నన్ను ఆపొద్దు, పవన్ దగ్గరికెళ్తా! జగన్ పై బాంబు పేల్చిన ఎంపీ బాలశౌరి
ఏపీ సీఎం జగన్ కి ఆయన అత్యంత సన్నిహితుడు. గత ఎన్నికల్లో పిలిచి సీటిచ్చారు. బందరులో గెలిచారు. అక్కడేమో పేర్ని నానీ, జోగి రమేశ్ ఆయన్ను పొమ్మనలేక పొగబెట్టారట..
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడైన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి షాక్ ఇచ్చారు. ఇప్పటికే కర్నూలు ఎంపి సంజీవ్ కుమార్ రాజీనామా చేయగా తాజాగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రిజైన్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన బాలశౌరి రాజీనామా చేయడం కలకలం సృష్టించింది. నియోజకవర్గాల ఇంచార్జులు, అభ్యర్థుల మార్పులతో సిట్టింగులు వైసీపీకి వరుస షాకులిస్తున్నారు. ఇప్పుడా జాబితాలోకి బాలశౌరి చేరారు. సంక్రాంతి తర్వాత మరికొందరు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు.
పారిశ్రామిక వేతగా ఎదిగిన బాలశౌరి..
పారిశ్రామిక వేత్త, కన్వర్టెడ్ క్రిస్టియన్ అయిన బాలశౌరి కొద్దిరోజులుగా మచిలీపట్నం, పెడన శాసనసభ్యులు పేర్ని నానీ, జోగి రమేశ్ తీరుతో మనస్థాపానికి గురై వైసీపీకి దూరంగా ఉంటున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి చెప్పినా పట్టించుకోవడం లేదన్న ఆవేదనను తన అనుచరుల దగ్గర వ్యక్తంచేశారు. దీంతో బాలశౌరి.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
గుంటూరు జిల్లాలో పుట్టి బందరులో గెలిచి...
గుంటూరు జిల్లా మోర్జంపాడులో పుట్టి పెరిగిన 55 ఏళ్ల బాలశౌరి ఓసారి తెనాలి నుంచి మరోసారి మచిలీపట్నం నుంచి గెలుపొందారు. వైసీపీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని తన సహాచరులతో చెప్పుకుంటూ వచ్చిన బాలశౌరి ఆ పార్టీకి రాజీనామా చేయడం కోనసీమ జిల్లాల్లో సంచలనంగా మారింది. మచిలీపట్నం స్థానం నుంచి మరో వ్యక్తిని బరిలోకి దింపడానికి వైసీపీ హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు ముందుగానే తెలుసుకున్న బాలశౌరి.. వైసీపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడక ముందే రాజీనామా చేశారు.
పేర్ని నానీతో పడకనే రాజీనామా...
మచిలీపట్నం నియోజకవర్గంలో మాజీ మంత్రి పేర్ని నానికి, ఎంపీ బాలశౌరికి మధ్య కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు.
జగన్ కి రాజీనామా లేఖ పంపిన బాలశౌరి...
వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత బాలశౌరి రెండ్రోజుల్లో జనసేనలో చేరనున్నారు. సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) ఈ విషయాన్ని పేర్కొన్నారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపినట్టు ఎంపీ బాలశౌరి తెలిపారు. గుంటూరులో ఉన్న బాలశౌరిని జనసేన నేతలు గాదె వెంకటేశ్వరరావు, బోనబోయిన శ్రీనివాస్ కలిశారు. పార్టీలో చేరికపై చర్చించారు. రాజీనామా విషయం తెలుసుకున్న ఎంపీ అభిమానులు, కార్యకర్తలు గుంటూరులోని ఆయన నివాసానికి తరలివచ్చారు.
అగ్నికి ఆజ్యం పోసిన జోగి రమేశ్?
ఎంపీ బాలశౌరికి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేశ్ కి మధ్య విభేదాలున్నాయి. ఆ రెండు నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం జరిగినా ఎంపీని దూరం పెడుతున్నారు. గతంలో మచిలీపట్నం పర్యటన సందర్భంగా ఎంపీని.. పేర్ని నాని వర్గీయులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ క్రమంలో పేర్ని నానిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ పేర్ని నాని.. బందరు నీ అడ్డా కాదు. నీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. నన్ను మచిలీపట్నం రానీయకుండా చేస్తున్నారు. ఇకపై బందరులోనే ఉంటా.. కార్యక్రమాల్లో పాల్గొంటా. ఎవరేం చేస్తారో చూస్తా. ఎంపీ అంటే ఏమిటో చూపిస్తా’’ అని బాలశౌరి బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో పేర్ని నాని కుమారుడు కిట్టు ఓటమికి బాహాటంగానే పని చేస్తారేమో చూడాలి.
పేర్ని నాని మంత్రి పదవి పోవడానికి బాలశౌరి కారణమా?
పేర్ని నానిని మంత్రివర్గం నుంచి తొలగించడానికి బాలశౌరి కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది. అలాగే మంత్రి జోగి రమేష్, బాలశౌరికి మధ్య వర్గపోరు నడుస్తోంది. దీంతో ఆయన పెడన నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. అవనిగడ్డ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ ఎదుటే ఆయన ముఖ్య అనుచరుడిపై స్థానిక ఎమ్మెల్యే,వైసీపీ శ్రేణులు దాడికి దిగారు. దీనికి తోడు అధిష్టానం మద్దతు కూడా బాలశౌరికి లభించకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పు నేపథ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
బాలశౌరి జగన్ కి మంచి మిత్రుడే, ఏం జరిగిందో?
తాజాగా.. ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఆయన కొనసాగుతున్నారు. సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ఈయన అత్యంత ఆప్తుడు. సడన్‌గా ఎంపీ రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది. మచిలీపట్నం నుంచి ఎంపీగా వేరొక వ్యక్తిని బరిలోకి దింపడానికి హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు ముందుగానే తెలుసుకున్న బాలశౌరి.. ఇలా రాజీనామా చేశారనే టాక్ నడుస్తోంది. అయితే.. బాలశౌరి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని భావిస్తున్నారని అందుకే రాజీనామా చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. మచిలీపట్నం నుంచి ఎంపీగా పేర్ని నానిని బరిలోకి దింపాలని.. బాలశౌరికి పొమ్మన లేక హైకమాండే పొగబెట్టిందనే వార్తలూ వినిపిస్తున్నాయి.