ఎన్టీఆర్ వంటి వ్యక్తి మళ్లా పుట్టడు. పుట్టాలంటే ఎన్టీఆర్ మళ్లీ పుట్టాలే తప్ప మరొకరు ఎన్టీఆర్‌లా పుట్టరని అన్నారు. ఎన్టీఆర్‌కి వచ్చిన గుర్తింపు ఇంకెవరికీ రాదన్నారు. టీడీపీ ఏర్పాటయ్యే నాటికి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చూస్తే.. పెత్తందారీ వ్యవస్థతో కూడిన పరిపాలన ఉండేదని, సామాన్యలకు దీనికి అవకాశం ఉండేది కాదన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చోటు ఉండేది కాదన్నారు. షెడ్యూల్డ్ కులాల వారికైతే చదువు లేని వారిని పెట్టి రాజకీయాలు నడిపించే వారని పేర్కొన్నారు. వారిపైనే పెత్తనం చేసే రోజులవి అని వివరించే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయన్నారు. చదువుకున్న వారిని రాజకీయాల్లోకి తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. రాష్ట్రం బాగుండాలంటే యువరక్తం రావాలన్నారు. అంతవరకు ట్రడిషనల్‌గా ఉన్న పాలిటిక్స్ పోవాలన్నారు. చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలని ఆలోచనలు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.
టీడీపీ లేకుండా చేయాలని చాలా మంద్రి ప్రయత్నాలు చేశారని, అలాంటి వారందరూ కాల గర్భంలో కలిసి పోయారని, టీడీపీని ఏమి చేయలేక పోయారని, తెలుగు వారు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. టీడీపీకి మనమంతా వారసులం మాత్రమేనని, పెత్తందారులం కాదన్నారు. తాను కూడా పార్టీకి అధ్యక్ష్యణ్ని, టీమ్ లీడర్‌ను మాత్రమేనని, ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాలన్నారు. 43 ఏళ్లల్లో ఎన్నో సంక్షాభాలు వచ్చాయని, అయినా విజయాలు సాధిస్తూ వచ్చామన్నారు. పార్టీనే ప్రాణంగా పని చేసే పసుపు సైన్యానికి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మానవత్వంతో టీడీపీ పని చేస్తుందన్నారు. బయట తాను ఎంతగా పోరాటం చేస్తున్నానో.. పార్టీలో కూడా అంతే పోరాటాలు చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేసిన నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు ఉండాలన్నారు. గ్రామ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయికి ఎదగాలి, పొలిట్‌బ్యూరోలో అడుగు పెట్టాలనేదే తన లక్ష్యమన్నారు.
పార్టీ ముందు ఒక ప్రతిపాదనను ఉంచినట్లు చెప్పారు. మూడు సార్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవులకైనా వెళ్లాలి, లేదంటే ఒక టర్మ్ బ్రేక్ తీసుకోవాలి అని పేర్కొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తాను నాలుగో సారి ఉన్నాను, ఈ సంస్కరణ తనతోనే మొదలు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇలా జరిగితేనే పార్టీలో కదలిక వస్తుంది. యువతకు అవకాశాలు కల్పించాలన్నారు. తన స్టైల్ ఒకటే అని, సీనియర్లను, జూనియర్లను గౌరవించుకుంటూనే, పని చేసే వాళ్లకు గుర్తింపు ఇస్తూ పదవుల్లో ప్రమోషన్ ఇస్తానని వెల్లడించారు. పార్టీలో యువరక్తం పారాలన్నారు. మరో 40 ఏళ్ల పాటు పసుపు జెండా రెపరెపలాడాలన్నారు. కార్యకర్తలకు ప్రమాద బీమా రూ. 2 లక్షల నుంచి రూ. 5లక్షలకు పెంచామన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటి వరకు రూ. 140 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. అంతకుముందు టీడీపీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. వేలాదిగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు.