సొంత పార్టీపైనే నమ్మకం లేదా?.. టిడిపి అభ్యర్థి గెలుపుపై బెట్టింగ్
x

సొంత పార్టీపైనే నమ్మకం లేదా?.. టిడిపి అభ్యర్థి గెలుపుపై బెట్టింగ్

కొందరికి సొంత అధికార పార్టీపైనే నమ్మకం ఉన్నట్లు లేదు. టిడిపి అభ్యర్థి గెలుస్తాడని వైఎస్ఆర్సిపి నాయకులు బెట్టింగ్ పెట్టారు.


ఏ పోటీలో అయినా బెట్టింగ్ అనేది నేరం. 2024 ఎన్నికలు వేసవి కంటే ఎక్కువ హీట్ రగిలించాయి. అధికార వైఎస్ఆర్సిపి, ప్రతిపక్ష టిడిపి కూటమి మధ్య హోరాహోరీగా ప్రచారం, పోలింగ్ జరిగాయి. ఇంకో నాలుగు రోజుల్లో ఫలితాలు వెలవడనున్నాయి. పందెం రాయుళ్లు కూడా పోటీలు పడి రూ.లక్షలు, కోట్లలో బెట్టింగ్ పెడుతున్నారు. పెట్టడమే కాదు. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో ఈసారి ఎన్నికల్లో అంగీకార పత్రాలు కూడా రాయించుకున్నారు. ఎలాగంటే..

"టిడిపి అభ్యర్థి గెలుస్తాడు. నాది కూడా రూ.10 లక్షలు పందెం. వైఎస్ఆర్సిపి అభ్యర్థి విజయం తథ్యం. నా పందెం రూ.10 లక్షలు"

అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం అభ్యర్థుల గెలుపుపై తటస్థులు పెట్టిన పందెం కాదిది. పోటీపడి భారీ మొత్తంలో బెట్టింగ్ పెట్టిన వారిద్దరూ వైఎస్ఆర్‌సీపీ నాయకులే. వారిలో గాండ్లపెంట గ్రామానికి చెందిన వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఒకరు టిడిపి అభ్యర్థి గెలుస్తాడని పందెం కాశారు. నల్లచెరువు మండలానికి చెందిన సీనియర్ వైయస్ఆర్సీపీ నాయకుడు తమ అభ్యర్థి తప్పకుండా గెలుస్తారంటూ, బెట్టింగ్ పెట్టారు. అంతటితో ఊరుకొని వారిద్దరూ, "పెద్దమనుషుల సమక్షంలో అంగీకారపత్రం కూడా రాయించి" సంతకాలు చేశారు. ఆ పత్రం వైరల్‌గా మారింది.

అనంతపురం జిల్లాలో టిడిపి క్యాడర్ పరంగా బలంగానే ఉంది. 2014లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా అత్తర్ చాంద బాషా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో పీవీ సిద్ధారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ (2009 ఎన్నికల్లో గెలిచారు) పై వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా బిఎస్ మక్బూల్ అహ్మద్ పోటీ చేశారు. ఇంకో నాలుగు రోజుల్లో వీరి భవితవ్యం తేలనుంది. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు. కందికుంట వెంకట ప్రసాద్ సీనియర్ కావడం వారి బలం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి మండల స్థాయి నాయకులు ఒకరు టిడిపి అభ్యర్థి గెలుస్తారని, మరొకరు అధికార పార్టీ అభ్యర్థి గెలుస్తారని పందెం కాయడం నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది. "రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి రాబోతోంది అనే సంకేతాలు ఉండడం, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి దిగువ స్థాయి నాయకుల వరకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు" అనే మాటలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో, కదిరి నియోజకవర్గంపై అధికార పార్టీ నాయకులే విపక్షం నుంచి ఒకరు, అధికార పక్షం నుంచి మరొకరు బెట్టింగ్ కాయడం, అంగీకారపత్రం రాసుకోవడంపై రెండు పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా..

షర్మిల గెలుస్తారు..!

2024 ఎన్నికలు వేసవి ఎండలను మించిన స్థాయిలో ఎంతటి హిట్ రేకెత్తించాయి. ఆ కోపలోనే సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి స్వప్రాంతం కడప జిల్లాపై రాష్ట్ర ప్రజలే కాదు. జాతీయ దృష్టిని ఆకర్షించింది. కడప లోక్‌సభ నుంచి సీఎం వైఎస్. జగన్ బాబాయ్ కుమారుడు సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనపై సీఎం వైఎస్ జగన్ సొంత చెల్లెలు వైఎస్. షర్మిల రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో అందరి దృష్టి కడపపై నిలిచింది. మాజీ మంత్రి, బాబాయ్ వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం హాట్ టాపిక్‌గా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైయస్ షర్మిల రెడ్డి విజయం సాధించబోతున్నారు. అనే అంశంపై ప్రొద్దుటూరుకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి రు. 20 లక్షలు బెట్టింగ్ కాశారని సమాచారం. కడప పట్టణంలో లక్ష నుంచి 20, 30 లక్షల వరకు భారీ స్థాయిలో వైఎస్ఆర్సిపి, టిడిపి, కాంగ్రెస్ పార్టీల మద్దతుదారులతోపాటు వారందరినీ దగ్గరగా గమనించి అనేకమంది వివిధ వృత్తుల్లోని వారు కూడా భారీగానే బెట్టింగ్ కాసినట్లు వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

120 సీట్లపై.. బెట్టింగ్

"రాష్ట్రంలో 120 సీట్లతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడుతుంది" అని విజయవాడలో ఓ వ్యక్తి పందెం కోశారు. అది కూడా.. అధికారంలోకి వస్తే మిత్రుడు రు. కోటి ఇవ్వాలి. అధికారంలోకి రాకుంటే రు. 1.50 కోట్లు చెల్లిస్తా. అంటే కోటికి అదనంగా 50 లక్షలు చెల్లించే విధంగా బెట్టింగ్ పెట్టారు. అంతేకాదు..

విజయవాడ నగర ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు మెజారిటీపై కూడా బెట్టింగ్ జరిగింది. "పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్ కు మించి బోండా ఉమాకు మెజారిటీ వస్తుంది" అనే విషయంపై ఇద్దరూ పందెం కాశారు.

పిఠాపురంలో ఒకటికి రెండింతలు

కోస్తా ప్రాంతంలో ఏ ఉత్సవమైన పందాలకు కొరత ఉండదు. ఆ ప్రాంతం ప్రజలకు అదొక సరదా. వ్యసనం. వ్యాపకం కూడా. ఇది జగమెరిగిన సత్యం. 2024 సార్వత్రిక ఎన్నికలు భారీ హైప్ క్రియేట్ చేశాయి. పందాలు కాయడానికి కూడా ఎవరికి ఎవరు తగ్గడం లేదు. ఆ కోవలోనే..

పిఠాపురంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వంగా గీతతో పోటీపడిన జనసేన చీఫ్ కొణిదెల పవన్ కళ్యాణ్ విజయంపై భారీగా పందాలు కాశారు. 1:2 నిష్ఫత్తిలో పందాలు జోరుగా సాగాయి. అందులో ఓ వ్యక్తి పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారంటూ రూ.కోటి బెట్టింగ్ కాశారు. ప్రతిగా మరో వ్యక్తి రూ.నాలుగు కోట్ల ఆస్తిని అగ్రిమెంట్ రాసిచ్చారు. మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. రూ.లక్ష నుంచి 10, 20, 25 లక్షల వరకు లెక్కకు మించిన సంఖ్యలో ఆ ప్రాంత వాసుదే కాదు. పొరుగు జిల్లాల వారు కూడా భారీగా బెట్టింగులు పెట్టినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటనలో భారీ స్థాయిలో బెట్టింగులు పెట్టిన వారందరూ ఓ టీవీ ఛానల్ ముందే ఫోన్లో లావాదేవీలు, సంప్రదింపులు సాగించారు. ఆంక్షలు ఉన్నప్పటికీ సంక్రాంతి పండుగ సందర్భాల్లో కోడిపందాలు ఎలా నిర్వహిస్తారో.. అంతకు మించిన స్థాయిలో ఎన్నికల్లో మెజారిటీలు, అభ్యర్థుల విజయావకాశాలు, టిడిపి కూటమి వైయస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంశాలపై పోటీలు పడి పందాలు కాశారు.

ఈ పందాలన్నీ సోషల్ మీడియాలోనే కాదు. ప్రముఖ టీవీ ఛానల్ లో కూడా గురువారం రాత్రి ప్రసారం చేయడం గమనార్హం. వివిధ సంస్థలు సాగించిన సర్వేలు, టీవీ ఛానల్‌లో సాగుతున్న చర్చలు కూడా రాజకీయ పిచ్చోళ్ళలో మరింత పోటీ పెరగడానికి ఆస్కారం కలిపింది అన్నంలో సందేహం లేదు. ఇది కాస్త భారీ స్థాయిలో బెట్టింగ్లకు దారి తీయించినట్లు భావిస్తున్నారు. ఓట్ల లెక్కింపు తర్వాత ఎంతమంది ఆస్తులు పోగొట్టుకుంటారు. ఎంతమంది లక్షల రూపాయలు కోల్పోతారు అనేది వెల్లడి కాగలదు. కొన్నిచోట రహస్యంగా కొన్నిచోట్ల బహిరంగంగా సాగుతున్న ఈ బెట్టింగులు పోలీసుల దృష్టికి మాత్రం వెళ్లడం లేదు. పోలింగ్ ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు ప్రతిష్టకు సవాల్గా నిలిచింది. ఈ పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం మొత్తం కౌంటింగ్ ముందు రోజు నుంచి ఆ తర్వాత పది రోజులు వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేని విధంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. దీంతో బెట్టింగ్ రాయులను పట్టించుకునే స్థితిలో లేకపోవడం వల్ల, పందాల జోరుకు కళ్లెం వేసేవారు కనిపించని స్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.

Read More
Next Story