నా మతం మానవత్వం.. నాలుగు గోడల మధ్యే బైబిల్: జగన్
x

నా మతం మానవత్వం.. నాలుగు గోడల మధ్యే బైబిల్: జగన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ, బీజేపీపై నిప్పులు చెరిగారు. హిందూ మతానికి ప్రతినిధులమని చెప్పుకుంటున్న బీజేపీ,


వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ, బీజేపీపై నిప్పులు చెరిగారు. హిందూ మతానికి ప్రతినిధులమని చెప్పుకుంటున్న బీజేపీ వాళ్లకు భారత రాజ్యాంగం ఏమి చెబుతుందో గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఓ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని తన మతమేమిటని అడుగుతారా అని నిలదీశారు. నా కులమేమిటీ, మతమేమిటని అడుగుతారా అని విస్మయం వ్యక్తం చేశారు. నా మతం మానవత్వం అన్నారు. నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానన్నారు. బయటికివస్తే తనకు అన్ని మతాలు సమానమేనని చెప్పారు. సమస్యల్ని పక్కదోవ పట్టించే క్రమంలో భాగంగానే చంద్రబాబు నాయుడు ఇప్పుడు డిక్లరేషన్ నాటకాన్ని బయటకు తీశారని, చంద్రబాబు ఏది చేసినా రాజకీయమేనన్నారు.

ఏపీలో రాక్షస రాజ్యం..

ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందంటూ చంద్రబాబు క్షుద్ర రాజకీయాలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దేవుడి దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునేందుకు చూస్తున్నారని.. నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు.

‘‘వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులిచ్చి అడ్డుకున్నారు. దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. దర్శనానికి వెళ్తామంటే అరెస్ట్‌ చేస్తామంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను తిరుపతికి రప్పించారు. బీజేపీ అగ్రనాయకత్వానికి ఈ విషయం తెలుసా?’’ అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

‘‘వేలాది మంది పోలీసులను మోహరించారు. లడ్డూ వివాదంలో డైవర్షన్‌ కోసమే ఇవన్నీ చేస్తున్నారు. లడ్డూ పవిత్రతను దెబ్బతీస్తూ బాబు అడ్డంగా దొరికిపోయారు. రాజకీయ దుర్భుద్ధితోనే లడ్డూ విశిష్టతను దెబ్బ తీశారు. జంతువుల కొవ్వు కలిపినట్లు దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టాడు. ఆరు నెలకొకసారి నెయ్యి కొనుగోలు టెండర్లు జరుగుతాయి. ఎల్‌1 ఎవరొచ్చారో వారికే టెండర్లు ఇస్తారు. దశాబ్ధాలుగా ఈ ప్రక్రియనే జరుగుతూ ఉంది. ప్రతి ట్యాంకర్‌ ఎన్‌ఏబీఎల్‌ సర్టిఫికెట్‌ తేవాలి. ట్యాంకర్‌ వచ్చాక కూడా టీటీడీ 3 టెస్టులు చేస్తుంది. ఒక్క టెస్ట్‌ ఫెయిల్‌ అయినా ట్యాంకర్‌ను వెనక్కి పంపుతారు. బాబు హయాంలో కూడా 15 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపారు. మా హయాంలో కూడా 18 సార్లు వెనక్కి పంపాం. తిరుమలలో ఇంత గొప్ప వ్యవస్థ ఉంది.’’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు.

‘‘జూలై 6, 12 తేదీల్లో నాలుగు ట్యాంకర్లు వచ్చాయి. ఆ నాలుగు ట్యాంకర్లు టెస్టులు ఫెయిల్‌ అయ్యాయి. టెస్టులు ఫెయిల్‌ అయిన 4 ట్యాంకర్లను వెనక్కి పంపారు. టెస్ట్‌లు ఫెయిల్‌ అయితే మైసూర్‌ ల్యాబ్‌కు పంపుతారు.. కానీ మొదటిసారిగా ఈ శాంపిల్స్‌ను గుజరాత్‌కు పంపారు. ట్యాంకర్లను వెనక్కి పంపి సదరు కంపెనీకి నోటీసులు ఇచ్చారు. 2 నెలల తర్వాత చంద్రబాబు యానిమల్‌ ఫ్యాట్‌ కలిసిందన్నారు. ఆ మరుసటి రోజే టీడీపీ ఆఫీస్‌లో ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను బయటపెట్టారు.’’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.

‘‘కల్తీ నెయ్యి ప్రసాదాలకు వాడలేదని ఈ నెల 20న ఈవో చెప్పారు. ఈ నెల 22న ఈవో ఇచ్చిన నివేదికలో కూడా ట్యాంకర్ల వెనక్కి పంపినట్లు ఉంది. అయిన సరే బాబు కల్తీ నెయ్యి కలిసిందని అబద్ధాలు చెప్పారు. అబద్ధాలతో చంద్రబాబు తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. భక్తుల్లో అనుమానపు బీజాలు వేయడం దుర్మార్గం కాదా?రాజకీయ స్వార్థం కోసం లడ్డూ ప్రతిష్టను దిగజారుస్తున్నావ్‌’’ అంటూ వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

Read More
Next Story