గంజాయి మత్తులో మంత్రికే చుక్కలు చూపిన యువకులు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంత్రి సుభాష్‌కు కొందరు యువకులు చుక్కలు చూపించారు. మేం కాపులం అంటూ బట్టలు విప్పి హంగామా చేశారు. పోలీసులు, స్థానికుల ఆపినా ఆగకుండా..
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వారికి భరోసా కల్పించడానికి, వారి సమస్యలను తెలుసుకోవడానికి స్వయంగా మంత్రులు వెళ్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. వరద భాదితులకు కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయా లేదు. వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద బాధితుల కష్టాలను తెలుసుకోవడానికి మంత్రి సుభాష్ బయలుదేరారు. కాగా అల్లూరి జిల్ల గంగవరం మండలం మసకపల్లికి వెళ్తున్న క్రమంలో ఆయన కాన్వాయ్‌ని కొందరు కుర్రాళ్లు అడ్డుకున్నారు. కారు ముందు పడుకుని పోనివ్వమంటూ హంగామా చేశారు.
బట్టలు విప్పి హంగామా..
‘మేము కాపులం’ అంటూ మంత్రి కాన్వాయిని కొందరు యువకులు అడ్డుకున్నారు. బట్టలు విప్పి, కారు ముందు పడుకుని.. మేము కాపులం ఏం చేస్తావ్ అంటూ హల్‌చల్ చేశారు. కాగా వారు గంజాయో, మద్యం మత్తులో ఉన్నారని గుర్తించిన పోలీసులు వారిని అతి బలవంతంపైన పక్కను పంపి మంత్రి కాన్వాయ్‌కి దారి ఇచ్చారు. వారందరిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారంతా కూడా రాజమండ్రికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే వారంతా కూడా గంజాయి మత్తులో ఉండే ఇలా చేశారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. దీనిపై పోలీసులు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
అయితే రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి వినియోగం పెరిగిపోయింది. యువత గంజాయికి బానిసలై తమ ఉజ్వలభవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని కూటమి ప్రభుత్వ నేతలు పలువురు ఇప్పటికే వాపోయారు. ఈ నేపథ్యంలోనే గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. హోం మంత్రి వంగలపూడి అని అధ్యక్షతన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల వినియోగాన్ని కట్టడి చేయడంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయినా.. ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట గంజాయి మత్తులో వీరంగం సృష్టిస్తున్న వారిని చూస్తూనే ఉన్నాం. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.