టెక్కలి శీను మారింది.. కుటుంబ కలహాలే కారణం
x

టెక్కలి 'శీను' మారింది.. కుటుంబ కలహాలే కారణం

ఎమ్మెల్సీ దువ్వాడకు ఎట్టకేలకు ఉద్వాసన. చేతులు కాలాక వైసీపీ ఆకులు పట్టుకుంది.


(బొల్లం కోటేశ్వరరావు- విశాఖపట్నం)

దువ్వాడ శ్రీనివాస్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిచయమూ అక్కర్లేదు. ఎందుకంటే రాజకీయాల్లోకంటే ఇంటి పోరుతోనే ఆయన ఫేమస్ అయ్యారు మరి. కొన్నాళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా దువ్వాడ, ఆయన ఫ్యామిలీ పేరు, తీరు మారుమోగిపోతోంది. పాలిటిక్స్లోనే కాదు.. మీడియాకు మంచి ఎంటర్టైన్మెంట్ అయింది. తెల్లారి లేచింది మొదలు టీవీల్లో చర్చలు, వార్తలు, మధ్యమధ్యలో ట్విస్టులతో రోజూ సీరియల్ను తలపించేలా రసవత్తరంగా సాగుతూ వచ్చింది. అంతేనా.. సొంత వైసీపీ పార్టీలోనూ ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. రెండు మూడేళ్ల నుంచి అంతర్గతంగా జరుగుతున్న కుటుంబ విభేదాలు సార్వత్రిక ఎన్నికల సమాయానికి తారాస్థాయికి చేరుకున్నాయి. తన భర్త శ్రీనివాస్కు టెక్కలి టిక్కెట్టు ఇస్తే ఆయనపై తానే ఇండిపెండెంటుగా పోటీ చేస్తానని సతీమణి వాణి బహిరంగంగా ప్రకటించడంతో వీరిద్దరి ఉన్న మనస్ఫర్థలు ముదిరి పాకాన పడ్డాయని బయట ప్రపంచానికి తేటతెల్లమయ్యాయి. ఎన్నికల సమయం కావడంతో అప్పట్నుంచి వైసీపీ నేతలు రంగంలోకి దిగి రాయబారాలు, బుజ్జగింపులు వంటివి చేసి దువ్వాడ దంపతుల మధ్య సయోధ్య కుదర్చడానికి విఫల యత్నం చేశారు. అప్పటి సీఎంవోలోనూ పంచాయతీ పెట్టారని చెబుతారు. ఎట్టకేలకు వాణిని పోటీ నుంచి తప్పుకోవడానికి ఒప్పించారు తప్ప మిగతా

గొడవలు మాత్రం చల్లార్చలేకపోయారు. ఎన్నికల్లో దువ్వాడ పోటీ చేయడం, అచ్చెన్నాయుడిపై ఓడిపోవడం జరిగిపోయాయి. ఎన్నికల తర్వాత దువ్వాడ కుటుంబంలో సిగపట్లు తీవ్ర రూపం దాల్చాయి. తన భర్త శ్రీనివాస్ మరొక మహిళతో సన్నిహితంగా ఉంటున్నారని, తమను నిర్లక్ష్యం చేస్తున్నారని వాణి, ఆమె పిల్లలు బాహాటంగా ఆరోపణలు గుప్పించారు. దీంతో ఇంటి రచ్చ కాస్తా వీధి రచ్చగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని టీవీ ఛానళ్లు ఇదే అదనుగా రంగ ప్రవేశం చేసి రోజుల తరబడి ఇరువర్గాలను తెరపైకి తెచ్చాయి. దువ్వాడతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉండే మహిళతోను రోజులు, వారాల తరబడి అదే పనిగా వారి వివాదాన్ని కొనసాగించాయి. మరోపక్క సోషల్ మీడియా కూడా దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ను మరింత రక్తి కట్టించి హాట్ టాపిక్ గా మార్చాయి.

ఈ పరిణామాలు దువ్వాడకంటే పార్టీకే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నాయని వైసీపీ నేతలు తలలు పట్టుకున్నారు. పార్టీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడను దూరం పెట్టాలని, లేదంటే పార్టీకి జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ నష్టం జరుగుతుందని వైసీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. అయితే కుటుంబ వ్యవహారం కావడంతో ఆ పార్టీ పెద్దలు దువ్వాడ ఫ్యామిలీ రగడను సీరియస్ గా తీసుకోలేదు. ఇంతలో దువ్వాడతో సన్నిహితంగా ఉండే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనతో వీరి వివాదం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇంత జరుగుతున్నా వైసీపీ అధిష్టానం మౌనం దాల్చడంపై విమర్శలు పెల్లుబికాయి. దీంతో టెక్కలి నియోజకవర్గానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న దువ్వాడ శ్రీనివాస్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో శ్రీకాకుళం లోక్సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాడ తిలకన్ను నియమించారు. ఇన్నాళ్లూ తామెంత మొత్తుకున్నా పట్టించుకోలేదని, పార్టీకి నష్టం వాటిల్లాక ఆలస్యంగా దువ్వాడను ఇన్చార్జి బాధ్యతల నుంచి ఉద్వాసన పలికారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. తమ పార్టీ పెద్దల వైఖరి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని గుసగులాడుతున్నాయి.

Read More
Next Story