భవిష్యత్‌లో విజ్ఞాన వంతులైన యువత అవసరం చాలా ఉంది. హ్యూమన్‌ రిసోర్స్‌ లేకుంటే ఎంత టెక్నాలజీ ఉన్నా ఉపయోగం లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తోంది.


ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నియంత్రణ చట్టం రద్దవుతోందా. బుధవారం నాడు ఏపీ మంత్రి మండలి తీసుకున్న ఒక నిర్ణయం బట్టి ఈ అను మానం వస్తుంది. స్థానిక సంస్థల్లో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీ చేసేందుకు అర్హత లేదన్న నియమాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమయిన క్యాబినెట్ నిర్ణయించింది. ఇది పరోక్షంగా ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ప్రోత్సాహం ఇవ్వడమే.

జనాభా నియంత్రణ వల్ల భవిష్యత్‌లో ఉత్పాదక వయసు ఉన్న యువత కొరత ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో వయసు మళ్లిన వారు సుమారు 50 శాతం వరకు ఉన్నారని, మరొక వైపు యువతరం జనాభా తగ్గితే 2047 నాటికి రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన మ్యాన్ పవర్ కొరవడే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ అంటున్నారు. అందుకే ఇద్దరు పిల్లల ఆంక్షలు విధించిన చట్టాన్ని సవరించాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

ఇద్దరు పిల్లలను మాత్రమే కనాలనే చట్టం మొదట ఏపీలో 1993లో వచ్చింది. 1991 జనాభా లెక్కల ప్రకారం జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉండటంతో నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎన్ డిసి) చిన్నకుటుంబాలను ప్రోత్సహించాలని సూచించింది. అపుడే స్థానికసంస్థలలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నుందున ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ వుండరాదనే నియమం పెట్టాలని నిర్ణయించారు. ప్రజా ప్రతినిధులకు చిన్న కుటుంబాలుంటే, ప్రజలు వారిని ఆదర్శంగా తీసుకుంటారని ఎన్ డి సి భావించింది. దీని పర్యవసానంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉండరాదని చట్టం తీసుకువచ్చాయి. ఇద్దరు కంటే ఎక్కువ సంతానం వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అవుతారు. 1993లో ఆంధ్ర ప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు మొదటి సారి ఈ చట్టం తీసుకువచ్చా యి.తర్వాత చాలా రాష్ట్రాలు కూడా ఇలా నియమం అమలుచేశాయి.ఈచట్టం మహిళలకు వ్యతిరేకంగా ఉందని, అట్టడుగు కులాలకు వ్యతిరేకంగా ఉందని, బలవంతపు ఎబార్షన్లకు, భార్యలకు విడాకులు ఇవ్వడానికి దారితీస్తున్నదనే విమర్శలు వచ్చాయి. అయితే, ఈనియమాన్ని మార్చేందుకు ఎవరూ సాహించలేదు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్‌ 2020–47తో అడుగులు వేస్తున్నారు. జనాభా పెరుగుదల ఆగిపోతున్న సమయంలో ఇలాంటి నియమాలు పెట్టి బలవతంతంగా చిన్న కుటుంబాలను ప్రజల మీద రుద్ది తే రానున్న 25 ఏళ్లలో యువకుల సంఖ్య బాగా తగ్గుతుందేమ నని ముఖ్యమంత్రి చాలా కాలంలో ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మానవ నరులు లేకుండా ఏదీ సాధించలేమని ఆర్థికాభివృద్ధికి అవసరమయిన యువకులు అందులో బాటులో ఉండరనేది ఆయన ఆందోళన. ఈ కారణాన గతంలో తీసుకున్న ఇద్దరు పిల్లల షరతు నిర్ణయాన్ని ఉపసంహరిస్తూ ఆ చట్టానికి సవరణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు.

ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన దగ్గర నుంచి పలు చోట్ల చెబుతూ వచ్చారు. యువత ఎక్కువగా ఉంటేనే ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని, ప్రజ్ఞావంతులైన యువతరాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అందులో భాగమే చట్ట సవరణ చేయడమన్నారు. తొందరలో ఈ మేరకు చట్టం సవరించే అవకాశం ఉంది. క్యాబినెట్ నిర్ణయాన్ని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.

"ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఏపీలో సగటు మగవారి సంతాన యోగ్య ( ఫర్టయిలిటీ ఏజ్) వయసు 32.5 సంవత్సరాలు గా ఉంది. తెలిపారు. 2047 వచ్చేసరికి ఇది 40 ఏళ్లు కానుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయని అన్నారు. ఇలాగే మహిళలకు సంబంధించి 29 నుంచి 38 సం. లకు పెరిగనుంది. దానికి తోడు ఆంధప్రదేశ్ లో ఫర్టయిలిటీ రేటు 1.15 మాత్రమే. ఇదే జాతీయ స్థాయిలో 2.11. అందువల్ల సంతానం మీదఆంక్షలుండరాదని ప్రభుత్వం భావిస్తున్నది. రానున్న రోజుల్లో యువకుల వయసు తగ్గి, పెద్ద వయసు వాళ్ల జనాబా పెరిగేపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని పాశ్చాత్య దేశాలు ఓల్డ్‌ ఏజ్‌ హోమ్స్‌గా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ సమతుల్యం తగ్గడం, సంతానోత్పత్తి తగ్గుతుందన్న పరిస్థితులపై మంత్రివర్గ భేటీలో చర్చించాము. . దీన్ని దృష్టిలో పెట్టుకునే మున్సిపల్, పంచాయతీ పరిధిలో ఇద్దరికి మించి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధనను రద్దు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది," అని మంత్రి తెలిపారు.

మున్సిపల్, పంచాయతీ పరిధిలో ఇద్దరికి మించి ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం 1955, ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాలిటీల చట్టం 1965లకు చట్టసవరణల రద్దు కోసం చేసిన ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందని తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖలో కూడా ఇలాంటి నిబంధనే ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం 1994లో చేసిన సవరణను రద్దు చేసేందుకు చేసిన ప్రతిపాదనలను ఆమోదించామన్నారు. 1980, 90 దశకాల్లో జనాభా పెరిగిపోతుందనే ఉద్దేశంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులుగా పేర్కొంటూ చట్ట సవరణ తీసుకొచ్చారని చెప్పారు. సంతానోత్పత్తి రేటు, పనిచేయగల సామర్థ్యం ఉన్న జనాభా గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పిల్లల సంఖ్యపై నిషేధం అనవసరమని భావిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన సవరణకు ఆమోదం తెలిపామని పేర్కొన్నారు.

ఎన్నికల్లో పోటీ చేయడం పౌరుల ప్రాథమిక హక్కు అని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మ్రినిస్ట్రేషన్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ వజ్రాల అంజిరెడ్డి అభిప్రాయ పడ్డారు. రాజ్యాంగంలో ప్రాథమిక్కులకు ఎటువంటి భంగం కలిగినా రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. ఇంత మంది పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అందువల్ల ఎన్నికల్లో పోటీ చేయడానికి, పిల్లల సంఖ్యకు ఎటువంటి సంబంధం లేదు. పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని సవరిస్తే తప్ప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరిపైనా ఎటువంటి ఆంక్షలు లేవు. జనాభాను పెంచాలనుకోవడం, తగ్గించాలను కోవడంపై గతంలో సుప్రీ కోర్టు తీర్పులు ఇచ్చింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సుప్రీ కోర్టు తీర్పులకు విరుద్ధం.

ఎక్కువ మంది పిల్లలను కనడానికి తల్లిదండ్రులు ఇష్టపడటం లేదని ఆంధ్రప్రదేశ్‌ బాలల హక్కుల కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు అన్నారు. ఆయన ఫెడరల్‌తో మాట్లాడుతూ గతంలో ప్రభుత్వమే ఇద్దరు పిల్లలు ముద్దు అంటూ ప్రచారం చేసిందని, ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేశాయన్నారు. పైగా ప్రస్తుతం పెరుగుతున్న అవసరాలు, ఆహార సమస్య కూడా ఎక్కువగానే ఉందని, ఎక్కువ మంది పిల్లలను కని వారిని పెంచలేకపోతే తమనే అందరూ నిందిస్తారనే భావనతో ఒక్కరు లేక ఇద్దరు పిల్లలను మాత్రమే కంటున్నారన్నారు. రాజకీయంగా తీసుకున్న నిర్ణయమని, ఉన్నత వర్గాలే కాకుండా పేద వర్గాల వారు కూడా ఇద్దరి కంటే ఎక్కువ మందిని పుట్టించడం లేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికీ అవకాశం వస్తుందని ప్రభుత్వం చెప్పినా ప్రజల్లో ఆ విధమైన చైతన్యం కంటే పెంచడం కష్టమనే చైతన్యమే ఎక్కువగా ఉందన్నారు. పుట్టిన ఒకరు లేక ఇద్దరు బిడ్డలు బాగా చదువుకుంటే చాలని, వారి కాళ్లపై వారు నిలబడితే తమ లక్ష్యం నెరవేరుతుందనే ఆలోచనలో తల్లిదండ్రులు ఉన్నట్లు చెప్పారు.

ప్రముఖ స్వచ్ఛంద సేవకులు, హెల్ప్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నిమ్మరాజు రామ్మోహన్‌రావు మాట్లాడుతూ పిల్లలను ఎక్కువ మందిని కనేందుకు తల్లిదండ్రులు సుముఖంగా లేరన్నారు. జనాభా నియంత్రణ ఎత్తి వేయడం అనేది కొన్ని వర్గాలకు మాత్రమే అనుకూలమన్నారు. ఆడపిల్లల సంఖ్య తగ్గుతోందని, ఆదిశగా ఆడ బిడ్డలను కనాలనే ప్రచారం సాగాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్రం ఏమంటుందో చూడాల్సి ఉందన్నారు. జనాభా పెరిగితే సమస్యలు కూడా పెరుగుతాయని, జనాభా పెరుగుదలకు అనుగుణంగా భూమి పెరగటం లేదన్నారు. ఇప్పటికే ఆహార పంటలు తగ్గి వాణిజ్య పంటల విస్తీర్ణ పెరిగిందని, భవిష్యత్‌లో ఆహార కొరత కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. దిగుమతుల ద్వారా ఆహార ధాన్యాలు తెచ్చుకోవాలంటే అన్ని వర్గాలకు కొనుగోలు చేసే శక్తి ఉండదన్నారు.

రానున్న రోజుల్లో శక్తివంతమైన యువతరం అవసరం ఉంటుందని, మంచిగా చదువుకున్న వారికి ఎక్కడైనా అవకాశాలు ఉంటాయని, ఎంత మంది పిల్లలనైనా కనేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదని చట్టం తీసుకు రావడం శుభ పరిణామమేనన్నారు చైల్డ్‌ వెల్‌ఫేర్‌ కమిటీ కృష్ణా జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్‌ బివిఎస్‌ కుమార్‌. పిల్లల సంఖ్య పెరగటం వల్ల భవిష్యత్‌లో రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతారన్నారు. ప్రస్తుతం నడివయసు వారి సంఖ్య జనాభాలో సగం ఉన్నందున భవిష్యత్‌ ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఎంత మంది పిల్లలను కనాలనేది తల్లిదండ్రుల ఇష్టంపై ఆధారపడి ఉంటుందని దళిత మహిళా శక్తి అధ్యక్షురాలు గడ్డం ఝాన్సి అన్నారు. మనం కనమంటే కనరు. ముందు పేదరికం పోవాలి. పరిస్థితులు మారాలి. వివక్ష, పేదరికం ఎప్పుడైతే పోతాయో అప్పుడు మాత్రమే పేదలు పిల్లలను కనేందుకు ఇష్ట పడతారు తప్ప ఇప్పుడు ఇష్ట పడటం లేదన్నారు. కుల సైన్యాలను పెంచుకునేందుకు మాత్రమే ఈ రకమైన చర్యలు ఉపయోగపడతాయన్నారు. మన పక్క దేశమైన చైనా జనాభాలో అందరికంటే ముందున్నా అక్కడ పేదరికం లేదని చెప్పొచ్చన్నారు. కానీ ఈ దేశంలో పేదరికం పెద్ద సమస్యగా పరిణమిస్తోందన్నారు.

Next Story