ఉచిత గ్యాస్ పథకం ఈనెల 29న బుకింగ్ మొదలై 31న ప్రారంభ మవుతుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఇప్పటి వరకు వెల్లడించలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సరఫరా పథకం విధి విధానాలు ఏమిటనేది ఇంతవరకు ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే ఈనెల 31వ తేదీలోపు ఉచిత గ్యాస్ సిలెండర్లు అంతుతాయని మాత్రం పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఏదైనా ఒక పథకం ప్రారంభించాలంటే అందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అందరూ భావించారు. అయితే అటువంటిదేమీ లేదని మంత్రి చెబుతున్న మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ ఉన్న తెల్లరేషన్ కార్డు దారులు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,48,43,671 రేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లైతే ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఉచితంగా గ్యాస్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఏడాదికి రూ. 2,684 కోట్లు ఖర్చు
ప్రభుత్వానికి ఏడాదికి రూ. 2,684 కోట్లు ఉచిత గ్యాస్ పథకానికి ఖర్చవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇది ఏ లెక్కన ప్రకటించారనే చర్చ జరుగుతోంది. ఒక్కో సిలెండర్ ధర ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం రూ. 894.92లు. ఈ లెక్కన మొత్తం రేషన్ కార్డులతో లెక్క వేస్తే ఒక్క సారి ఉచితంగా ఇచ్చే సింలెండర్‌ల కోసం ప్రభుత్వం సుమారు రూ. 1,300 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ. 5,200 కోట్లు పథకం కోసం ఖర్చవుతుంది. కానీ అందులో సగం మాత్రమే ఏడాది ఖర్చని ప్రభుత్వం ప్రకటించడంతో సగం మంది తెల్లరేషన్ కార్డులు ఉన్న వారికి కూడా పథకం వర్తించే అవకాశం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనిపై సరైన క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత మంత్రిపై ఉంది.
గ్యాస్ కనెక్షన్ లేని తెల్లరేషన్ కార్డు దారుల పరిస్థితి ఏమిటి?
రాష్ట్రంలో సుమారు కోటిన్నర తెల్లరేషన్ కార్డులు ఉంటే అందులో చాలా మందికి గ్యాస్ కనెక్షన్‌లు లేవు. అంటే వారికి గ్యాస్ పథకం అమలు కానట్టేనని స్పష్టమైంది. ఉచిత గ్యాస్ అనగానే కొత్తగా కనెక్షన్ లేని వారు కూడా దరఖాస్తు చేసుకుంటే తమకు కనెక్షన్ వస్తుందని భావించారు. కానీ ప్రస్తుతం కనెక్షన్ ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని అర్థమైంది.
విధి విధానాలు ఏవి?
ప్రభుత్వం ఈనెల 29 నుంచి బుక్ చేసుకున్న అర్హులైన వారందరికీ గ్యాస్ ఉచితంగా వస్తుందని, ఈ పథకాన్ని ఈనెల 31న దీపావళి సందర్భంగా ప్రారంభిస్తున్నామని వెల్లడించింది. ఇందుకోసం ఏదైనా అర్జీ పెట్టాలా? దరఖాస్తు ఏదైనా ఉందా? సచివాలయంలో పేరు రిజిస్టర్ చేయించుకోవాలా? అనే సందేహాలకు సమాధానాలు లేవు. మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్న ప్రకారం మూడు ఆయిల్ కంపెనీల వారితో ఒప్పందం కుదుర్చుకున్నామని, బుకింగ్ కాగానే లబ్ధిదారుకు ఉచిత గ్యాస్ పథకం కింద గ్యాస్ ఉచితంగా మీకు ఇస్తున్నామని మెసేజ్ వస్తుంది. సిలెండర్ మీరు తీసుకున్న తరువాత 48 గంటల్లో లబ్ధిదారుని అకౌంట్‌లో డబ్బులు డిబిటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) పద్ధతి ద్వారా జమ అవుతాయని చెప్పారు. అంటే ఉచిత గ్యాస్ పథకానికి ఎటువంటి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని తేలిపోయింది.
లబ్ధిదారులను గురించేది ఆయిల్ కంపెనీల వారా?
ఆయిల్ కంపెనీలకు ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది. వారి నుంచి లబ్ధిదారుల అకౌంట్‌కు జమ అవుతాయని సివిల్ సప్లైస్ వారు చెబుతున్నారు. నిజానికి గ్యాస్ తీసుకోగానే లబ్దిదారుడు గ్యాస్ కంపెనీకి డబ్బులు చెల్లిస్తున్నాడు. అలాంటడప్పుడు గ్యాస్ కంపెనీకి మళ్లీ డబ్బలు ఇచ్చి వారి ద్వారా బ్యాంకు అకౌంట్‌లకు వేయించాల్సిన అవసరం ఏమిటి? లబ్ధిదారుల జాబితా, వారి బ్యాంకు ఖాతా వివరాలు ప్రభుత్వం వద్ధ ఉంటాయి కాబట్టి వారే నేరుగా లబ్ధిదారులకు ఇవ్వొచ్చు. కానీ ఇవేవీ ఇంతవరకు ప్రభుత్వం వెల్లడించలేదు. లబ్ధిదారునికి ఉచితంగా సిలెండర్ అందిందా? లేదా? అనేది ముఖ్యమని, మధ్యలో జరిగే ప్రాసెస్ అంతా ప్రభుత్వానికి ఆయిల్ కంపెనీల వారి మధ్య ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతానికి ఉచిత గ్యాస్ లబ్ధిదారులు ఎవరనే దానిపై ప్రభుత్వం చెబుతున్నట్లుగా లబ్ధిదారుల్లో స్పష్టత లేదు. ఎందుకంటే ప్రభుత్వం చెబుతున్న దానికి, ఉన్న లబ్ధిదారుల జాబితాకు చాలా తేడా ఉంది. అంటే చాలా మంది అర్హులైనా గ్యాస్ పథకం అమలయ్యే పరిస్థితులు లేవనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా తెల్లరేషన్ కార్డు దారుల్లోనే కాకుండా ఇతరుల్లో కూడా జరుగుతోంది.
Next Story