‘ఆంధ్రా అంగన్వాడీల పోరాటం చిరస్మరణీయమైంది’
జీతాలు పెంచాలని ఆంధ్ర ప్రదేశ్ అంగన్ వాడీ సిబ్బంది సమ్మె చేసి, నిర్భంధం మధ్య ఉధృతం చేసి చివరకు ప్రభుత్వం దిగివచ్చేలా చేశారు. 42 రోజల సమ్మె జనవరి 23న ముగిసింది
ఇటీవలి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అంగన్వాడీల పోరాటం చిరస్మరణీయ మైందని కార్మిక వర్గ పోరాటాల చరిత్ర పేజీలలో దీనికి ఒక ముఖ్యమైన స్థానం ఏర్పడిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అన్నారు.
శని ఆదివారాల్లో తిరుపతి జిల్లాలోని అంగన్వాడి కార్యకర్తలకు సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఉద్యమ శిక్షణా తరగతుల ప్రారంభ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు యస్ వాణిశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కందారపు మురళి ప్రసంగిస్తూ అంగన్వాడీల పోరాటం కార్మికోద్యమ చరిత్రలో ఓ మైలురాయిగా ఆయన అభివర్ణించారు.
దేశంలో మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిలు అనుసరిస్తున్న విధానాలు ప్రజల మనోభావాలకు భిన్నమైన వని ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పరిపాలన లేదని... సమస్యల నుంచి పక్కదారి మళ్లించడానికి మతం పేరుతో, కులం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
మోడీ ప్రభుత్వ మతోన్మాద విధానాలను రాష్ట్రంలోని తెలుగుదేశం, వైసీపీ, జనసేనలు బలపరచడం దురదృష్టకరమని అన్నారు. సృష్టించ బడుతున్న సంపదను ప్రజలకు కాకుండా కార్పొరేట్ శక్తులకు మళ్ళించడమే ఈ ప్రభుత్వాల అనైతిక చర్యగా ఆయన తెలిపారు.
రాష్ట్రంలో 42 రోజులపాటు నిర్వహించిన అంగన్వాడీల సమ్మె నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని పోరాడే శక్తులకు బలాన్ని ఇచ్చిందని, పోరాడితే పోయేదేమీ లేదు... బానిస సంకెళ్లు తప్ప అన్న నినాదాన్ని ఆచరణ యోగ్యం చేసిందని ప్రశంసించారు.
అంగన్వాడీలు జీతాల కోసం పోరాడే సంఘం కాదని సమాజ మార్పుకు దోహదం చేసే సంఘంగా పరిణితి చెందాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు. అంగన్వాడీలకు నిర్వహిస్తున్న క్లాసులు సమాజాన్ని చూడాల్సిన దృష్టిని నేర్పుతాయని, అంగన్వాడీలను మరింత పదును పెట్టే తరగతులుగా ఆయన అభివర్ణించారు. సమాజం పట్ల, సామాజిక సమస్యల పట్ల ఒక దృక్కోణాన్ని ఏర్పరిచే క్లాసులలో పాల్గొని పరిణితి చెందిన వ్యక్తులుగా అంగన్వాడీలు మారాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రానున్న రోజులలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ కార్యకర్తలు నాయకత్వం వహించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు కేఎన్ఎన్ ప్రసాదరావు, స్వరూప రాణి, శ్యామలమ్మ, ముని కుమారి, ధనమ్మ, సౌజన్య, పుష్ప, రేవతి, రాజేశ్వరి, ఇంద్రావతి, నిర్మల, ప్రభావతి, మంజుల, హైమావతి, నాగరాజమ్మ తదితరులు పాల్గొన్నారు.
Next Story