ప్రచార బరిలోకి భారతి.. జగన్‌కు కలిసొచ్చేనా..
x

ప్రచార బరిలోకి భారతి.. జగన్‌కు కలిసొచ్చేనా..

పులివెందులలో సీఎం జగన్ భార్య వైఎస్ భారతి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తున్నారు.


ఆంధ్ర ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రతి పార్టీ గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. అదే విధంగా ప్రచారాల విషయంలో కూడా ఏమాత్రం తగ్గేదేలా అంటున్నాయి. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పులివెందులలో పార్టీ తరపున ప్రచార పగ్గాలను జగన్ భార్య భారతి చేపట్టనున్నారని అప్పట్లో ప్రచారం సాగింది. అదే విధంగా తాజాగా పులివెందుల ప్రచారంలో వైఎస్ భారత్ దూసుకెళ్తున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తూ పులివెందుల ప్రజలను ఆమె ఆప్యాయంగా పలకరిస్తూ వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రచారంలోకి అడుగుపెట్టిన వైఎస్ భారతికి పులివెందుల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలకు పలకరించడానికి వస్తున్న భారతికి అక్కాచెల్లెలు, అవ్వలు అందరూ కూడా సొంత కూతురిలా స్వాగతం పలుకుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

ప్రజలు హ్యాపీ

ఎన్నికల ప్రచారం ప్రారంభించిన వైఎస్ భారత్.. పులివెందులలోని ప్రజలంతా జగన్ పాలనలో సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించానని తెలిపారు. ‘‘పులివెందులలో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. మరోసారి సీఎం జగన్ పాలనకే ఓటేయాలని ప్రజలు నిశ్చయించుకుని ఉన్నారు. జగన్ పాలనలో తమ జీవితాల్లో ఎంతో మార్పు వచ్చిందని వారు నాకు వివరించారు. అందుకే 2024 ఎన్నికల్లో జగన్‌కు లక్ష మెజారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు’’అని భారత్ వెల్లడించారు.

మేనిఫెస్టోపై ప్రజల అసంతృప్తి

అంతేకాకుండా జగన్ చెప్పారంటే చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉందని, వైసీపీ మేనిఫెస్టో చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని భారతి వివరించారు. కానీ మేనిఫెస్టోపై వైసీపీ పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. ప్రచారం చెప్పినంతగా మేనిఫెస్టోలో ఏమీ లేదని, ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలకే మరో రెండు మూడూ వందల రూపాయలు పెంచుతున్నాట్లు ప్రకటించారని పార్టీ వర్గాలు, ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా పెన్షన్ విషయంలో ఒకవైపు చంద్రబాబు.. తాము గెలిచిన వెంటనే పింఛన్‌ను రూ.4000 చేస్తామని చెబుతుంటే.. జగన్ మాత్రం 2029 నాటికి రూ.3,500 చేస్తానడటం విడ్డూరంగా ఉందని పార్టీ వర్గాలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా ఇలా అయితే ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

భారతి ప్రచారం కలిసొచ్చేనా!

పులివెందులలో వైఎస్ భారతి చేస్తున్న ప్రచారం జగన్ గెలుపుకు కలిసొస్తుందా అంటే విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. మేనిఫెస్టోనే తుస్సుమనిపించేలా ఉందని, ఇప్పుడు భారతి ఎంత ప్రచారం చేసినా దాని ప్రభావం ఆశించిన, ఊహించిన స్థాయిలో ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఎప్పుడైనా ప్రజలు తమ నేతను చూడాలనుకుంటారే తప్ప ప్రాక్సీని కాదని, జగన్ తరపున భారతి ప్రచారం పావలా వంతు మాత్రమే వైసీపీ విజయానికి దోహదం చేస్తుందని వారు భావిస్తున్నారు. కానీ వైసీపీ పార్టీని, జగన్ పేరును మహిళల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం భారతి ప్రచారం కీలకంగా మారుతుందని, ఆ ఉద్దేశంతోనే భారతిని బరిలోకి దించి ఉంటే వైసీపీ ప్లాన్ సక్సెస్ అయినట్లేనని వారు అంటున్నారు. కానీ భారతి ప్రచారం వైసీపీ గెలుపుకు ఎంత వరకు ఊతమిస్తుందంటే మాత్రం ఫలితాలు వస్తేనే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఉంటుందని వారు చెప్తున్నారు.

Read More
Next Story