చెప్పింది వినాలి. ప్రశ్నించడం మానేయాలి. ఇది జరుగుతున్నది ఎక్కడో గుర్తించారా? ఇది కూడా తెలియదంటే రాష్ట్ర రాజకీయాల గురించి సరైన అవగాహన లేదని అర్థం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీది ఒక రకమైన శైలి. ఆ పార్టీలో ఎవరైనా ప్రశ్నించడం మానేయాలి. చెప్పింది చేయాలి. లేకుంటే సీటు లేదు. పార్టీలో చోటు లేదు. ఎమ్మెల్యే అంటే ఏమి చేయాలో నేను చెబుతా. అది చేస్తే చాలు మీ సొంత తెలివితేటలు అవసరం లేదు. పైగా ఐప్యాక్ వాళ్లు ఉన్నారు. వాళ్లు సర్వేలు చేసి సమాచారం ఇస్తారు. ఈ సర్వే ఏమిటి ఇలా ఉందని అడగ కూడదు. అలా అడిగితే ఆ నాయకుడు రాజకీయాలకు పనికి రాడు. ఇదీ ఇప్పుడు వైఎస్సార్సీపీలో జరుగుతున్న వ్యవహారం
జగన్ వద్ద ఎవరి సొంత తెలివితేటలు పనికిరావు
రాజకీయాల్లో తలపండిన వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ సొంత తెలివితేటలు, ఆలోచనలు వైఎస్సార్సీపీకి అవసరం లేదు. అయితే ఆయన సీఎం జగన్ కు ఒక సలహా చెప్పారు. ఎమ్మెల్యే కాగానే సలహాలు చెప్పే స్థాయికి వచ్చారని భావించిన జగన్ ఏకంగా 2024 ఎన్నికల్లో సీటు లేకుండా చేశారు. ఇక కృష్ణప్రసాద్ రాజకీయ భవిష్యత్ కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేసిన వసంత నాగేశ్వరరావుకు ఎంతో మంచి పేరు వచ్చింది. హోం మంత్రిత్వ శాఖకు ఆ రోజుల్లో గొప్ప పేరు తీసుకొచ్చారు నాగేశ్వరరావు. ఆ బాటలోనే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వసంత నిర్ణయించారు.
ఇంతకూ జగన్ కు ఇచ్చిన సలహా ఏమిటి?
మూడు రాజధానుల వ్యవహారం మంచిది కాదు. రాజధాని ఇక్కడుండటం మంచిది. మనం ముందుగా ఇచ్చిన మాట ప్రకారం కనీసం సెక్రటేరియట్ అయినా ఇక్కడ ఉంచితే బాగుంటుందన్నారు కృష్ణప్రసాద్ దీంతో జగన్ కు చిర్రెత్తుకొచ్చింది. అయితే ఆయన కూడా అప్పటి కప్పుడు ఒక ఎమ్మెల్యేను పోగొట్టుకోలేక ఇప్పటి వరకు వేచి చూశారు. కృష్ణప్రసాద్ పై వేటు వేశారు.
నియోజకవర్గానికి డబ్బులు అడుగుతారా?
నియోజకవర్గ అభివద్ధికోసం డబ్బులు అడిగాడు. పైసా ఇవ్వలేదు. వైఎస్సార్ హయాంలో నందిగామ అభివద్ధి కోసం నిధులు కావాలంటే రూ. 100 కోట్లు ఇచ్చారు. జగన్ హయాంలో మైలవరం అభివద్ధికోసం నిధులు అడిగితే రూ. 100లు కూడా ఇవ్వలేదు. అదీ వైఎస్సార్ కు, జగన్ కు వున్న తేడా అంటూ ఆవేదన వెళ్ళగక్కారు వసంత. అది నిజమే ఆయన అనుకున్న లీడర్లు ఉన్న నియోజకవర్గాలకు నిధులు అందాయి. మిగిలిన వాళ్లకు ఇవ్వలేదు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా పైసా ఇవ్వలేదు. అందుకే ఆయన పార్టీ నుంచి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే వసంత కృష్ణప్రసాద్ తన అనుచరులతో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయించారు. అయతే మైలవరం టిక్కెట్ తెలుగుదేశం ఇస్తుందా? ఇవ్వదా? అనేది మాత్రం ప్రశార్థకమే. కృష్ణప్రసాద్ పై ఇప్పటికే టీడీపీ ఇన్ చార్జ్ దేవినేని ఉమామహేశ్వరావు నిప్పులు చెరుగుతున్నారు. ఇటువంటి దశలో వసంతకు టిక్కెట్ దక్కుతుందని చెప్పలేము. వసంతకు టిక్కెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ తరపున దేవినేని ఉమామహేశ్వరావుకు ఇక టిక్కెట్ లేనట్లే.
ప్రతిపక్షాలను తిట్టాల్సిందే..
ప్రతిపక్షాలను తిట్టాల్సిందే. లేదంటే వైఎస్సార్సీపీలో నేతలకు అవకాశం ఉండదు. ఎన్నికల పోరులో వారు పనికి రారు. అందుకే కొత్తవారిని నియమిస్తారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం నియోజకవర్గంలో పెద్దగా తెరపైకి రాని వ్యక్తి సర్నాల తిరుపతిరావు యాదవ్. ఈయన జడ్పీటీసీ మాత్రమే. నియోజకవర్గంలో ఈయన ప్రభావం ఏమేరకు ఉంటుందని ఐప్యాక్ వారు రిపోర్టు ఇచ్చారో తెలియదు కానీ అతనికి మైలవరం వైఎస్సార్సీపీ టిక్కెట్ ఇచ్చింది వైఎస్సార్సీపీ.