‘వైసీపీ ఏనాడైనా సాకులు చెప్పిందా’.. చంద్రబాబుకు జగన్ చురకలు
x

‘వైసీపీ ఏనాడైనా సాకులు చెప్పిందా’.. చంద్రబాబుకు జగన్ చురకలు

కూటమి సర్కార్‌పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని రంగాలను నిర్వీర్యం చేయడమే ధ్యేయంగా కూటమి పాలన ఉందని విమర్శించారు.


‘‘అధికారంలోకి రాకముందు నుంచి కూడా చంద్రబాబు.. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో అడ్డగోలుగా హామీలు ప్రకటించి ప్రజలకు ఆశ చూపారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసే ఎత్తకుండా మోసం చేశారు’’ అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు విపక్ష పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నా.. వీరిలా తమ ప్రభుత్వం ఎప్పుడూ కుంటిసాకులు చెప్పి ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగొట్టలేదని వ్యాఖ్యానించారు. మాడుగుల నియోజకవర్గ ఎంపీటీసీలు, జడ్జీటీసీలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వంతో పాటు పరిస్థితులు కూడా మారాయని, కూటమి సర్కార్ వచ్చినప్పటి నుంచి ప్రజలు భయాందోళనల్లో బతుకుతున్నారని, చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని అంతా నిరాశ నిస్పృహలతో ఉన్నారని అన్నారు.

మాట తప్పింది లేదు..

‘‘వైసీపీ పాలనలో పరిస్థితులు ఎలా ఉన్నా సరే.. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేశాం. ప్రజలకు ఇచ్చిన మాటను ఏనాడూ తప్పలేదు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, కురాల్‌లా భావించాం. ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కట్టుబడి పనిచేశాం. ప్రతి ఇంటికి మంచి చేశాం. ప్రభుత్వ పథకాలను ఇంటి గడపలకు చేర్చాం. చేసిన మంచి ఎక్కడికీ పోదు. 2029 ఎన్నికల నాటికి మనం చేసిన మంచే మనకు శ్రీరామ రక్షలా ఉంటుంది’’ అని ధైర్యం చెప్పారు. వైసీపీ నేతలపై కేసులు పెరుగుతున్న క్రమంలో పార్టీ కార్యకర్తలు భయాందోళనలకు గురవుతున్నారన్న సమారాం అందడంతో వారిలో ధైర్యం నింపారు జగన్.

జగనే బెస్ట్

‘‘చంద్రబాబు చేస్తున్న మోసాలకు ప్రజల్లో ఇప్పటికే ఆగ్రహజ్వాలలు రాజుకున్నాయి. అవి ఎప్పుడు కార్చిచ్చులా అంటుకుంటాయో ఎవరూ అంచనా వేయలేరు. ప్రస్తుతం ప్రజలంతా వైసీపీ పాలనే బెస్ట్ అంటున్నారు. జగన్ పలావు పెట్టాడు.. బాగానే చూసుకున్నాడు. కానీ చంద్రబాబు బిర్యానీ పెదతానని మోసం చేస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు బిర్యానీకి ఆశపడి ఓటేస్తే.. ఉన్న పలావ్ కూడా పోయిందని, ఇస్తాన్న బిర్యానీని కూడా చంద్రబాబు ఇవ్వట్లేదని ప్రజలు మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రజలు పస్తులుండాల్సిన పరిస్థితులను తీసుకొచ్చిన ఘటన చంద్రబాబుదే’’ అని చురకలంటించారు.

జగన్ ఉంటే అవన్నీ అందేవి..

‘‘ఇప్పుడు అధికారంలో జగనే ఉండి ఉంటే స్కూలుకు వెళ్తున్న ప్రతి పిల్లాడికి రూ.15000 చొప్పున తల్లికి అమ్మఒడి అందేది. రైతులకు రైతు భరోసా అందేది. సున్నావడ్డీ రుణాలు అందేవి. విద్యాదీవెన కింద ఫీజ్ రియింబర్స్‌మెంట్, వసతి దీవెన, మత్స్యకార భరోసా, వాహన మిత్ర ఇలా మరెన్నో సంక్షేమాలు అందుతుండేవి. చేనేతలకు నేస్తం కూడా ఇప్పటికే ఖాతాల్లో పడిపోయి ఉండేవి. ఆగస్టు నేలాఖరుకల్లా ప్రతి ఏటా వీటిని వైసీపీ అందించింది. పథకాల అమలు చాలా సహజంగా జరిగింది. ఇప్పుడు వైసీసీ సర్కార్ లేకపోవడంతో ఇవేవీ జరగవని ప్రజలు అంటున్నారు’’ అని జగన్ వెల్లడించారు.

ఒకప్పుడు ప్రతి ప్రభుత్వ పథకం ఇంటికే వచ్చేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటూ వాలంటీర్ వ్యవస్థను పక్కనబెట్టిన పరిస్థితిని గుర్తు చేశారు జగన్. కానీ ఇప్పుడు ఏ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీల చుట్టూ, టీడీపీ నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వైసీపీ హయాంలో అభివృద్ధి పథంలో పయనించిన ఆంధ్రప్రదేశ్‌ను కూటమి ప్రభుత్వం తిరోగమించేలా చేస్తోందని, ప్రభుత్వ పథకాలు కావాలంటే మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగే పరిస్థితిని తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి రైతులకు ఇచ్చే బీమా ప్రీమియంలను కూడా కూటమి కట్టడం లేదని పేర్కొన్నారు.

‘‘ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలలో పంట బీమా ప్రీమియం చెల్లించేవాళ్లం. జూన్‌‌లో ఇన్సూరెన్స్ డబ్బులు, రైతు భరోసా డబ్బులు ఇచ్చేవాళ్లం. పెట్టుబడులకు రైతులకు సహాయం అందించేవాళ్లం. ఇప్పుడు అవేమీ లేవు. చంద్రబాబు.. రాష్ట్రంలోని ప్రతి రంగాన్ని మోసం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అడుగడునా మోసమే కనిపిస్తోంది’’ అని విమర్శలు గుప్పించారు.

విద్యార్థుల జీవితాలో ఆటలా..

‘‘ఈ కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని కూడా వదలకుండా నిర్వీర్యం చేసేస్తోంది. పాఠశాలల్లో టోఫెల్ పీరియడ్‌ను తీసేశారు. ప్రపంచంతో పోటీ పడేలా విద్యా విధాన్ని వైసీపీ అభివృద్ధి చేసింది. కానీ కేవలం వైసీపీ చేసిందన్న కారణంతో ప్రపంచంతో పోటీపడేలా ఉన్న చదువులను కూటమి నిర్వీర్యం చేస్తోంది. విద్యాకానుక పంపిణీని అస్తవ్యస్తం చేసింది. వైసీపీ చెప్పిన ట్యాబ్‌లను కూడా విద్యార్థులకు అందిస్తారన్న నమ్మకం లేదు. మధ్యాహ్న భోజనం పథకం అమలులో భాగంగా ప్రతిరోజూ సిద్ధం చేసే మెనూ ప్రక్రియను కూడా అస్తవ్యస్తం చేసింది. ప్రతి ఒక్కరికీ ఇంగ్లీషు మీడియం చదువులు అందించాలని వైసీపీ తాపత్రయపడితే.. కూటమి మాత్రం ఇంగ్లీషు మీడియం చదువులను అటకెక్కించాలని చూస్తోంది’’ అని ధ్వజమెత్తారు.

Read More
Next Story