టీటీడీకి వెళ్లనీయడం లేదు. నోటీసులిచ్చారు. డైవర్షన్‌ కోసమే చేస్తున్నారు. సీఎం పాపాలు ప్రజలపై పడకుండా చంద్రబాబుపైనే పడేవిధంగా రేపు పూజలు చేయాలని జగన్‌ పిలుపు.


తిరుమల తిరుపతి లడ్డూ పవిత్రతను దెబ్బతీస్తూ సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. కల్తీ నెయ్యి ప్రసాదాలకు వాడలేదని ఈ నెల 20న ఈవో చెప్పారన్నారు. అబద్దాలు చెబుతూ సీఎం చంద్రబాబు ప్రభుత్వం భక్తుల్లో అనుమానపు బీజాలు వేయడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. తన మతం ఏమిటని అడుగుతున్నారని, తన మతం మానవత్వమని, అదే డిక్లరేషన్‌లో రాసుకోండి అంటూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న జగన్‌ శుక్రవారం తాడేపల్లిలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా కులం, మతం ఏంటో ప్రజలందరికి తెలుసన్నారు. నా మతం మానవత్వమన్నారు. నాలుగు గోడల మధ్య నేను బైబిల్‌ చదువుతా. బయటకు వెళ్తే అన్ని మతాలను గౌరవిస్తానన్నారు. హిందుమత ఆచారాలను పాటిస్తా, ఇస్లాం, సిక్కు మత సంప్రదాయాలను గౌరవిస్తానని ఉద్ఘాటించారు. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందంటూ మండిపడ్డారు.

దేవుడి దర్శనానికి వెళ్తామంటే నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. దైవ దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలో ఇదే మొదటిసారి అన్నారు. దర్శనానికి వెళ్తామంటే అరెస్ట్‌ చేస్తామంటున్నారు. గొడవలు చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను తిరుపతికి రప్పించారని ఆరోపించారు. బీజేపీ అగ్రనాయకత్వానికి ఈ విషయం తెలుసా? అని ప్రశ్నించారు. తాను తిరుమలకు వెళ్తానంటే వేలాది మంది పోలీసులను మోహరింప చేశారని, లడ్డూ వివాదంలో డైవర్షన్‌ కోసమే ఇవన్నీ చేస్తున్నారని మండి పడ్డారు. రాజకీయ దుర్భుద్ధితోనే లడ్డూ విశిష్టతను దెబ్బ తీశారని సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. జంతువుల కొవ్వు కలిపినట్లు దుష్ప్రచారం చేశారని మండి పడ్డారు.
ఆరు నెలకొకసారి నెయ్యి కొనుగోలుకు టెండర్లు జరుగుతాయని, అందులో ఎల్‌1గా వచ్చిన వారికి టెండర్లు ఇస్తారన్నారు. దశాబ్ధాలుగా జరుగుతూ ఉన్న ప్రక్రయ అన్నారు. ప్రతి ట్యాంకర్‌ ఎన్‌ఏబీఎల్‌ సర్టిఫికెట్‌ తేవాలి. ట్యాంకర్‌ వచ్చాక కూడా టీటీడీ 3 టెస్టులు చేస్తుంది. ఒక్క టెస్ట్‌ ఫెయిల్‌ అయినా ట్యాంకర్‌ను వెనక్కి పంపుతారని, గతంలో చంద్రబాబు హయాంలో కూడా 15 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపారని, తమ హయాంలో కూడా 18 సార్లు వెనక్కి పంపామన్నారు.
జూలై 6, 12 తేదీల్లో నాలుగు ట్యాంకర్లు వచ్చాయి. ఆ నాలుగు టెస్టుల్లో ఫెయిలయ్యాయి. టెస్టులు ఫెయిలైన ఆ 4 ట్యాంకర్లను వెనక్కి పంపారు. సహజంగా టెస్ట్‌లు ఫెయిలైతే ఆ నమూనాలను మైసూర్‌ ల్యాబ్‌కు పంపుతారని, అయితే తొలి సారి ఆ శాంపిల్స్‌ను గుజరాత్‌కు పంపారన్నారు. ట్యాంకర్లను వెనక్కి పంపి సదరు కంపెనీకి నోటీసులు ఇచ్చారని, 2 నెలల తర్వాత చంద్రబాబు యానిమల్‌ ఫ్యాట్‌ కలిసిందని, ఆ మరుసటి రోజే టీడీపీ ఆఫీస్‌లో ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను బయటపెట్టారని విమర్శించారు. మరో వైపు కల్తీ నెయ్యి ప్రసాదాలకు వాడలేదని ఈ నెల 20న ఈవో చెప్పారని స్పష్టం చేశారు. ఈ నెల 22న ఈవో ఇచ్చిన నివేదికలో కూడా ట్యాంకర్ల వెనక్కి పంపినట్లు ఉంది. అయినా సీఎం చంద్రబాబు కల్తీ నెయ్యి కలిసిందని అబద్ధాలు చెప్పారని మండి పడ్డారు. తన అబద్దాలతో సీఎం చంద్రబాబు తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు.
తాను అన్ని మతాలను గౌరవిస్తానన్నారు. సీఎం చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయని అన్నారు. తన కులం, మతం ఏంటో ప్రజలందరికి తెలుసు. నా మతం మానవత్వమని, నాలుగు గోడల మధ్య నేను బైబిల్‌ చదువుతానని, బయటకెళ్తే అన్ని మతాలను గౌరవిస్తానన్నారు. తన మతం ఏమిటని అడుగుతున్నారుని తన మతం మానవత్వమని డిక్లరేషన్‌లో రాసుకోండి అని అన్నారు. ఎన్డీఏ కూటమిలోని సీఎం చంద్రబాబు లడ్డూ విశిష్టతను కించపరుస్తుంటే బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. దగ్గరుండి కావాలని అబద్ధాలు చెప్పించి భక్తుల్లో అనుమాన బీజాలు నాటారన్నారు. రాజకీయ స్వార్థం కోసం స్వామివారి విశిష్టతను దెబ్బ తీయడం సమంజసం కాదన్నారు. యానిమల్‌ ఫ్యాట్‌తో ప్రసాదాన్ని తయారు చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది ధర్మమేనా అంటూ ప్రశ్నించారు. 2015–18 వరకు చంద్రబాబు హయాంలో నందిని డెయిరీ బ్రాండ్‌ను ఎందుకు వాడలేదని ప్రశ్నించారు. 2015–19 మధ్య ఏ రేటుకు నెయ్యిని కొన్నారని నిలదీశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అవే డెయిరీలు, అవే ధరలు, అదే నెయ్యి అని తెలిపారు. ఉన్న రేటు రూ.320 అయినప్పుడు కొంటే తప్పేంటని ప్రశ్నించారు. మీ హయాంలో కూడా ఇదే రేటుకు నెయ్యి కదా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. నెయ్యి రేట్లు పెంచి హెరిటేజ్‌కు లాభం చేకూర్చేందుకు సీఎం చంద్రబాబు ప్లాన్‌ చేశారని ఆరోపించారు. తన కులం, తన మతం ఏంటో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. గతంలో తన తండ్రి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారని, తాను ఆయన కొడుకునే కదా అంటూ వ్యాఖ్యానించారు.
తన పాదయాత్ర ప్రారంభం, ముగింపులో కూడా స్వామివారిని దర్శించుకున్నానని చెప్పారు. నాడు సీఎంగా చంద్రబాబే ఉన్నారు. సీఎంగా తాను ఐదేళ్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించానన్నారు. ఒక సీఎంగా ఐదేళ్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తిని తిరుమలకు వెళ్లకూడదని అంటారా అని ప్రశ్నించారు. మతం ఏంటని ప్రశ్నిస్తారా అంటూ మండిపడ్డారు. సెక్యులర్‌ అనే పదానికి అర్థం తెలుసా అని ప్రశ్నించారు. గుడికి వెళ్లాలని అనుకుంటే ఏ మతం అని అడుగుతున్నారన్నారు. ఒక మాజీ సీఎంకే ఈ పరిస్థితి ఎదురైతే, ఇక దళితుల పరిస్థితి ఏంటన్నారు. హిందూ ఇజానికి తామే ప్రతినిధులమని చెప్పుకునే బీజేపీ, సీఎం చంద్రబాబు తిరుమలను, లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తుంటే ఎందుకు మందలించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబును మీరెందుకు వెనకేసుకొస్తున్నారని నిలదీశారు. హిందుత్వమంటే ఇదేనా అని నిలదీశారు. శనివారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని సీఎం చంద్రబాబు పాపాలు ప్రజలపై పడకుండా చంద్రబాబుపైనే పడేవిధంగా ప్రత్యేక పూజలు నిర్వహించాని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Next Story