అప్పటి వరకు సీఎం జగన్ మెజారిటీనే టాప్.. 2021 ఎన్నికల్లో ఆ రికార్డును ఒక మహిళ బద్దలు కొట్టింది.
జి. విజయ కుమార్
గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అందరి కంటే ఒక మహిళ భారీ మెజారిటీతో గెలుపొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంటే కూడా ఆమె అత్యధిక ఓట్లు సాధించారు. ఆమె ఒక దళిత మహిళ కావడం విశేషం. ఆ రికార్డు కడప జిల్లా బద్వేలు నియోజక వర్గంలో చోటు చేసుకుంది. బైఎలక్షన్‌లో పోటీ చేసిన ఆమెకు అత్యధిక ఓట్లు లభించాయి. భర్త చనిపోయారనే సానుభూతి కావచ్చు, లేక మరే కారణమైనా కావచ్చు కానీ ఆ బైఎలక్షన్‌లో ఆమెకు మాత్రం బంబర్ మెజారిటీ లభించడం అప్పట్లో సంచలనంగా మారింది.
భర్త మరణంతో బరీలోకి
2019 ఎన్నికల్లో బద్వేలు నుంచి డాక్టర్ గుంతోటి వెంకటసుబ్బయ్య వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. దురదృష్ట వశాత్తు మార్చి 2021లో ఆయన అనారోగ్యంతో మరణించారు. దీంతో బద్వేలు అసెంబ్లీ నియోజక వర్గంలో బైఎలక్షన్లు నిర్వహించారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గుంతోటి వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధాను పోటీకి దింపారు. అయితే తెలుగుదేశం పార్టీ పునరాలోచనలో పడింది. అనారోగ్య కారణాల వల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన నేపథ్యంలో బైఎలక్షన్‌లో పాల్గొనాలా వద్దాని ఆ పార్టీ నేతలు తర్జన, భర్జన పడ్డారు. తొలుత రంగంలోకి దిగాలని నిర్ణయించిన ఆ పార్టీ అధికనేత చంద్రబాబు నాయుడు 2019లో పోటీ చేసి ఓడిపోయిన ఓబులాపురం రాజశేఖర్‌ను పోటీకి పెట్టాలని భావించారు. తర్వాత వద్దనుకుని అసలు పోటీ నుంచే తప్పుకున్నారు.
బిజెపీ మాత్రం బైఎలక్షన్‌లో తమ అభ్యర్థిని దింపాలని నిర్ణయించింది. పనతాల సురేష్‌ను బిజెపీ అభ్యర్థిగా ఖరారు చేసి పోటీలోకి దింపింది. పోటీ నుంచి తప్పుకున్న తెలుగుదేశం పార్టీ బైఎలక్షన్‌లో బిజెపీకి సపోర్టు చేస్తున్నట్లు మద్ధతు ప్రకటించింది. దాదాపు ఉమ్మడి అభ్యర్థిగానే సురేష్ బైఎలక్షన్‌లో బరీలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ కూడా బైఎలక్షన్‌లో పోటీకి దిగాలని నిర్ణయించింది. గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పిఎం కమలమ్మను ఎన్నికల బరీలోకి దింపింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌తో కలిపి ముగ్గురు అభ్యర్థులు రంగంలోకి దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అనారోగ్యంతో చనిపోవడం, ఆయనకు డాక్టర్‌గా మంచి పేరు ఉండటం, ఆ సానుభూతి ఓటర్లలో బలంగా ఉండటం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించి అత్యధికంగా 151 సీట్లు సాధించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఆయన కూడా కడప జిల్లా వాసి కావడం ఇలా అనేక కారణాలు రీత్యా ఓటింగ్ వన్ సైడయ్యింది. దీంతో బంపర్ మెజారిటీతో డాక్టర్ దాసరి సుధ గెలుపొందింది. ఆమెకు 1,12,211 ఓట్లు రాగా, బిజెపీ అభ్యర్థి సురేష్‌కు 21,678, కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మకు 6,235 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఆమెకు 90,533 ఓట్ల మెజారిటీ లభించింది. అంటే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంటే అధికంగా ఓట్లు ఆమెకు లభించాయి. ఏపిలోనే ఇదొక రికార్డు. అప్పటి వరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వచ్చిన మెజారిటీనే టాప్. ఆ రికార్డును 2021 బద్వేలు బైఎలక్షన్‌లో ఆమె తిరగ రాశారు. జగన్ కంటే దాదాపు 423 ఓట్లు అధికంగా సాధించి పైచేయిగా నిలచారు. 2019 ఎన్నికల్లో 90,110 ఓట్ల భారీ మెజారిటీతో జగన్ పులివెందుల అసెంబ్లీ నియోజవర్గం నుంచి గెలుపొందారు.
2024 ఎన్నికల్లో రిపీట్ అవుతుందా
తాజాగా ఎన్నికల 2024 ఎన్నికల నేపథ్యంలో ఈ భారీ మెజారిటీ అంశం తెరపైకి వచ్చింది. దీని గురించిన చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 2024 ఎన్నికల్లో బద్వేల్ అసెంబ్లీ నియోజక వర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధకే సీఎం జగన్ టికెట్ ఖరారు చేశారు. మరి 2021బద్వేల్ ఉప ఎన్నికల్లో సాధించిన భారీ మెజారిటీ ఈ సారి ఎన్నికల్లో రిపీట్ అవుతుందా అనేది వేచి చూడాలి.
Next Story