తల్లి ఏడుస్తున్నా పట్టించుకోని జగన్.. భారతి కూడా..
x

తల్లి ఏడుస్తున్నా పట్టించుకోని జగన్.. భారతి కూడా..

వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్, షర్మిల నివాళులు అర్పించారు. అక్కడ తల్లి కంటతడి పెట్టుకుంటున్నా తనకు పట్టనట్లు జగన్ ఎందుకు వెళ్లిపోయారు?


ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని వైసీపీ అధినేత జగన్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌కు చేరుకుని తండ్రికి నివాళులు అర్పించారు. తల్లి విజయమ్మ, భార్య భారతి, పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి వైఎస్ జగన్.. ఇడుపులపాయకు విచ్చేశారు. తన భర్త అనిల్, తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ షర్మిల తన తండ్రికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో ఓ ప్రత్యేక సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు.

‘‘నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం.జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా… చివరివరకూ మా కృషి’’ అని జగన్ పోస్ట్ పెట్టారు.

తల్లి కన్నీరు పెట్టుకున్నా పట్టించుకోని జగన్

నివాళులు అర్పించిన అనంతరం జగన్ తన తల్లి విజయమ్మను ఆలింగనం చేసుకున్నారు. ఆ క్షణంలో విజయమ్మ తన ఆవేదనను ఆపుకోలేక అక్కడే కంటతడి పెట్టుకున్నారు. కానీ అదేమీ పట్టించుకోకుండా జగన్ వెళ్లిపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భారతి కూడా విజయమ్మను ఓదార్చే ప్రయత్నం చేయలేదు. ఇతర బంధువులు వచ్చి విజయమ్మను ఓదారుస్తున్నా తమకు పట్టనట్లు జగన్, ఆయన సతీమణి వెళ్లిపోవడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తల్లి కంటతడిని తుడవలేని కొడుకు.. రాష్ట్ర ప్రజల కష్టాలను, కన్నీటిని పట్టించుకుంటారా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై మరి జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే విజయమ్మ కంటతడి పెట్టుకోవడాన్ని జగన్ గమనించలేదని, గమనించి ఉంటే తప్పకుండా ఆగి ఉండేవారని కూడా వైసీపీ శ్రేణులు అంటున్నాయి.

విజయమ్మ సందేశం

ఈ రోజున కూడా విజయమ్మ ప్రతి ఒక్క తల్లికి గొప్ప సందేశం ఇచ్చారు. పిల్లలు ఇద్దరు శత్రువుల తరహాలో మారినా తల్లి మాత్రం ఒకరికే మద్దతుగా ఉండకూడదని ఆమె చూపారు. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో భాగంగా దివంగత నేతకు నివాళులు అర్పించే కార్యక్రమంలో జగన్‌తో కలిసి పాల్గొన్న విజయమ్మ.. ఆ తర్వాత షర్మిలతో కలిసి కూడా పాల్గొని ప్రార్థనలు కూడా చేశారు. దీనిని చూసిన వారంతా కూడా తల్లిగా ఇద్దరు బిడ్డలను సమానంగా చూస్తానని విజయమ్మ మరోసారి నిరూపించారని ఆమెను ప్రశంసిస్తున్నారు. అక్కడ నివాళులు అర్పించిన అనంతరం షర్మిల.. మంగళగిరికి బయలుదేరారు.

Read More
Next Story