![మన్మోహన్ జీ, మీరు లేరు, మీ హామీలు మాత్రం మిగిలే ఉన్నాయి! మన్మోహన్ జీ, మీరు లేరు, మీ హామీలు మాత్రం మిగిలే ఉన్నాయి!](https://telangana.thefederal.com/h-upload/2024/12/27/501630-untitled-design.webp)
మన్మోహన్ జీ, మీరు లేరు, మీ హామీలు మాత్రం మిగిలే ఉన్నాయి!
2014 ఫిబ్రవరి 18న లోక్ సభ, 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభ రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించాయి. రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదించే సమయంలో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలైంది. 2014 ఫిబ్రవరి 18న లోక్ సభ, 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభ రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించాయి. రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదించే సమయంలో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్. ఈ సమయంలో విభజిత ఆంధ్రప్రదేశ్ కి ఆయన ఆరు ప్రధాన వాగ్దానాలు చేశారు. ఇప్పటికి పదేళ్లు దాటి పోయింది. వాటిలో ఏ ఒక్కటీ ఈ దశాబ్ద కాలంలో అమలుకు నోచుకోలేదు. సరిగ్గా ఇదే సమయంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా డిసెంబర్ 26న ఢిల్లీలో చనిపోయారు. ప్రధానమంత్రి హోదాలో పార్లమెంటులో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ అమలు కాకపోయినా కుములుతున్నహృదయాలతో ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.
మన్మోహన్ సింగ్ ఏపీకి ఇచ్చిన హామీలేమిటంటే...
15వ లోక్ సభ గడువు ముగిసిపోతున్న ఆఖరి రోజుల్లో హడావుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పూర్తి అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం పార్లమెంటులో పాస్ అవుతున్న సమయంలో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆయన సమక్షంలో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆధ్వర్యంలో, బిజెపి ప్రత్యక్ష పర్యవేక్షణ, మద్దతుతో ఈ బిల్లు పాస్ అయింది.
రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తెలుసుకోవడానికి రాష్ట్రపతికి అవకాశం కల్పించారు తప్ప ఆ అభిప్రాయం ఎందుకు తెలుసుకోవాలో ఆర్టికల్- 3లో స్పష్టత లేదు. అందువల్ల అసెంబ్లీ అభిప్రాయం ఎలా ఉన్నా రాష్ట్రపతి ఆ బిల్లును పార్లమెంటుకు పంపించేయాల్సిందే అన్నారు అప్పటి కాంగ్రెస్, బిజెపి నాయకులు. అద్వానీ లాంటి సీనియర్లు 'ఇది తప్పు, ఇలా చేయకండి' అని పైకి గట్టిగా చెప్పలేక లోలోన మింగలేక ఆశ్వద్ధామ అతహా అన్నట్టుగా మెలిగారు. విభజన చట్టం పాస్ అయిపోయింది.
సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు మాకు ఈ విభజనతో సంబంధం లేదని చెప్తూనే ఉన్నా బిల్లు ఆగమేఘాల మీద రెడీ అయింది. అందులో కొన్ని అంశాలు చేర్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని ప్రయోజనాలు చేకూర్చే ప్రయత్నం జరిగింది.
దీనికి అదనంగా ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆనాడు రాజ్యసభలో కొన్ని వాగ్దానాలు చేశారు. వాటిలో ప్రధానమైనవి ఓ సారి మననం చేసుకోవడం కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ కి ఆంధ్రప్రజలు అర్పించే నివాళే.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆవేళ ఆంధ్ర ప్రదేశ్ ఇచ్చిన ఆరు వాగ్దానాలలో 1. కేంద్ర సహాయం కోసం 4 రాయలసీమ జిల్లాలు 3 ఉత్తరాంధ్ర జిల్లాలతో సహా 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కి ఐదేళ్లపాటు స్పెషల్ కేటగిరి స్టేటస్ ఇస్తుంది. ఇది రాష్ట్ర ఆర్థిక స్థితిని స్థిరపరుస్తుంది.
2. ఉభయ రాష్ట్రాల్లోనూ పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం పన్ను ప్రోత్సాహకాలతో సహా తగిన ఆర్థిక చర్యలను తీసుకోవాలని బిల్లు నిర్దేశిస్తున్నది. ఈ ప్రోత్సాహకాలు కొన్ని ఇతర రాష్ట్రాలకు ఇస్తున్న పద్ధతిలోనే ఉంటాయి.
3. తెలంగాణ పోగా మిగిలిన అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీకి బిల్లు అవకాశం కల్పించింది. ఈ ప్యాకేజీ ఎలా ఉంటుందంటే.. ఒడిషాలోని కోరాపూట్, బోలంగీర్, కలహండి ప్రత్యేక పథకం మాదిరిగా, మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రత్యేక ప్యాకేజీ నమూనాలోనూ ఉంటుంది.
4. పోలవరం ప్రాజెక్టు కోసం పూర్తిస్థాయి రిహాబిలిటేషన్ వంటి ఇబ్బందులు లేకుండా జరగడానికి అవసరమైన మరిన్ని సవరణలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు గౌరవనీయ సభ్యులకు నేను హామీ ఇస్తున్నాను. వాటిని సాధ్యమైనంత త్వరగా అమలుపరుస్తాం. మా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తుంది. ఇది నిస్సందేహం.
5. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు అపాయింటెడ్ తేదీని, సిబ్బంది, ఆర్థిక స్థితి, ఆస్తులు, అప్పుల పంపకాలు సంతృప్తికరంగా పూర్తిచేయడానికి అవసరమైన ముందస్తు ఏర్పాట్లకు అనుగుణంగా నిర్ణయించడం జరుగుతుంది.
6. మొదటి సంవత్సరంలో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలత్తే రిసోర్స్ గ్యాప్ ను ముఖ్యంగా అప్పాయింటెండ్ తేదీకి, 14వ ఆర్థిక సంఘ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అంగీకరించే తేదీకి మధ్యకాలంలో ఏర్పడే ఈ గ్యాప్ ను 2014- 2015 రెగ్యులర్ యూనియన్ బడ్జెట్లో పూరించడం జరుగుతుంది.
మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన ఈ 6 కమిట్మెంట్స్ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఆఖరి మంత్రివర్గ సమావేశం 2014 మార్చి 1న జరిగింది. మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశం అది. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన వాగ్దానాలను క్యాబినెట్ ఆమోదించింది.
ఐదేళ్లు ప్రత్యేక హోదా, పోలవరం ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్ కి బదిలీ వంటి అంశాలపై వెంటనే ఆర్డినెన్స్ విడుదల చేయాలని రాష్ట్రపతిని కోరుతూ క్యాబినెట్ నోట్ పంపింది. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత అంటే 2014 మార్చి 5న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఆర్డినెన్స్ జారీ కాలేదు.
2014 జూన్ లో బీజేపీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఆర్డినెన్స్ నుంచి ప్రత్యేక హోదా అనే అంశాన్ని తొలగించి పోలవరం ముంపు మండలాల బదలాయింపు అంశం మాత్రమే ఉంచారు. అదే ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి సంతకం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అతిపెద్ద అన్యాయాలలో ఒకటి. అదే స్పెషల్ కేటగిరి స్టేటస్.
2014లో బీజేపీ, టీడీపీ అధికారంలోకి రావడానికి బాగా ఉపయోగపడిన అంశాలలో ప్రత్యేక హోదా ఒకటి. అధికారంలోకి వచ్చాక వాళ్లే రాష్ట్రపతి ఇచ్చిన ఆర్డినెన్స్ లో ఆ పదమే లేకుండా చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో స్పెషల్ స్టేటస్ అంశాన్ని 'మేమే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో చెప్పి ప్రకటింపజేశామని' బిజెపి వారు ప్రత్యేకించి వెంకయ్య నాయుడు పదేపదే చెప్పారు. ఎన్నికల ప్రచార సమయంలోను గొప్పగా చెప్పుకున్నారు. కానీ గత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా మాటే ఎత్తలేదు. మన్మోహన్ సింగ్ ఐదేళ్లు ఇస్తామని ప్రకటిస్తే బీజేపీ వాళ్లు 10 ఏళ్లు ఇస్తామన్నారు. మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. చివరకు స్పెషల్ కేటగిరి స్టేటస్ అనేది అసలు లేనేలేదని తేల్చి పచ్చిగా ఆంధ్రప్రదేశ్ ను వంచించారు.
రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు వచ్చినపుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా తాను హామీ ఇచ్చిన మాట నిజమేనని, దానికి కట్టుబడి ఉండాలని చెప్పినా వినిపించుకున్న వారు లేకపోయారు. ప్రధానమంత్రి హోదాలో పార్లమెంటులో చెప్పిన విషయాలకు ప్రవిత్రత ఉంటుందని కూడా చెప్పారు. అయినా ఏ ఫలితమూ లేకపోయింది. ఇప్పుడు ఆయన కూడా లేరు. ఇక ఆ ప్రస్తావన కూడా రాదు. వచ్చినా ఖాతరు చేసేవారు ఎవరూ ఉండరు. ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసే ఉద్దేశం లేదని, ఎంతో దూరదృష్టితో ప్రత్యేక హోదా ప్రకటిస్తున్నామని నాడు రాజ్యసభలో డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన బాస నెరవేరకుండానే ఆయన కాలం చేయడం ఏపీ ప్రజల పాలిట విషాదమే. ఆయన లేకపోయినా ఆయన చెప్పిన 6 అంశాలు మాత్రం మిగిలే ఉన్నాయి.
Next Story