ఈసారి కుప్పంలో ‘చంద్రబాబు’ను వైసీపీ ఓడిస్తుందా?
హంద్రీనీవా జలాల విడుదల చేసేందుకు ఈనెల 26న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం పర్యటనకు రానున్నారు. పాలారు ప్రాజెక్టుకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
వై నాట్ 175 అనే ఛాలెంజ్ తో..కుప్పం నియోజకవర్గంపై వైసీపీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. పదేళ్లుగా చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం పై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పంలో పర్యటించడం రేపటి పర్యటనతో కలుపుకుని మూడోది అవతుంది. రేపటి పర్యటనలో హంద్రీనీవా జలాలను కుప్పం బ్రాంచ్ కాలువలోకి విడుదల చేస్తారు. దీంతో పాటు ఆంధ్ర-తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదంలో ఉండి న్యాయస్థానంలో పరిష్కారమైన పాలారు ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.
పూజ ఒక చోట..
రామకుప్పం మండలం రాజుపేట వద్ద హంద్రీ- నీవా కాలువలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జలపూజ నిర్వహించడంతోపాటు సమీపంలోని.. తిమ్మసముద్రం వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలని 20 రోజుల కిందట నిర్ణయించారు. ఆ తర్వాత మూడుసార్లు వాయిదా వేశారు. తాజా కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం.. మొదటగా రామకుప్పం మండలంలో సీఎం సభ నిర్వహించాలని అనుకున్న నాయకులు.. ఆఖరి నిమిషంలో శాంతిపురం మండలానికి మార్చారు.
రామకుప్పం వద్ద రహదారి ఇబ్బందిగా ఉంది. వాహనాల రాకపోకలకు అనువుగా లేకపోవడం వల్లే వేదిక మార్చినట్లు వైసీపీ నాయకులు వివరణ ఇస్తున్నారు. నీటి విడుదల అనంతరం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రామకుప్పం, శాంతిపురం స్థానిక నాయకులతో దాదాపు గంట పాటు అంతర్గత సమావేశం నిర్వహించే విధంగా షెడ్యూల్ తయారు చేశారు.
చెప్పిందే చేస్తున్నాం..
"మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పింది చేస్తున్న. చేసేది చెబుతున్నాం. అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో అన్నారు.దశాబ్దాలుగా విపక్ష నాయకుడు ఎన్ చంద్రబాబు నాయుడు చేయలేని పనులను, ఇచ్చిన మాటను నిలుపుకొని సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి కృషితో.. హంద్రీ- నీవా జలాలను తీసుకువచ్చామని ఆయన స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలోని 54 చెరువులను కృష్ణా జలాలతో నింపుతామని ఆయన వెల్లడించారు.
పాలారు ప్రాజెక్టుకు శంకుస్థాపన
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తుచేశారు. అప్పట్లోనే 54 కోట్లు మంజూరు చేశారని చంద్రబాబు నాయుడు కుట్ర ఫలితంగా కోర్టుకు వెళ్లి ప్రాజెక్టును అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై కోర్టు క్లియరెన్స్ ఇవ్వడం వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా పాలారు పనులకు శంకుస్థాపన చేయనన్నట్లు ఆయన వివరించారు.
నత్తనడకన పనులు
కుప్పం బ్రాంచి కాలువలో 'హంద్రీ- నీవా' కృష్ణా జలాలు నత్తనడకలా సాగుతున్నాయా? కుప్పానికి జలాలు తెచ్చామని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా.. నియోజకవర్గంలోని నిర్దేశిత ఆఖరి చెరువు పరమసముద్రానికి ఇప్పట్లో నీళ్ళు అందే పరిస్థితి లేదని భావిస్తున్నారు. అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లోని హంద్రీ- నీవా కాలువల్లో నీటి సరఫరాను నిలుపుదల చేసి.. కుప్పం బ్రాంచి కాలువలోకి నీటిని మళ్లించినట్లు తెలుస్తోంది.
టీడీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది
గత తెదేపా ప్రభుత్వ పాలనలో.. పలమనేరు నియోజకవర్గంలోని వి.కోట మండలం క్రిష్ణాపురం వరకు ఐదేళ్ల కిందటే కృష్ణా జలాలను పారించారు. వి.కోట మండలంతోపాటు కుప్పం నియోజకవర్గంలో భూ సేకరణకు సంబంధించి కేవలం 13 శాతం పనులు పెండింగ్ వల్ల అప్పట్లో క్రిష్ణాపురం నుంచి జలాలు ముందుకు సాగలేదనీ సాగునీటి పారుదల రంగం నిపుణులు చెబుతున్నారు. గడచిన నాలుగేళ్లుగా కాలువ పనులు ఆగాయని అంటున్నారు.
ఎన్నికల సమీపిస్తున్న వేళ
పలమనేరు- కుప్పం నియోజకవర్గాల సరిహద్దు ప్రాంతం వర్ధికుప్పం నుంచి రాజుపేట వైపు నీటి ప్రవాహం మెల్లగా సాగుతోంది. జలాలు ముందుకు సాగడానికి అడ్డంకిగా మారిందనే విషయంపై పెద్దిరెడ్డి స్పందించారు. "గేట్లు పెట్టి మీరు నిలువ చేశారు. ముఖ్యమంత్రి నీరు విడుదల చేయగానే చెరువులు నింపుతాం" అని అన్నారు.
మ.. మ.. అనిపించేలా ఉంది
"హంద్రీ- నీవా కాలువలో నీళ్లు పారించే అంశం ఎన్నికల డ్రామాగా ఉంది " సీనియర్ జర్నలిస్టు, సాగునీటిపారుదల రంగ విశ్లేషకుడు వి. శంకరయ్య తేల్చేశారు. వాస్తవానికి కృష్ణా నది నుంచి రెండో ఫేజ్ లో 40 టీఎంసీలు నీరు డ్రా చేస్తే 214 కిలోమీటర్లు ప్రధాన కాలువ ద్వారా ప్రవహించాలి. తద్వారా శ్రీశైలంలో 380 అడుగులు ఉన్న నీరు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది.
తర్వాత జీడిపల్లి- మడకశిర కెనాల్-, పుంగనూరు తెనాలి నుంచి కుప్పం బ్రాంచ్ కెనాల్ కు నీరు పారించేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు 10 టీఎంసీల నీరు అవసరం అవుతుందనేది ఆయన విశ్లేషణ. "ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏదో చేశాం" అనిపించడానికి మాత్రమే ఇలా కుప్పంలో హంద్రీనీవా నీరు పారించడానికి వ్యక్తులు వేశారు. అని ఆయన విశ్లేషించారు. " తమకు అన్యాయం చేసి, కుప్పంకు నీరు తరలిస్తున్నారు" అంటూ కర్నూలు అనంతపురం జిల్లాల్లో కూడా రైతులు గగ్గోలు పెడుతున్నారని ఆయన తెలిపారు.
పనులు పూర్తి చేశాం: హంద్రీనీవా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ బాబు
కెనాల్ పనులు పూర్తయ్యాయి. మూడు పంప్ హౌస్ ల ద్వారా నీటి లిఫ్టింగ్ సాగుతోంది. ఇన్స్పెక్షన్ ట్రాక్, అక్వి ఓటీ పాయింట్లతో సహా అన్నీ పూర్తి చేశాం. అని హంద్రీ - నీవా ప్రాజెక్టు రమేష్ బాబు కుప్పంలో తెలిపారు. పూర్తిస్థాయిలో నీటి విడుదలకు సిద్ధంగా ఉన్నాం. కాలువ చివర పరమసముద్రం చెరువు వరకు నీటి సరఫరాకు ఎలాంటి అడ్డంకి లేదన్నారు. రాజుపేట వద్ద నీరు విడుదల చేస్తే శాంతిపురం మండలంలోకి ప్రవేశిస్తాయి. అని వివరించారు.
Next Story