అమరావతి రాజధాని నిర్మాణంపై కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
అమరావతి అనేది ప్రజా రాజధాని, అని యువతకు ఉపాధి కల్పించే రాజధాని అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచంలోని టాప్ యూనివర్శిటీలు ఇక్కడకు రానున్నాయని అన్నారు. పలు నాలెడ్జీ ఎకానమీ యూనివర్శిటీలు ఇక్కడకు వస్తున్నాయి. ప్రపంచం లోని టాప్ 10 విశ్వ విద్యాలయాలు, టాప్ 10 ఆసుపత్రులు ఇక్కడకు రానున్నాయని వివరించారు. అలాగే విశాఖ, తిరుపతి, అమరావతి నగరాలపై ప్రత్యేక ఫోకస్ ఉంటుందన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఒక కుటుంబం ఒక ఎంట్రప్రెన్యూర్ అనేది అమలు కావాలన్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులపై సీఆర్‌డిఏ కమిషనర్ కే భాస్కర్
ప్రెజెంటేషన్ ఇచ్చారు. అమరావతి రాజధాని పనులు పున:ప్రారంభానికి రూ. 20,500 కోట్ల సీఆర్డీఏ అథారిటీ ద్వారా పరిపాలనా ఆమోదం తీసుకోవడం జరిగిందని వివరించారు. ఇప్పటి వరకు అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి రూ. 31వేల కోట్ల టైఅఫ్ చేశామన్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడీబీ) నిన్న జరిగిన ఆ బ్యాంకు బోర్డు సమావేశంలో అమరావతి రాజధానికి రూ. 15000 కోట్ల రుణం మంజూరుకు ఆమోదం తెలిపిందన్నారు. అమరావతి రాజధాని పరిధిలోని ఆర్–5 జోన్లో గత ప్రభుత్వం 50,793 మంది లబ్ధిదారులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టగా వారికి సంబంధిత జిల్లాల్లోనే ఇళ్ళు ఇచ్చేందుకు వీలుగా అనువైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్లను కోరారు. గత ఐదేళ్లు పనులను పట్టించుకోక పోవడం వల్ల రాజధాని నిర్మాణంలో సమస్యలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఏపీ సీఆర్డీఏ పరిధిని యధాతద స్థితికి తీసుకురావడం జరిగిందని తెలిపారు.
Next Story