభుత్వం పాత కేసులను తిరగడంతో పాటు, ఆ రోజుల్లో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల ఆధారంగా వైసీపీ సోషల్ మీడియా వర్కర్లపై కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటికే ఒక్కొక్కరిపై రాష్ట్రంలోని అనేక పోలీస్ స్టేషన్లో పదుల సంఖ్యలో కేసులు నమోదు చేయడం ద్వారా వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.
ఈ పరిణామాలపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ ఏమాత్రం తగ్గకుండా, సోషల్ మీడియా వర్కర్లను మరింత ఉత్సాహపరిచే విధంగా ప్రకటన చేయడం కూడా రాజకీయ విమర్శకులు విస్మయానికి గురవుతున్నారు. తమ సోషల్ మీడియా కార్యకర్తలను కాపాడుకునేందుకు న్యాయ సహాయం కోసం లీగల్ సెల్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి జిల్లాకు ఇద్దరు పార్టీ నాయకులను కన్వీనర్లుగా కూడా వైఎస్ జగన్ నియమించిన విషయం తెలిసిందే.
2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ కాలంలో మాజీ సీఎం వైఎస్ జగన్ జనంలోకి రావడం అటుంచితే, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అధికారం పోయాక ఆనాటి పరిస్థితులను ఉటంకిస్తూ వైసీపీ నాయకులే బాహాటంగా విమర్శలు కూడా చేశారు. అంతేకాకుండా
సీఎం హోదాలో ఉండగా జగన్ తాడేపల్లి నివాసంలో కలవడానికి నాయకులు కాదు. కనీసం ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని విషయాన్ని అనేకమంది తప్పుపట్టారు. ఆ కోవలో మొదటగా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నోరు విప్పారు. ఆ తర్వాత కూడా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా పార్టీ అధినేత వైయస్ జగన్ తీరును విమర్శించిన విషయం తెలిసిందే. తర్వాత అనేకమంది మాజీ మంత్రులు కూడా పార్టీ అధినేత వ్యవహార శైలినితప్పు పట్టారు. అంతేకాకుండా,
ఇప్పుడు మీడియాకు దగ్గరగా...
అధికారంలో ఉన్నప్పుడు మాజీ సీఎం వైయస్ జగన్ మీడియాను కలవడం అటుంచితే, ఒకసారి కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడిన దాఖలాలు లేవనే చెప్పవచ్చు. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేవారు. కానీ,
రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడిన సందర్భంలో కూడా జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనార్హం.
"పోతే పోనీ. ఉండేవాళ్ళు ఉంటారు" అని జగన్ మాజీ మంత్రి బాలినేని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా "నాయకుడు అనే వ్యక్తి జనం నుంచి పుడతారు. సీనియర్ అంటే ప్రామాణికం?" అని వైఎస్ జగన్ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. అంటే తాను మాత్రమే జనం నుంచి వచ్చాననే మాట చెప్పకనే చెప్పారనేది అర్థం అవుతుంది. ఇదిలా ఉంటే..
వైఎస్సార్ పంథాలో..
అధికారంలో ఉండగా తాడేపల్లి నివాసానికే వైఎస్ జగన్ పరిమితమయ్యారు. జిల్లాల పర్యటనకు వస్తే నాయకులు కూడా తక్కువ మంది కలిసేవారు. ఇవన్నీ వైసీపీ నాయకులు, ప్రజలకు తెలిసిన విషయాలే. రాష్ట్రంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ తన తండ్రి దివంగత సీఎం వైఎస్ఆర్ తరహా పంథా అమలుకు ఆసక్తి చూపిస్తున్నట్లు పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. అందులో ప్రధానంగా జిల్లాలకు వెళ్లినప్పుడు కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులను కలవడం ఒకటైతే. తాడేపల్లి నివాసం వద్ద అపాయింట్మెంట్ లేకుండా తనను కలవడానికి జగన్ కార్యాచరణ సిద్ధం చేయడంతో పాటు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా,
ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైఎస్. జగన్ తో పాటు 11 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. గతానికి భిన్నంగా అసెంబ్లీలో మాట్లాడాలి అనుకున్న విషయాలను మీడియా కేంద్రంగా పంచుకున్నారు. గతంలో తమ సాక్షి మీడియాకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారు. అధికారం కోల్పోయిన తర్వాత మీడియాను ఆశ్రయించాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు..
కార్యకర్తల సూచనల కోసమే..
నూతన సంవత్సరం జనవరిలో జిల్లాల పర్యటనకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టునున్నారు. ఇందులో ప్రధానంగా కేసులతో ఇబ్బంది పడుతున్న కార్యకర్తలు, వారి కుటుంబీకులకు ధైర్యం చెప్పడం. పార్టీ నాయకులను సమన్వయం చేయడం. మాజీ ప్రజా ప్రతినిధులను కదిలించడానికి ప్రాధాన్యత ఇవ్వనన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా,
"పార్టీ బలోపేతానికి సామాన్య కార్యకర్తల సూచనలే కాదు సలహాలు కూడా తీసుకుంటారు" అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
"తాడేపల్లి కి వచ్చే కార్యకర్తలను నివాసం వద్ద కలవడానికి ప్రాధాన్యత కూడా ఇవ్వనున్నట్లు" సమాచారం. అధికారంలో ఉండగా తాడేపల్లి నివాసం దరిదాపులకు వెళ్లలేని కార్యకర్తలు ఇకపై అపాయింట్మెంట్ లేకుండా జగన్ ను కలవవచ్చు అనేది ఆ పార్టీ వర్గాల సమాచారం. దీంతోపాటు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చే నాయకులు ప్రత్యేకంగా వయసు జగన్ కలిసి ఎందుకు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్. జగన్ మాటల్లో పెద్దగా వ్యత్యాసం లేదనేది రాజకీయ పరిశీలకుల అంచనా. ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకుల మధ్య సమన్వయం సాధించడంతోపాటు సామాన్య కార్యకర్తల్లో కూడా మరింత అభిమానం పోగు చేసుకోవడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆచరణలో ఇది ఎంత మేరకు సఫలం అవుతుంది? వైయస్ జగన్ కార్యకర్తలు కాదు కదా. ద్వితీయ శ్రేణి నాయకులకు ఎంత మేరకు అవకాశం ఉంటుందనేది కాలమే సమాధానం చెప్పాలి. జగన్ జనంలోకి వచ్చిన తర్వాత వాతావరణం ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిందే.
Next Story