ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్..
x

ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్..

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిజంగానే బీజేపీలో చేరనున్నారా? ఇంతలో ఆయనను హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు? బీజేపీలో చేరికపై మిథున్ రెడ్డి ఏమంటున్నారు?


‘వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అతి త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే ఆయన సహా ఇతర వైసీపీ ఎంపీలు కూడా బీజేపీ చర్చల్లో ఉన్నారు’ అని ఇటీవల ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత ఆదినారాయణ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మిథున్ రెడ్డి తన తండ్రి పెద్దిరెడ్డిని కూడా బీజేపీలో చేరడానికి ఒప్పించారని కూడా ఆదినారాయణ అన్నారు. దీంతో అప్పటి నుంచి బీజేపీ బాట పట్టిన మిథున్ రెడ్డి అంటూ భారీగా ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగానే ఈరోజు పోలీసులు మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం కాస్తంత ఆశ్చర్యకరంగా ఉంది. తనను నిర్బంధించడంపై మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ ప్రతీకార రాజకీయాలకు తెరలేపుతోందని, కేవలం ప్రత్యర్థులన్న కారణంగా వైసీపీ నేతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు.

అప్పటి నుంచి మొదలు

ఎన్నికల్లో గెలిచామని తెలిసిన మరుక్షణం నుంచే టీడీపీ తన అరాచక పాలన మొదలు పెట్టిందని మిథున్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు, ఇళ్లు కూలుస్తున్నారు, లేనిపోని కేసులు పెడుతున్నారు అని మండిపడ్డారు. ఆఖరికి తమ వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న తనను అకారణంగా పోలీసులు అడ్డుకున్నారని, టీడీపీ ఒత్తిడి కారణంగానే పోలీసులు ప్రైవేటు ఆర్మీలా మారారంటూ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అడ్డుకోవడం ద్వారా ఎంపీగా తనకు ఉన్న అర్హతను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని, దీనిపై తాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. ‘‘గత ఎన్నికల్లో 40 శాతం మంది ఓటర్లు వైసీపీకే ఓటు వేశారు. ఇప్పుడు వారందరిపై కూడా దాడులు చేస్తారా. ఇప్పటికే వైసీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటాం’’ అని భరోసా ఇచ్చారు మిథున్ రెడ్డి. పోలీసులు ఒక్కసారిగా వచ్చి తనను హౌస్ అరెస్ట్ చేస్తున్నామని, వారు ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదంటూ నోటీసు ఇచ్చారని, పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చే ఇలా చేయిస్తున్నారని, దీని వెనక టీడీపీ హస్తం ఉందని ఆయన మండిపడ్డారు.

అవన్నీ బుద్ధిలేని ప్రచారాలే

తాను బీజేపీలో చేరనున్నానంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, అదంతా బుద్ధిలేని అసత్య ప్రచారాలే అంటూ కొట్టిపారేశారు మిథున్ రెడ్డి. ‘‘చల్లా బాబును ఎప్పటి నుంచో చూస్తున్నా. ఆయన ఎప్పుడూ ఇలాంటివి చేయలేదు. ఇదంతా చంద్రబాబు ట్రాప్ అని తెలుస్తోంది. అందులో పడొద్దని చల్లా బాబుకు సలహా ఇస్తున్నా. పోలీసులపై దాడి చేసి చల్లా బాబు జైలుకు వెళ్లారు. నేను అరెస్ట్ కైనా ప్రాణ త్యాగానికైనా సిద్ధం. పదవిని కాపాడుకోవడానికి రాంప్రసాద్ కూడా మాపై ఎన్నో విమర్శలు చేశారు’’ అని మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా తమ పోరాటం ఆగదని, ప్రజల సమస్యలపై తాము పోరాడుతూనే ఉంటామని, అధికారం తమకు అవకాశం లాంటిదే తప్ప.. అధికారమే అంతాకాదని మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Read More
Next Story