‘దైవాన్ని అడ్డుపెట్టుకుని బాబు నీచ రాజకీయాలు చేయడం హేయకరం’
రాజకీయ లబ్ధి కోసం ఒక వ్యక్తి ఇంతలా దిగజారతారని చంద్రబాబు నిరూపించారంటూ మాజీ మంత్రులు, వైసీపీ నేతలు రోజా, అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఒక వ్యక్తి ఇంతలా దిగజారతారని తాము కలలో కూడా ఊహించలేదని, కానీ ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారని చంద్రబాబు నిరూపించారంటూ విమర్శలు గుప్పించారు. టీటీడీ లడ్డు తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు, చేపల నుంచి తీసిన నూనె కలిసిందని చెప్పడానికి చంద్రబాబు వ్యాఖ్యలు, ఆయన చూపుతున్న రిపోర్ట్ తప్ప మరేమీ ఆధారాలు లేవని, శ్రీవారి ప్రసాదానికి వినియోగించే నెయ్యి విషయంలో టీటీడీ ఈవో, చంద్రబాబు వ్యాఖ్యల్లో పొంతనే ఉండటం లేదని మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే వివాదంపై మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా మండిపడ్డారు. తమ వంద రోజులు విఫల పాలనను కప్పిపుచ్చుకోవడానికి, ఈ వంద రోజుల్లో ప్రజలకు వాళ్లు చేసిన అన్యాయం, మోసాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే చంద్రబాబు ఇటువంటి నీచ రాజకీయాలకు తెరలేపారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్కే రోజా. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో హింస తాండవం చేస్తోందని, మహిళలకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారామే.
చంద్రబాబును ఛీ కొడుతున్న ప్రజలు..
‘‘తన రాజకీయ లబ్ధి కోసం నారా చంద్రబాబు ఆ దేవుడిని కూడా వదలకుండా అడ్డుపెట్టేసుకుంటున్నాడు. కోట్ల మందికి పరమపవిత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు చెడ్డపేరు వచ్చిన ప్రతిసారి ఇలాంటి సంచలనాత్మక, వివాదాలను రేకెత్తించడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య. తాను మంటపెట్టి.. పార్టీ నేతల ప్రచారంతో వివాదాన్ని భారీ రగల్చడంలో చంద్రబాబు సిద్ద హస్తుడు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రజలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన తీరును చూసి ఛీ కొడుతున్నారు. టీటీడీ ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ అని, సీఎంకు ఎటువంటి సంబంధం ఉండదని మంత్రి నారా లోకేష్ ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు మాజీ సీఎం వైఎస్ జగన్ కావాలనే కుట్రపూరితంగా టీటీడీలో వినియోగించే నెయ్యిలో జంతువ కొవ్వు కలిపించారన్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు, కూటమి ప్రభుత్వ నేతలు చేస్తున్న ఆరోపణలు ఒకదానితో ఒకదానికి సంబంధం లేకుండా ఉన్నాయి’’ అని ఎద్దేవా చేశారు.
బాధ్యులు చంద్రబాబు కాదా?
‘‘టీటీడీ ఈఓగా శ్యామల రావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి స్వచ్ఛమైన నెయ్యిని తెప్పిస్తున్నట్లు చెప్తున్నారు. నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్ కలవడంతోనే ట్యాంకర్లను వెనక్కు పంపామని జూలై 23న ఈవో శ్యామల రావు తెలిపారు. రెండు నెలల తర్వాత టీటీడీకి వచ్చిన నెయ్యిలో జంతువుల కొవ్వు సహా చేపల నూనె కూడా కలిసిందంటూ సీఎం ప్రకటించారు. దీని వెనక అసలు రహస్యం ఏంటి. నిజానిజాల నిగ్గు తేల్చకుండానే ప్రెస్‌మీట్‌లు పెట్టి గత ప్రభుత్వంపై నిందలు వేశారు. నెయ్యి కల్తీ విషయం బయటపడింది.. మీ ప్రభుత్వ హాయంలో. కాబట్టి దీనికి బాధ్యులు చంద్రబాబా? ఈవో శ్యామలరావా? మీరే తేల్చాలి. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ, సీజేఐలు ఆఖరికి చంద్రబాబు కూడా కుటుంబ సమేతంగా వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. లడ్డు రుచిలో తేడా ఉంటే ఆరోజై ఫిర్యాదు ఎందుకు చేయలేదు’’ అని రోజా ప్రశ్నించారు.
ఆధారాలేవి బాబు: అంబటి
టీటీడీ లడ్డూ వివాదంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. టీటీడీ నెయ్యిలో గొడ్డు కొవ్వు, చేపల నూనె కలిసిందని, తీవ్ర కల్తీ ఉందని జూలై నెలలోనే రిపోర్ట్ వస్తే.. దానిని విడుదల చేయడానికి రెండు నెలల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు అంబటి. టీటీడీ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న వ్యాఖ్యలు.. ఇప్పటి వరకు కూడా చంద్రబాబు చేసిన ఆరోపణలే తప్ప.. అందుకు సరైన సాక్ష్యాధారాలు లేవని, ఎవరూ ప్రకటించలేదని గుర్తు చేశారు. నిజంగానే నెయ్యిలో అంతటిస్థాయిలో కల్తీ జరిగి ఉంటే.. వెంటనే దీనిపై సమగ్ర విచారణ చేపట్టి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా తన రాజకీయ మైలేజీ కోసం చంద్రబాబు.. టీటీడీ, కోట్లాది మంది భక్తులు, శ్రీవేంకటేశ్వరుడిని కూడా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం ఉంటే.. వాటిని తీవ్రంగా ఖండించిన తమ పార్టీ.. కుటుంబ సమేతంగా స్వామివారి చెంత ప్రమాణం చేయడానికి సిద్ధమని చేసిన సవాల్‌ను ఎందుకు స్వీకరించలేదు? అని ప్రశ్నించారు.
వైసీపీ ఆఫీసుపై దాడి హేయం..
ఈ వివాదానికి సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఆఫీసుపై బీజేపీ యువ మోర్చ కార్యకతర్తలు దాడిని హేయమైన చర్యగా అభివర్ణించారు అంబటి. ఇటువంటి వాటిని ఆ ఏడుకొండలవాడు కూడా సహించరన్నారు. ‘‘పురందేశ్వరి.. ఏందమ్మా ఇది? వైఎస్ జగన్ ఇంటిపైనా ఏవేవో విసిరి ఆనందపడాలని అనుకుంటున్నారా? విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయనున్నారన్న బాధతో ప్రజలు, కార్మికులు తిరుగుబాటు చేసే పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగుల జీతాలు కట్ చేశారు.. ఒక పార్ట్ అమ్మేశారు.. అక్కడ రగిలిపోతుంది. ముందు దానిపై దృష్టి పెట్టండి’’ అని సూచించారు.