వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి బీజేపీలో చేరేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ కంటే జాతీయ పార్టీలే బెటరనుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి రోజురోజుకూ అసమ్మతి వాదులు ఎక్కువవుతున్నారు. సొంతపార్టీ నుంచే అసమ్మతి రావడం గమనించాల్సిన అంశం. ఇవేమీ పార్టీ పట్టించుకోవడం లేదు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుకున్నది చేసుకుపోతున్నారు. నెల్లూరు పార్లమెంట్ స్థానానికి సమన్వయకర్తగా నియమించిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మనసు నొచ్చుకున్నారు. మొదటి నుంచీ సెన్సిటివ్ మనస్తత్వం ఉన్న వేమిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల్లూరు పార్లమెంట్ విషయంలో తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ అధిష్టానం దృష్టికి ఈ అంశం తీసుకపోయినా పట్టీపట్టనట్లు ఉన్నారు. దీంతో ఆయన వైఎస్సార్‌సీపీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు.
బీజేపీలోనే ఎందుకు చేరాలనుకున్నారు
ప్రాంతీయ పార్టీల తీరు ఆయనకు నచ్చలేదు. పైగా తనను నెల్లూరు పార్లమెంట్‌కు అభ్యర్థిగా ప్రకటించి తనకు తెలియకుండానే కొన్ని నిర్ణయాలు వైఎస్సార్‌సీపీ వారు తీసుకుంటున్నారు. నేను పార్టీ జిల్లా అధ్యక్షుడిని, కనీసం ఎవరిని ఏ నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటిస్తున్నారో నాకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీలో అవేమీ ఉండవు. సీఎం చెప్పిందే వేదం. ఎవరికి ఏమీ తెలియాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు నా అవసరం వారికి ఏముంటుంది. అందుకే నేను పార్టీ నుంచి బయటకు వెళ్లాలనుకుంటున్నాను. అని ఆయన సన్నిహితుల వద్ద చెప్పారు. జాతీయ పార్టీలు అయితే కనీసం మనం ఏమనుకుంటున్నామనే అభిప్రాయాన్నైనా తీసుకుంటారు. అందుకే ఆపార్టీలో చేరుదామని మీకందరికీ చెబుతున్నానని పార్టీలోని ఆయన వర్గానికి చెప్పారని వేమిరెడ్డి సన్నిహితులు తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో జీవం రావాలంటే ఇంకా టైం పడుతుంది. అందుకే బీజేపీలో చేరడం మంచిదని ఆయన భావిస్తున్నారు.
టీడీపీ పొత్తులో ఎంపీగా పోటీ
బీజేపీలో చేరి టీడీపీ పొత్తులో బీజేపీ నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తాననే నమ్మకం ఉందని స్నేహితుల వద్ద చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి మంచి పేరు ఉంది. పొలికల్ పార్టీని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాలనే ఆలోచన ఆయనకు లేకపోవడంతో ప్రజలు కూడా ఆయనను ఆదరిస్తున్నారు. ప్రజాధరణ ఉన్నందున ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం మంచిదేననే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
పార్టీకి దూరంగా వేమిరెడ్డి వర్గం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ అధిష్టానం కనీస గౌరవం మనకు ఇవ్వడం లేదు కాబట్టి పార్టీకి దూరంగా ఉండాలని, ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొన వద్దని పార్టీ క్యాడర్‌ను ఆయన హెచ్చరించారు. ఆయన సూచన మేరకు వేమిరెడ్డి వర్గం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను నర్సరావుపేట నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన కూడా పార్టీ కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో నిర్వహించడం లేదు. ఇరు వర్గాల వారు పార్టీకి దూరం కావడంతో కార్యక్రమాలు స్తబ్దుగా ఉన్నాయి.
దక్షిణాఫ్రికా నుంచి రాగానే నిర్ణయం
వ్యాపార పనుల నిమిత్తం ఈనెల 9న ఆయన దక్షిణాఫ్రికాకు వెళ్లారు. అక్కడ మైన్స్ బిజినెస్ ఉన్నందున వ్యాపార లావాదేవీలు చూసుకునేందుకు వెళ్లారు. ఎప్పుడు వస్తారనేది ఇంకా నిర్ణయం కాలేదు. ముందుగా అనుకున్న ప్రకారం షెడ్యూల్ ఉండటంతో ఢిల్లీలో ముఖ్యమంత్రిని కలిసే అవకావం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి అడిగినా నేను ఉండటంలేదని, ఫారిన్ వెళుతున్నందున వచ్చిన తరువాత కలుస్తానని చెప్పినట్లు ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలను వైఎస్‌ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా కమిటీ ఖండించింది. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఫిక్స్‌డ్ షెడ్యూల్ కావడంతో విదేశానికి వెళ్లారు.
కనీస గౌరవం లేకుండా ఎందుకుండాలి?
పార్టీలో కనీస గౌరవం లేదు. ఏమి చేస్తున్నారో తెలియదు. నన్ను నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని సీఎం అడినప్పుడు మూడు నియోజకవర్గాలకు నేను చెప్పిన వారిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా పెట్టాలని కోరాను. అందుకు సీఎం అంగీకరించారు. అనుకున్నట్లుగానే నెల్లూరు టౌన్ నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్‌ను నర్సరావుపేట ఎంపీగా పంపించారు. అయితే నెల్లూరు టౌన్‌కు ఎవరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తున్నారో ఒక్క మాట కూడా చెప్పకుండా అనిల్ అనుచరులకే అవకాశం కల్పించారు. అటువంటప్పుడు మనమెందుకు పార్టీలో ఉండాలి. మన అవసరం పార్టీకి లేదని తేలిపోయిందని సన్నిహితుల వద్ద చాలా బాధపడుతూ చెప్పినట్లు వివ్వసనీయ సమాచారం. సున్నిత మనస్సు ఉన్న వారికి ఈ ప్రాంతీయ పార్టీ రాజకీయాలు అసలు పనికి రావనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. కొందరు మీడియా వారికి కూడా ఇవే మాటలు ఆఫ్‌ది రికార్డు కింద చెప్పారు.
Next Story