నాన్నా, చంపొద్దు నాన్నా.. పసి మనసుల వేడుకోలు
x

నాన్నా, చంపొద్దు నాన్నా.. పసి మనసుల వేడుకోలు

వినిపించుకోని తండ్రి.. కన్నకూతుళ్లనే కాలువ పాలు చేసిన కసాయితనం


అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. "నువ్వేం తండ్రివిరా నాయనా.. చంపొద్దని వేడుకున్నా వినకుండా కన్న బిడ్డలనే కడతేర్చావా?" అంటూ ఆ ఊరి జనం కన్నీరుమున్నీరవుతున్నారు. కన్నతండ్రే కాలయముడై ఇద్దరు ఆడబిడ్డలను కాలువలోకి తోసేసిన అమానుష ఘటన అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గ్రామానికి చెందిన కల్లప్పకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు సింధు, అనసూయ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదు, ఆరు తరగతులు చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో బిడ్డలిద్దరూ ఇంట్లోనే ఆడుకుంటున్నారు. ఆ పసిబిడ్డలకు తెలియదు.. తమతో ఆడుకోవాల్సిన తండ్రే తమ ప్రాణాలు తీస్తాడని. మాయమాటలు చెప్పిన కల్లప్ప, వారిని హెచ్‌ఎల్‌సీ (HLC) కాలువ వద్దకు తీసుకెళ్లాడు.
పరుగెత్తినా వదల్లేదు.. పట్టుకొచ్చి మరీ చంపేశాడు!
కాలువ వద్దకు వెళ్లగానే కల్లప్ప అసలు స్వరూపం బయటపడింది. మొదట పెద్దమ్మాయిని నిర్దాక్షిణ్యంగా నీటిలోకి తోసేశాడు. అది చూసి భయంతో వణికిపోయిన చిన్నమ్మాయి ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగెత్తింది. కానీ, ఆ కసాయి తండ్రిలో కించిత్తు జాలి కలగలేదు. పరుగెత్తుతున్న చిన్నారిని వెంటాడి పట్టుకొచ్చి, ఆ నీటిలోనే కలిపేశాడు. తన అక్క చనిపోవడం కళ్లారా చూసిన ఆ పసిపాప, తండ్రిని ఎంతలా వేడుకుని ఉంటుందో అని తలచుకుంటేనే గుండెలు తరుక్కుపోతున్నాయి.
నిలదీస్తే బయటపడ్డ నిజం
సాయంత్రం అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కల్లప్పను నిలదీశారు. మొదట పొంతన లేని సమాధానాలు చెప్పిన అతడు, ఆ తర్వాత అసలు విషయం చెప్పాడు. ఒకసారి కర్ణాటక సరిహద్దులోని కాలువలో తోశానని, మరోసారి గ్రామ సమీపంలోనే తోశానని చెబుతూ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. దీంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
ఒకరి మృతదేహం లభ్యం.. మరొకరి కోసం గాలింపు
పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టగా, పెద్ద కుమార్తె అనసూయ మృతదేహం కాలువలో దొరికింది. అప్పటివరకు ఆడుతూ పాడుతూ కళ్లముందే ఉన్న చిన్నారి నిర్జీవంగా పడి ఉండటం చూసి గ్రామం మొత్తం కన్నీటి సంద్రమైంది. రెండో కుమార్తె సింధు ఆచూకీ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. కల్లప్పను ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి, విచారణ జరుపుతున్నారు.
Read More
Next Story