ఏపీలో ఇలా... ఢిల్లీలో అలా...
x

ఏపీలో ఇలా... ఢిల్లీలో అలా...

రాష్ట్రంలో బద్ద శత్రువులుగా సాగే వైసీపీ, టీడీపీలు ఢిల్లీలో మాత్రం ఒకరికే మద్దతు ఇస్తున్నారు. వీళ్ల మధ్యది నిజమైన శత్రుత్వమా లేకుండా డ్రామానేనా..


వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేలా ఉంది రాష్ట్రంలో పరిస్థితి. ఇండియ, పాకిస్థాన్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోని ఉన్న ప్రత్యర్థులు, బద్దశత్రువులు వీరే అన్న విధంగా ఇరు పార్టీ మధ్య వ్యవహార శైలి కూడా ఉంది. అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ అనే సందర్భాల్లో టీడీపీపై విచ్చలవిడిగా మాట్లాడింది. అడ్డు ఆపు లేకుండా నోటికొచ్చినట్లు విమర్శలు, ఆరోపణలు చేసింది. మాజీ సీఎం అన్న గౌరవం ఇవ్వకుండా చంద్రబాబును.. వాడు, వీడు అన్న వైసీపీ నేతలు కూడా ఉన్నారు. తీరా ఈ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ కూడా ప్రస్తుతం వైసీపీకి అలాంటి ట్రీట్‌మెంటే ఇస్తుంది. టీడీపీ వాళ్లు కూడా ఒక మోస్తరు అగౌరవ వాచకాలే వినియోగించి వైసీపీ నేతలను తిడుతున్నారు. కానీ ఈ రెండు పార్టీలు ఢిల్లీలో మాత్రం దోస్త్ మేరే దోస్త్ అన్నట్లు ఉంటున్నాయి. అందుకు ఇటీవల జరిగిన లోక్‌సభ అధ్యక్ష పదవి ఎన్నికలే నిదర్శనం.

రాష్ట్రంలో ఇలా

రాష్ట్రం లోపల రెండు పార్టీలకు ఒకరంటే ఒకరు అస్సలు పడదు. ఆఖరికి పార్టీ కార్యకర్తలు కూడా ఎదురుపడితే ఎక్కడ కొట్టుకుంటారో, చంపుకుంటారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇది ఈ ఎన్నికల సమయంలో అందరికీ కళ్ళకు కట్టినట్లు కనిపించింది. పోలింగ్ రోజు మొదలుకుని నేటికి కూడా ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ఒక పార్టీ కార్యకర్తలు మరో పార్టీ కార్యకర్తపై అమానవీయంగా దాడులు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా పార్టీ శ్రేణులకు పట్టలేదు. బ్యాట్లు, రాడ్లు, కొడవళ్లు, గొడ్డళ్లు పట్టుకుని రోడ్లమ్మటి తిరిగిన ఎన్నో వీడియోలు బహిర్గతం అయ్యాయి. అదే విధంగా ఆఖరికి పార్టీల నేతలు కూడా పోలింగ్ రోజులు పలు కేంద్రాల దగ్గర ఎదురెదురు పడితే శత్రువులను చూసుకున్నట్లే చూసుకున్నారు. పోలీసులు అడ్డుపడినా ఎవరూ వెనక్కి తగ్గింది లేదు. కానీ ఈ పార్టీల నేతల వ్యవహార శైలి ఢిల్లీ వెళ్తే చాలు ఇట్టే చిటికెలో మారిపోతుంది.

ఢిల్లీలో ఇలా

రాష్ట్రంలో ఒకరిపై ఒకరికి చంపుకోవాలన్నంత కోపం ఉన్నట్లు ఉండే ఈ పార్టీల నేతలు ఢిల్లీలో మాత్రం వేరేలా ఉంటారు. ఇద్దరూ కలిసి ఒకే పార్టీకి జైజైలు కొడతారు. అందుకు లోక్‌సభ స్పీకర్ పదవి ఎన్నిక నిలువెత్తు నిదర్శనం. సభలో తాము బలంగానే ఉన్నామన్న ప్రతిపక్ష ఇండియా కూటమి.. ఓం బిర్లాను ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఆమోదించడానికి అంగీకరించలేదు. తమ తరపున ఓ నేతను నెలబెడుతున్నామంటూ స్పీకర్ పదవికి సురేష్ చేత నామినేషన్ దాఖలు చేసింది. దాంతో సభలో ప్రోటెం స్పీకర్ ఈ ఎన్నికలను నిర్వహించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ.. ఎన్‌డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు ఓటు వేసిందంటే కూటమిలో ఉంది కదా అనుకోవచ్చు. కానీ వైసీపీ కూడా ఓం బిర్లాకే ఓటు వేయడం ఒంకింత ఆశ్చర్యకరమే. రాష్ట్రంలో ఏ కూటమినైతే ఎదిరించి, విమర్శించిందో ఢిల్లీలో మాత్రం అదే కూటమి అభ్యర్థికి పట్టం కట్టడంలో తన వంత సహాయం అందించింది. దీంతో ఇదేందయ్యా ఇది అంటూ విమర్శకులు అవాక్కవుతున్నారు.

ఇదంతా నాటకమే!

వైసీపీ, టీడీపీ నేతలు ఢిల్లీలో ఒకే పార్టీ అభ్యర్థికి జైజైలు కొట్టడంతో అనేక మంది రాజకీయ మునులు వెలుగు చూశారు. ‘ఈ రాజకీయాలంటే ఇంతే తమ్ముడు.. మన ముందు నువ్వెంత నీ బతుకెంత అంటారు. తీరా అంతా అయ్యాక మనమంతా భాయ్ భాయ్ అంటారు. ఎవరు అధికారంలోకి వచ్చిన చేసేది ఒకటేగా దోచుకోవడం. వాళ్ళు మారాలంటే ముందు మారాల్సింది ప్రజలు’ అంటూ జ్ఞాన బోధ చేయడం ప్రారంభించేశారు. మరికొందరైతే వైసీపీని ఘాటుగా ఆశీర్వదిస్తున్నారు.

ఎవరు గెలిచినా బీజేపీకే లాభం

ఎన్నికల సమయంలో రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలో ఏ పార్టీ గెలిచినా బీజేపీ జరిగే నష్టం ఏమీ లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అన్నారు. అప్పట్లో వారికి పలువురు తిట్టిపోశారు. కానీ ఈరోజున ఢిల్లీలో పరిస్థితి చూస్తుంటే అది నిజమనే అనిపిస్తుంది. టీడీపీ గెలిచినా, వైసీపీ గెలిచినా.. రెండు పార్టీలు ఢిల్లీలో మాత్రం తప్పకుండా ఎన్‌డీఏకే మద్దతు ఇస్తాయి. అందుకు ప్రధాన కారణం ఆ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్‌ను ఎదిరించడానికో, ఎదిరించో పుట్టినవే. అప్పట్లో రాజకీయాల్లో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని అంతమొందిచడానికి ఎన్‌టీఆర్.. టీడీపీని స్థాపించారు. ఆ తర్వాత 2011లో కాంగ్రెస్‌ను ఎదిరించి జగన్ అధ్యక్షతన వైసీపీ పార్టీని స్థాపించారు. దీంతో ఈ రెండు పార్టీల్లో ఏది గెలిచినా ఎన్‌డీఏకే లాభం చేకూరనుందని అర్థమైంది. దానిని స్పీకర్ పదవి ఎన్నిక ఋజువు చేసింది.

Read More
Next Story