మూన్నెళ్ల ముందే కూసిన వైసిపి కోయిల
11 నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌ల పేరుతో అభ్యర్థులను వైఎస్సార్‌సిపి ప్రకటించింది
తెలంగాణ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సిపి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తున్నది.ఎన్నికలకు ఇంకా 100రోజులు పైన టైం ఉండగానే 11 నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌ల పేరుతో అభ్యర్థులను వైఎస్సార్‌సిపి ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేని వారిని పక్కనబెట్టి నియోజకవర్గం మారిస్తే గెలుస్తారనుకుంటున్న వారి పేర్లను వైఎసార్‌సీపీ సోమవారం రాత్రి ప్రకటించింది. వీరిలో కొత్త వారు కూడా ఉన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 11 నియోజకవర్గాలకు కొత్తగా ఇన్‌చార్జ్‌లను ప్రకటించారు. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ వారు ఎమ్మెల్యేలుగా ఉండగా కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సిపి వారు ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉండటం విశేషం. నియోకవర్గానికి పార్టీ తరుపున పనిచేసే వారు లేనప్పుడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను ప్రకటించడం మొదటి నుంచీ జరుగుతున్నది. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలనే పక్కనబెట్టి ఇన్‌చార్జ్‌లను ప్రకటించారంటే వీరే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులనేది స్పష్టమైంది. మంగళగిరి నియోజకవర్గానికి కూడా ఇన్‌చార్జ్‌ను నియమించారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందుగానే మేల్కొనారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.