సీఎంల భేటీ.. పరిష్కారాలు శూన్యం: మాజీ ఎంపీ భరత్
x

సీఎంల భేటీ.. పరిష్కారాలు శూన్యం: మాజీ ఎంపీ భరత్

ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశంపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఒక్క ప్రధాన అంశం కూడా పరిష్కరించబడలేదని దుయ్యబట్టారు


ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి మధ్య జరిగిన భేటీపై రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమైనా ఒక్క ప్రధాన అంశానికి కూడా పరిష్కారం లభించలేదంటూ విమర్శించారు. ఈ సమావేశంలో ఏయే అంశాలు చర్చించారు.. వాటిలో ఏమాత్రం పురోగతి సాధించారు అన్న అంశాలను రెండు రాష్ట్రాల నేతలు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కానీ విభజన సమస్యలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావడం స్వాగతించదగ్గ పరిణామం అని, రెండు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడానికి వీరి సమావేశం దోహదపడుతుందని అన్నారు.

పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలి

‘‘రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదం ఇప్పటి వరకు ఒక కొలిక్కిరాలేదు. ఈ సమస్యకు సంబంధించి ఇప్పటికే పలు కమిటీలు ఉన్నాయి. మళ్ళీ కొత్త కమిటీలు వేయడం ఎందుకు? షీలా బిడే కమిటీని ఎందుకు మర్చిపోయారు ఇద్దరు సీఎంలు. మంత్రులతో మరో కమిటీ ఏమిటి? ఉన్న కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ పనికిరావా? పనికిరావనుకుంటే ఎందుకు? కొత్త కమిటీల వల్ల వచ్చే లాభం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. అదే విధంగా ఏపీ రీ-ఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పది సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆ గడువు కూడా జూన్ 2తో ముగిసింది. దానిని మరో పదేళ్లు పొడిగించాలి. ఆంధ్రప్రదేశ్‌కు ఇంకా రాజదాని లేదు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రుల మధ్య జరిగిన భేటీ గురించి టీడీపీ ఎంపీలు ఎవరూ స్పందించలేదు? అందుకు కారణం ఏంటో?’’ అని అనుమానం వ్యక్తం చేశారు. అదే విధంగా ‘‘ఛద్రాచలం చుట్టూ ఉన్న ఐదు గ్రామాల ప్రధాన పోర్టుల్లో భాగస్వామ్యం కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది. దీనిపై రెండు రాష్ట్రాల నేతలు పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలి’’ అని భరత్ కోరారు.

వీరి సమావేశానికి ఏమాత్రం గుర్తింపు

కేంద్ర పెద్దల మధ్యవర్తిత్వం ఏమీ లేకుండా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన ఈ చర్చకు ఏమాత్రం గుర్తింపు ఉంటుంది అన్న అనుమానాన్ని కూడా భరత్ లేవనెత్తారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన విద్యుత్ బకాయిల గురించి వీరి సమావేశంలో ఏమాత్రం చర్చ జరిగింది? అసలు వీటి ప్రస్తావన అయినా వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. అసలు వీరి సమావేశంలో ఏయే అంశాలపై చర్చించారో కూడా ఇప్పటివరకు ఎవరూ ఎందుకు చెప్పలేదు అని కూడా ప్రశ్నించారాయన. అసలు విభజన సమస్యలనే చర్చించారా అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేశారు.

‘ఇసుకను అక్రమంగా అమ్ముకున్నారు’

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో రావడంతోనే ఇసుక అక్రమ అమ్మకాలకు టీడీపీ నేతలు తెరలేపారని కూడా మార్గాని భరత్ ఆరోపించారు. గుట్టల కొద్దీ ఇసుకను టీడీపీ నేతలు అక్రమంగా అమ్ముకున్నారన్నారు. ‘‘రాజ్యాంగంపై ఒట్టేసి ఎన్ని గుట్టల ఇసుకను అమ్ముకున్నారో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పాలి. అంతేకాకుండా ఆయన తన మాటలను గౌరవప్రదంగా ఉంచుకోవాలి. నా ప్రచార వాహనం దగ్దం అయిన ఘటనకు సంబంధించి అతని దగ్గర ఆధారాలు ఉంటే భయట పెట్టాలి. వాసు.. నిన్ను నువ్వు అధికంగా ఊహించుకోకు.. పవన్ కల్యాణ్ చరీష్మాతోనే నువ్వు గెలిచావు. నీకంటే అక్కడ ఏమీ లేదు. నీ బఫూన్ ముఖం చూసి ఎవరూ ఓటు వేయలేదు. అసలు రాజమండ్రికి నువ్వు ఎవరో కూడా పెద్దగా తెలియదు’’ అంటూ మండిపడ్డారు భరత్.

Read More
Next Story