
హుండీ లెక్కింపులో చేతివాటం… సేవ ముసుగులో అవినీతి!
దేవుడంటే భయం లేదు, భక్తి లేదు..భక్తులు ఇచ్చిన సొమ్మనే కనీస పాప భీతి కూడా లేకుండా యథేచ్ఛగా అవినీతి సాగుతున్న సంఘటన ఈసారి శ్రీకాళహస్తి ఆలయంలో జరిగింది.
దేవుడంటే భయం లేదు, భక్తి లేదు.. కనీసం పాప భీతి కూడా లేకుండా యథేచ్ఛగా అవినీతి సాగుతున్న సంఘటన ఈసారి శ్రీకాళహస్తి ఆలయంలో జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపులో జరుగుతున్న అవినీతి మరోసారి బయటపడింది. 15 సార్లుగా హుండీ లెక్కింపులో పాల్గొంటున్న ఓ భక్తురాలు ఈసారి చిక్కింది. ఆమె ఇప్పటికి ఇలా ఎన్నిసార్లు చేశారో తెలియదు గాని ఇప్పుడు మాత్రం దొరికిపోయారు. భక్తుల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన పవిత్ర స్థలంలోనే కొందరు సేవకులు, సిబ్బంది చేతివాటం చూపుతూ హుండీలోని సొమ్మును స్వాహా చేస్తుండడం భక్తుల్లో ఆవేదన కలిగిస్తోంది.
ఇటీవల జరిగిన హుండీ లెక్కింపు సందర్భంగా తిరుపతికి చెందిన లావణ్య అనే మహిళ హుండీలోని రూ.98,500లను తన లోదుస్తుల్లో దాచి పెట్టినట్లు అధికారులు గుర్తించి పట్టుకున్నారు. అనుమానం వచ్చి ఆమెను ప్రత్యేకంగా తనిఖీ చేయగా ఈ నగదు బయటపడింది. గతంలోనూ ఆమె 15 సార్లు హుండీ లెక్కింపులో పాల్గొనడం విశేషం. అనుభవం ఉన్నవారే ఇలా వ్యవహరించడంపై ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిఘా కెమెరాలకు చిక్కకుండా ఏమి మాయ చేస్తున్నారో!
హుండీ లెక్కింపు సమయంలో నిఘా కెమెరాలు పనిచేస్తున్నప్పటికీ, కొందరు ఎంతో చాకచక్యంగా చేతివాటం చూపిస్తూ సొమ్ము దాచేస్తున్నారు. ఈసారి ఆమె పాపం పండి దొరికిపోయారు. దొరికిన మొత్తం చిన్నదే అయినా ఇలా ఆమె ఎన్ని సార్లు చేశారో, ఇంకెంతమంది ఇలా చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారో తేలాల్సి ఉంది. అనుమానంతో తనిఖీ చేయకపోయిఉంటే, ఈ అవినీతీ బయటపడేదే కాదు. ఇది ఇప్పటివరకు తెలిసిన ఒక్క ఘటన మాత్రమే — ఇంకా ఎన్ని పట్టించుకోకుండా మిగిలిపోయాయో అన్నది మిగిలిన ప్రశ్న.
స్థల మార్పుతో అనుమానాలు-
ఇటీవలి వరకు హుండీ లెక్కింపును ఆలయంలోని శ్రీ మేధా దక్షిణామూర్తి సన్నిధిలో నిర్వహించేవారు. కానీ భక్తుల రద్దీ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న కారణంతో, ఆలయం పక్కనే ఉన్న రూ.500 దర్శనం ఉన్న రాహు-కేతు సర్పదోష నివారణ పూజల మండపానికి లెక్కింపును మార్చారు.
ఈ మార్పు తర్వాతే లెక్కింపు ప్రక్రియపై అనుమానాలు పెరిగాయి. భద్రతా దృష్ట్యా తక్కువ తనిఖీలు జరిగే ప్రదేశం కావడంతో, సొమ్ము దాచేందుకు అవకాశం కలుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉచిత సేవకులకు కరెన్సీ లెక్కింపా?
గతంలో కేవలం నాణాల లెక్కింపులో మాత్రమే ఉచిత సేవకులు పాల్గొనేవారు. కరెన్సీ నోట్ల లెక్కింపును ఆలయ సిబ్బంది, శాశ్వత ఉద్యోగులే నిర్వహించేవారు. కానీ ఇటీవల కరెన్సీ లెక్కింపును కూడా సేవకులకే అప్పగించడం వల్ల, బాధ్యతారాహిత్యం పెరిగినట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరి వద్ద ఎంత నగదు ఉంది, ఎవరికి ఏ బాధ్యత అప్పగించారన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో అవకతవకలకు ఆస్కారం కలుగుతోంది.
దొరికిపోయిన వారే మళ్లీ వస్తున్నారా?
ఇది ఒక్క లావణ్య కేసు మాత్రమే కాదు. గతంలోనూ హుండీ లెక్కింపులో అవినీతికి పాల్పడి పట్టుబడినవారు, కొంతకాలం తర్వాత రాజకీయ సిఫార్సులతో మళ్లీ సేవలోకి చేరుతున్న దృశ్యాలు వెలుగుచూశాయి. అలాంటి తీరుతో వ్యవస్థపైనే భక్తుల్లో అనుమానం కలుగుతోంది. నేరచరిత్ర ఉన్నవారిని తిరిగి విధుల్లోకి చేర్చడం ఎంతవరకు న్యాయం అన్న ప్రశ్న వినిపిస్తోంది.
ఆలయ పవిత్రతకు పరిరక్షణ అవసరం
భక్తుల సమర్పణగా లభించే హుండీ సొమ్ము నిర్వీర్యంగా దారి తప్పకూడదు. అది ఆలయ నిర్వహణ, అభివృద్ధి, సేవా కార్యక్రమాల కోసం వినియోగించాల్సినది. కానీ కొందరు వ్యవస్థను తమ లాభాలకు వాడుకుంటుండటం, విచారకరం.
ఈ తరహా అవినీతిపై కఠిన చర్యలు లేకపోవడం వల్లే ఇలాంటి చర్యలు పునరావృతమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సిబ్బంది ఎంపిక, లెక్కింపు ప్రక్రియ, భద్రతా పర్యవేక్షణల్లో సమగ్ర సంస్కరణలకే ఈ ఘటన మేల్కొలుపు కావాల్సిన అవసరం ఉంది.
Next Story